ఆ కుటుంబం 40 ఏళ్లు పాలించిన అభివృద్ధి శూన్యం: పుట్ట మధూకర్‌

by Disha Web Desk 11 |
ఆ కుటుంబం 40 ఏళ్లు పాలించిన అభివృద్ధి శూన్యం: పుట్ట మధూకర్‌
X

దిశ, మహాముత్తారం: మంథని నియోజకవర్గంలో ఒక కుటుంబం 40 ఏళ్లు పరిపాలన చేసినా అభివృద్ధే శూన్యమని, ఒక బ్రిడ్జి కట్టిన దాఖలాల్లేవని, ఈ నాలుగేండ్ల నుంచి జరిగిన బహుజన పాలనపై ప్రజలు చర్చ జరుపాల్సిన అవసరం ఉందని బీఆర్‌ఎస్‌ మంథని నియోజకవర్గ ఇంచార్జి, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం రెడ్డిపల్లి గ్రామానికి నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సును భూపాలపల్లి జడ్పీ చైర్‌ పర్సన్‌ జక్కు శ్రీహర్షిణీ రాకేష్‌తో కలిసి ఆయన గురువారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పుట్ట మధుకర్ మాట్లాడుతూ సోషల్‌మీడియా ద్వారా నిత్యం తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ దుర్బాషలాడుతున్నా తాను ఏనాడు బాధపడలేదని, ఏదో ఒకరోజు వాళ్లే బాధపడుతారని ఆయన అన్నారు. ఏళ్ల తరబడి అభివృద్దికి దూరమైన రెడ్డిపల్లి గ్రామాన్ని చూసైనా వారికి జ్ఞానోదయం కావాలన్నారు. 40 ఏండ్లు ప్రజల ఓట్లతో గెలిచిన పాలకులు ప్రజలను మనుషులుగా చూడలేదని అనడానికి రెడ్డిపల్లి నిదర్శనమన్నారు. అయితే నాలుగేండ్లు బీసీ బిడ్డకు అవకాశం ఇస్తే ఎలాంటి అభివృధ్ది జరుగుతుందో రెడ్డిపల్లిలో జరిగిన అభివృద్దే సాక్ష్యమన్నారు.

ఆనాడు వర్షం వస్తే ఎటు పోవాలని, విపత్తు వస్తే ఎట్లా బతకాలని రెడ్డిపల్లి వాసులు అపనమ్మకంతో ఉండేవారని, కానీ ఈ నాలుగేండ్లలో రెడ్డిపల్లికి రోడ్ల సౌకర్యం కల్పించడంతోపాటు నూతన గ్రామపంచాయతీగా చేసి వారి అపనమ్మకాన్ని పోగొట్టి హైదరాబాద్‌లో ఉన్నవాళ్ల తరహాలో దైర్యంగా ఉండేలా అవకాశం కల్పించిన చరిత్ర తమదేనని ఆయన స్పష్టం చేశారు. రెడ్డిపల్లి గ్రామంలో పల్లెనిద్ర చేసిన సారు నీళ్లు ఇస్తామని మాట ఇచ్చి మర్చిపోయారని ఆయన ఎద్దేవా చేశారు. కానీ నాలుగేండ్ల కాలంలోనే రింగ్‌రోడ్డుపై ఎనిమిది బ్రిడ్జిలు, మోదేడు గ్రామానికి రహదారి కల్పించామని అన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ శాంత కుమార్, నాయకులు మందల రాజిరెడ్డి, మార్క రాము గౌడ్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed