ఏది ఏమైనా ఒక విషయంలో మాత్రం ఓటర్లకు క్లారిటీ వచ్చింది: KTR

by GSrikanth |
ఏది ఏమైనా ఒక విషయంలో మాత్రం ఓటర్లకు క్లారిటీ వచ్చింది: KTR
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపించిందని అన్నారు. గ్యారంటీలపై మాట మార్చడంతో కాంగ్రెస్‌ను నమ్మేందుకు ప్రజలు వెనుకాడారని తెలిపారు. దాడులు, కేసులు, కుట్రలను తాము సమర్ధవంతంగా తిప్పికొట్టామని అన్నారు. బీజేపీపైనా ప్రజల్లో సానుకూలత లేదని చెప్పారు. పదేళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్నా బీజేపీ వల్ల ఒరిగిందేమీ లేదని అందరికీ తెలిసిపోయిందని విమర్శించారు. నిత్యావసరాలు, సిలిండర్ల ధరలు పెరగడంతో బీజేపీపై ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోందని అన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో సీనియర్, బలమైన నాయకులకు తాము ఎంపీ టికెట్లు ఇచ్చామని తెలిపారు.

చివరి నిమిషంలో వచ్చిన పారాచ్యూట్ లీడర్లకు కాంగ్రెస్‌ టికెట్లు ఇచ్చిందని విమర్శించారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు తాము ధీటుగా పోటీ ఇచ్చామని అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో కుస్తీ, గల్లీలో దోస్తీ అన్నట్లుగా కాంగ్రెస్, బీజేపీ వ్యవహారం ఉందని ఎద్దేవా చేశారు. ఆరు, ఏడు సీట్లలో రేవంత్ రెడ్డి డమ్మీ అభ్యర్థులను పోటీలో పెట్టారని అన్నారు. బీజేపీ ఎంపీల గెలుపు కోసం కిషన్ రెడ్డి కంటే ఎక్కువగా రేవంత్ రెడ్డి కష్టపడ్డారని విమర్శించారు. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే బీఆర్ఎస్ లీడర్లు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై దృష్టి సారించారు. న‌ల్లగొండ - వ‌రంగ‌ల్ - ఖ‌మ్మం జిల్లాల ప్రజాప్రతినిధుల‌తో కేటీఆర్ బుధ‌వారం భేటీ కానున్నారు. బీఆర్ఎస్ త‌రపున ఏనుగుల రాకేశ్ రెడ్డి పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

Advertisement

Next Story