జనగామలో టికెట్​ఫైట్.. పల్లా vs ముత్తిరెడ్డి

by Disha Web Desk 12 |
జనగామలో టికెట్​ఫైట్.. పల్లా vs ముత్తిరెడ్డి
X

దిశ, జనగామ: జనగామ బీఆర్ఎస్‌లో టికెట్ పంచాయితీ తారాస్థాయికి చేరింది. సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కి వ్యతిరేకంగా పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు చాపకింద నీరులా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్సీ రాజేశ్వర్ రెడ్డి కి టికెట్ కేటాయించాలంటూ మద్దతుగా కొంతకాలంగా కార్యకర్తల నుంచి అభిప్రాయ సేకరణ రహస్యంగా సాగుతోంది. ఈ క్రమంలో ఇటీవల జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి నర్మెట జెడ్పీటీసీ శ్రీను నాయక్ మధ్య జరిగిన సంభాషణ ఆడియో కలకలం సృష్టించింది. ఇప్పటివరకు సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి టికెట్ తనకే వస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నాడు. కానీ, ఎప్పుడైతే ఆడియో బయటపడిందో అప్పటి నుంచి పల్లా వర్గీయులు పకడ్బందీగా ముత్తిరెడ్డికి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నట్లు బహిర్గతమైంది. పల్లా రాజేశ్వర్ రెడ్డికి మద్దతుగా జనగామ కు చెందిన కొందరు ముఖ్య నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి జనగామ టికెట్ కేటాయించాలని కోరే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు.

జనగామ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ముత్తిరెడ్డిపై అనేక వివాదాలు ఉన్నాయి. దీంతో పల్లా రాజేశ్వర్ రెడ్డి వర్గీయులు ముత్తిరెడ్డిపై ఉన్న వ్యతిరేకతను అవకాశంగా మలుచుకోవాలని భావించారు. ఈ క్రమంలో పల్లా కొంతకాలంగా నియోజకవర్గంలోని ముఖ్య నేతలను అందరినీ ఏకతాటిపై తెచ్చి సీఎం కేసీఆర్‌ను కలవాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఇందులో భాగంగానే బుధవారం చేర్యాల, జనగామ, నర్మెట ప్రాంతాలకు చెందిన నాయకులతో జెడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి, ఆ పార్టీ నాయకులు శ్రీనివాస్, రాజిరెడ్డి, లింగయ్య మరికొందరు హైదరాబాద్ కు చేరుకుని సీఎంకు జనగామ పరిస్థితిని నివేదించాలనుకున్నారు. ఇంతలో ముత్తిరెడ్డికి ఈ రహస్య భేటీ సమాచారం తెలియడంతో హుటాహుటిన ప్రగతి భవన్‌కు వెళ్లి సీఎం కలిసినట్లు తెలిసింది.

తలనొప్పిగా మారిన కూతురు వ్యవహారం..

మరోవైపు ముత్తిరెడ్డి కూతురు తుల్జా భవాని రెడ్డి కొంతకాలంగా ఎమ్మెల్యే పై తీవ్రస్థాయిలో పోరాటం చేస్తుంది. స్వయంగా తన తండ్రి కబ్జాకోరు అంటూ బాహటంగా విమర్శలు చేసిన సంగతి కూడా విధితమే. దీంతో ముత్తిరెడ్డి పై ప్రజల్లో, పార్టీ నాయకుల్లో నమ్మకం పోయింది. అంతేకాకుండా గతంలో జిల్లా కలెక్టర్ దేవసేన కూడా స్వయంగా ముత్తిరెడ్డి భూ ఆక్రమణకు పాల్పడుతున్నాడంటూ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లింది. ఫలితంగా ప్రజల్లో, పార్టీ కార్యకర్తల్లో కాస్త అసంతృప్తి నెలకొంది. ఇదే అదనుగా భావించిన పల్లా రాజేశ్వర్ రెడ్డి తెరవెనుక పార్టీ నాయకులను కలుసుకుంటూ తనకు మద్దతు తెలపాలంటూ ఈ విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయేందుకు పక్కాగా స్కెచ్ వేశారు. ఈ క్రమంలో ఇప్పటికే రాజేశ్వర్ రెడ్డి జనగామ టికెట్ పై ఫోకస్ చేసి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది.

తెరపైకి బీసీ నినాదం..

మరోవైపు ముత్తిరెడ్డి పై అసంతృప్తితో ఉన్న కొందరు బీసీ నాయకులు మాజీ ఎమ్మెల్యే రాజలింగం కుమారుడు కిరణ్ ను ప్రజాక్షేత్రంలో ఉండాలంటూ సపోర్ట్ చేస్తూ పార్టీలో ఇంటర్నల్ గా గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి చుట్టూ తిరుగుతూ బీసీ సామాజిక వర్గానికి చెందిన కిరణ్ కు టికెట్ ఇవ్వాలని కూడా కోరినట్లు సమాచారం. ముత్తిరెడ్డి పై ఉన్న వ్యతిరేకతను బీసీ సామాజిక వర్గానికి చెందిన నాగపురి కిరణ్ కూడా సొమ్ము చేసుకోవాలని పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తుంది. చేర్యాల ప్రాంతంలోని కొన్ని మండలాల్లో పట్టుండడం, పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా జనగామ ప్రజలకు కాస్త దగ్గర అయ్యారు. బీసీ సామాజిక ఓట్లను క్యాష్ చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తూనే ఇదిలా ఉంటే ఎలాగైనా ఈసారి టికెట్ దక్కించుకోవాలని ముమ్మర ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు. ఇందులో భాగంగా ఈయన కూడా ప్రగతి భవన్ చుట్టూ తిరుగుతూ ముఖ్యమంత్రిని ఇప్పటికే పలుసార్లు కలిశాడు.

పావులు కదుపుతున్న పోచంపల్లి..

మరోవైపు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కూడా జనగామ గడ్డ పై కన్నేసి అధిష్టానాన్ని ఒప్పించి పోటీ చేసేందుకు సిద్ధపడ్డారని కూడా తెలుస్తుంది. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డిలో ఒకరికి ఈసారి జనగామ టికెట్ ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో పోచంపల్లి జనగామలో కొన్ని స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహించడం, పండుగలు ఇతర ఇతర కార్యక్రమాలకు సాయం చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాడు. ఈ ప్రాంత కార్యకర్తలు, నాయకులకు విరాళంగా ఇవ్వడం, సామాజిక కార్యక్రమాల్లో ఆయన పాల్గొనడం కొంతకాలంగా జరుగుతుంది.

ఇలా జనగామ బీఆర్ఎస్ పార్టీలో నాయకులు రెండు వర్గాలుగా విడిపోయి పల్లాకు టికెట్ ఇప్పించాలని కొందరు, ముత్తిరెడ్డి కేటాయించాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తుల్జా భవాని, చేర్యాలకు చెందిన మాజీ ఆప్కో చైర్మన్ మండల ముత్తిరెడ్డి పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తి ఆయనకు టికెట్ ఇవ్వకూడదని బాటంగానే పార్టీని కోరారు. జనగామ టికెట్ రాజకీయం రసకందాయంలో పడింది. బుధవారం రాత్రి వరకు కూడా ముత్తిరెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసే టికెట్ తనకే కేటాయించాలని కోరుతున్నట్లు కూడా సమాచారం.

Next Story

Most Viewed