దవాఖానాల్లో దొంగలు..పీహెచ్​సీల్లో వరుస చోరీలు

by Dishanational2 |
దవాఖానాల్లో దొంగలు..పీహెచ్​సీల్లో వరుస చోరీలు
X

మహబూబాబాద్​ జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలనే టార్గెట్‌గా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్నారు. నిరుపేదలకు వైద్యసేవలందించే ఆస్పత్రులను లూటీ చేస్తున్నారు. తాళం వేసిన ఇండ్లు, వ్యాపార వాణిజ్య సంస్థల్లో దొంగతనాలు జరగడం సహజం. కానీ మానుకోటలో మాత్రం అందుకు భిన్నంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో చోరీలు జరగడంతో వైద్యులు బెంబేలెత్తుతున్నారు. గత డిసెంబర్​ నుంచి వరుస దొంగతనాలు చేస్తూ పోలీసులకు సవాల్​ విసురుతున్నారు.

కేసముద్రం, నెల్లికుదురు, బయ్యారం, గూడూరు, ఇనుగుర్తి, మహబూబాబాద్, గార్ల మండలాల్లోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. విలువైన కంప్యూటర్లు, సామగ్రి, ఇన్వర్టర్లు, కంటి వెలుగు అద్దాలు, మందులు, సిరంజీలను కూడా వదలకుండా ఎత్తుకెళ్లారు. ఆరోగ్య కేంద్రాల్లో ఎక్కువగా సీసీ కెమెరాలు, వాచ్​ మ్యాన్స్ లేకపోవడం, పలు చోట్ల సీసీ కెమెరాలు ఉన్నా పనిచేయకపోవడంతో దొంగలు తమ పని కానిచ్చేస్తున్నారు. పోలీసుల నిఘా కొరవడడంతోనే దొంగతనాలు పెరిగిపోతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

దిశ, మహబూబాబాద్ ప్రతినిధి : చిల్లర దొంగలకు ప్రతీ వస్తువు విలువైనదే. ఇండ్లు, వ్యాపార వాణిజ్య సంస్థల్లోకి చొరబడి దొంగలు దోచుకెళ్లడం వినిఉంటాం. కానీ, మహబూబాబాద్ జిల్లాలో దొంగలు రూట్ మార్చారు. జిల్లాలో కొన్ని నెలలుగా ప్రభుత్వ దవాఖానలను లూటీ చేస్తున్నారు. సిరంజీలను కూడా వదలడం లేదు. జిల్లాలోని కేసముద్రం, నెల్లికుదురు, బయ్యారం, గూడూరు, ఇనుగుర్తి, మహబూబాబాద్, గార్ల మండలాల్లోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో దొంగలు పడి దోచుకున్నారు. కొన్ని సెంటర్ల తాళాలు పగలగొట్టారు. వరుస దొంగతనాలతో వైద్యులు బెంబేలెత్తుతున్నారు. కొన్ని నెలలుగా జిల్లా పరిధిలోని వివిధ ఆస్పత్రుల్లో కంప్యూటర్లు, టీవీలు, ఇన్వర్టర్లు, బ్యాటరీలు, సిరంజీలు, పరీక్ష నమూనా పరికరాలు, కంటి వెలుగు కళ్లద్దాలను ఎత్తుకెళ్లారు.

చోరీకి గురైనని ఇవే..

కేసముద్రంలో కంప్యూటర్ మానిటర్, టీవీ, నెల్లికుదురులో ల్యాప్ టాప్, కంప్యూటర్, మహబూబాబాద్ మండలం మాల్యలలో కంప్యూటర్, కంటి వెలుగు సామగ్రి, గార్ల మండలంలో రూ.32 వేల విలువైన ఇన్వర్టర్​బ్యాటరీ లు, బయ్యారంలో సుమారు రూ.70 వేల విలువైన ఇన్వర్టర్ సామగ్రి, గూడూరు మండలంలోని తీగలవేణిలో కంప్యూటర్, పరీక్ష పరికరాలు, మెడికల్ సామగ్రి చోరీకి గురయ్యాయి. దీంతో ఆయా పీహెచ్ సీల డాక్టర్లు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.

డిసెంబర్ నుంచి మొదలు..

గతేడాది డిసెంబర్ నుంచి జిల్లా లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లలో దొంగతనాలు జరుగుతున్నాయి. తలుపులు, కిటికీలు పగల గొట్టి చోరీలకు పాల్పడుతున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సమస్యలకు నిలయాలు గా మారాయి. అరకొర వసతులతో మూలుగుతున్న ఆరోగ్య కేంద్రాల్లో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. జిల్లాలో కొన్ని సెంటర్లలో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ అవి అలంకారప్రాయంగా మారాయి. దీంతో ఎప్పుడు ఎవరు వస్తున్నారో, ఏం చేస్తున్నారో, దవాఖానలో ఏం జరుగుతుందో తెలియని దుస్థితి నెలకొంది. కొన్ని దవాఖానలకు ప్రహరీ, సెక్యూరిటీ లేకపోవడంతోనే దొంగతనాలకు దారి తీస్తుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి జిల్లా వ్యాప్తంగా అన్ని సెంటర్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు పని చేయని వాటికి మరమ్మతులు చేయాలని వైద్యులు కోరుతున్నారు.

ప్రత్యేక టీంలు ఏర్పాటు చేస్తున్నాం..

ప్రభుత్వ దవాఖానల్లో వరుస దొంగతనాలపై ప్రత్యేక టీంలు ఏర్పాటు చేశాం. త్వరలోనే దొంగలను పట్టుకుంటాం. దొంగతనాలపై పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నాం. చోరీలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు

-ఏఎస్పీ చెన్నయ్య



Next Story

Most Viewed