పంచాయతీ కార్మికుడు అనుమానస్పద మృతి.. మృతదేహంతో పోలీస్ స్టేషన్ ఎదుట ముస్లింల ధర్నా

by Disha Web Desk 11 |
పంచాయతీ కార్మికుడు అనుమానస్పద మృతి.. మృతదేహంతో పోలీస్ స్టేషన్ ఎదుట ముస్లింల ధర్నా
X

దిశ, ఏటూరునాగారం: మంగపేట గ్రామ పంచాయతీ కార్మికుడు షేక్ యాకూబ్ పాషా (33) ఆదివారం రాత్రి మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ సమీపంలో అనుమానస్పదంగా మృతి చెందడం సంచలనంగా మారింది. విషయం తెలుసుకున్న యాకుబ్ పాషా బంధువులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ఏటూరునాగారం సామాజిక ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం యూకుబ్ పాషా తల్లి మహిబూబ్ బీ, చెల్లె షబానా(బేబీ), బంధువులు, మండల కేంద్రానికి చెందిన సుమారు 200 మంది యాకుబ్ పాషా మృతదేహంతో పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.

ఈ సందర్బంగా కుటుంబ సభ్యులు, బంధువులు మాట్లాడుతూ ఆదివారం రాత్రి మండల కేంద్రానికి చెందిన ఓ కొబ్బరి బొండాల వ్యాపారి షాపులో యాకుబ్ పాషా విద్యుత్ బల్బులు దొంగతనం చేశాడని చావ బాదాడని ఆ దెబ్బలకే యాకుబ్ పాషా రాత్రి చనిపోయాడని ఆరోపించారు. యాకుబ్ పాషాను వ్యాపారి కొట్టిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయని అతడిని అరెస్టు చేసి తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. రంజాన్ మాసంలో భాగంగా ఉపవాసాలతో ఉన్న ముస్లింలు రెండు గంటల పాటు శవంతో పోలీసు స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. స్థానిక ఎస్ఐ విధుల్లో లేకపోవడంతో సిబ్బంది ఏటూరునాగారం సీఐ రాజుకు సమాచారం ఇచ్చారు.

ఈ విషయమై సీఐ ఆందోళనకారులతో ఫోన్ లో మాట్లాడి యాకుబ్ పాషా కుటుంబానికి న్యాయం చేస్తామని నిందితుడిని అరెస్ట్ చేస్తామని నచ్చచెప్పినా వారు నిందితుడిని అరెస్ట్ చేసేదాకా తాము నిరసన విరమించేదిలేదని భీష్మించుకున్నారు. రంజాన్ నెల ఉపవాసాల వేళ గంట గంటకు పరిస్థితి ఉధృతంగా మారుతుండడంతో ఏం జరుగుతుందోననే ఆందోళన వ్యక్తమవుతుంది. పోలీసులు ఎంత నచ్చ చెప్పినా వినని ముస్లింలు ధర్నాను ఉదృతం చేసే దిశలో పోలీస్ స్టేషన్ నుంచి వైఎస్ఆర్ సెంటర్, గంపోనిగూడెం క్రాస్ రోడ్డులకు చేరుకుని యాకుబ్ పాషా మృతదేహంతో ధర్నా నిర్వహిస్తూనే ఉన్నారు. పరిస్థితిని పరిశీలిస్తున్న సీఐ ఏటూరునాగారం నుంచి మంగపేటలోని ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో సంప్రదింపులు చేస్తున్నారు.

Next Story

Most Viewed