డాక్టర్లు డుమ్మా.. వరంగల్​ జిల్లాలో అధ్వానంగా వైద్యం

by Disha Web Desk 9 |
డాక్టర్లు డుమ్మా.. వరంగల్​ జిల్లాలో అధ్వానంగా వైద్యం
X

దిశ, దుగ్గొండి: వరంగల్ ​జిల్లాలో పశువైద్యంపై అందని ద్రాక్షగా మారింది. కొందరి పనితీరుతో పశువైద్య శాఖ అధ్వానంగా తయారైంది. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన పశు వైద్య శాలలు, సబ్ సెంటర్లు లక్ష్యానికి దూరమవుతున్నాయి. డాక్టర్లు సిబ్బంది ఎప్పుడొస్తారో, ఆస్పత్రులు ఎప్పుడు తెరుస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల వైద్యులు వారానికి ఒకటి, రెండు రోజులు మాత్రమే విధులకు హాజరవుతుండడంతో సేవలు గగనమవుతున్నాయి. ప్రతిరోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పశు సంవర్ధకశాఖ డిస్పెన్సరీలు తెరిచి ఉంచాలి. మధ్యాహ్నం ఒక గంట భోజన విరామం మినహాయింపు ఉంటుంది. కానీ చాలాచోట్ల సమయపాలన పాటించడం లేదు. వైద్యుల నుంచి దిగువ స్థాయి సిబ్బంది వరకు అందరూ జిల్లా కేంద్రం, మండల కేంద్రాల నుంచే రాకపోకలు సాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆస్పత్రుల్లో సక్రమంగా సేవలు అందడం లేదని పాడిరైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని వివిధ డిస్పెన్సరీలను పరిశీలించగా పశువైద్య సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది.

ఇదీ సిబ్బంది పరిస్థితి..

జిల్లాలో పశుసంవర్ధక శాఖ ద్వారా పాడి రైతులకు సేవలు అందించేందుకు నర్సంపేట డివిజన్‌లలో ఆరు మండలాలతో పాటు ప్రస్తుతం జిల్లాలో ఒక జేడీ, ముగ్గురు ఏడీలు, 26 మంది వెటర్నరీ అసిస్టెంట్లు పని చేస్తున్నారు. ఐదుగురు వెటర్నరీ లైవ్‌స్టాక్‌ అసిస్టెంట్లు ఉన్నారు. జూనియర్‌ వెటర్నరీ ఆఫీసర్స్‌ 17 మంది పనిచేస్తున్నారు. వెటర్నరీ అసిస్టెంట్లు 18 మంది ఉన్నారు. ఆఫీస్‌ సబార్డినేట్‌ పోస్టులు 55 గానూ 33 మంది ఉన్నారు. డీఈఓస్‌, ఆఫీస్‌ సూపరింటెండెంట్‌ వంటి పోస్టుల్లో అందరూ ఉన్నారు. మొత్తం జిల్లాలో 160 మందికి 136 మంది విధులు నిరవహిస్తుండగా 27 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీరంతా క్షేత్రస్థాయిలో సేవలు అందజేయడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని పాడిరైతులు ఆరోపిస్తున్నారు. దీనిపై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పశు సంవర్ధక శాఖను గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

అదనపు బాధ్యతల సాకుతో...

ఇప్పటికే నిర్లక్ష్య ధోరణితో విధులు నిర్వహిస్తున్న పశు వైద్యులకు ఒక్కరికి మూడు, నాలుగు గ్రామాల స్పెషల్ ఆఫీసర్ల అదనపు బాధ్యతలు అప్పగించడంతో ఇదే అదునుగా వైద్యులు విధులకు ఎగనామం పెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.. వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవటంతో సేవలు అరకొరగానే అందుతున్నట్లు పాడిరైతులు చెబుతున్నారు. పల్లెల్లో అత్యవసరమైనప్పుడు కాంపౌండర్లు కూడా అందుబాటులో ఉండకపోవడంతో వైద్యం అందక పాడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

డాక్టర్ లేడు.. వీఎల్ ఓనే దిక్కు..

దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామంలోని సబ్ సెంటర్ లో కొన్నేళ్లుగా డాక్టర్ లేకపోవడంతో వీఎల్ ఓనే పూర్తిస్థాయిలో పశువైద్యం చేస్తున్నాడు. కాని ఇక్కడున్న రైతులు పశువులను తీసుకోని దుగ్గొండి లేదా తొగర్రాయి వైద్యశాలలకు వెళ్లి పశువులకు వైద్యం చేయించుకుంటున్నారు. వెంకటాపురంలో లైవ్‌స్టాక్‌ అసిస్టెంట్‌, గోపాలమిత్రలు వైద్య సేవలు అందజేస్తున్నారు.

వ్యాక్సినేషన్, మందుల కొరత ..

గ్రామీణ పశువైద్యశాలలో మౌలిక సదుపాయాలు లేక పాడిరైతులు ఇబ్బందులు పడుతున్నారు. మందులు, వ్యాక్సిన్లు లేకపోవడంతో ప్రైవేట్‌గా కొనుగోలు చేసుకోవాలని సిబ్బంది చెబున్నారని పాడి రైతులు వాపోతున్నారు.

నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు..

విధులకు సకాలంలో హాజరు కాని వైద్యులపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటాం. మందుల కొరత ఉన్న మాట వాస్తమే. సరిపడా మందులు తెప్పించి సకాలంలో పశువులకు వైద్యం అందించేలా చూస్తాం.

–ఎం బాలకృష్ణ , సహాయ సంచాలకులు, పశువైద్య శాఖ, వరంగల్ జిల్లా

Next Story

Most Viewed