ఎవరూ అధైర్య పడొద్దు..!

by Disha Web Desk 20 |
ఎవరూ అధైర్య పడొద్దు..!
X

దిశ, నర్సంపేట : ఎన్నికల్లో మనం గెలవలేదని ఎవరూ అధైర్య పడొద్దని బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పెద్దిసుదర్శన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో అమలులో ఉన్న పథకాల కంటే కొత్త పథకాలు, గ్యారంటీలు గొప్పగా ఉంటాయని చేసిన ప్రచారమో లేక దుష్ప్రచారం వల్ల ఈ సారి మనకు అవకాశం రాలేదన్నారు. ఉద్యమ నేపథ్యంలో కలిగిన వారికి పోరాటాలు, గెలుపు ఓటములు కొత్తేమీ కాదన్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాత్రింబవళ్లు కష్టపడి తన కోసం పని చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు మొదటగా కృతజ్ఞతలు తెలిపారు. అందరినీ ఆత్మీయంగా పలకరించడం కోసమే ఈ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రానున్న ఎన్నికలకు సంబంధించి మాట్లాడుతూ అత్యధిక స్థానాలను బీఆర్ఎస్ పార్టీకి తీసుకువచ్చే బాధ్యత తనదేనన్నారు. నర్సంపేట నియోజకవర్గ బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికి మాటిస్తున్నానన్నారు. ఖచ్చితంగా మళ్లీ నియోజకవర్గంలో ప్యానల్ పెడతానని ధీమా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ నేతల పై పెద్ది ఫైర్..

కేసీఆర్ ని ఒప్పించి, మెప్పించి ప్రత్యేకంగా నర్సంపేట నియోజకవర్గ రైతుల కొరకు 50 శాతం సబ్సిడీ కింద వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా రూ. 75 కోట్ల నిధులను రాజకీయాలకతీతంగా తీసుకొచ్చిన సంగతిని గుర్తు చేశారు. తెచ్చినవన్ని దొంగ జీవోలని చెన్నారావుపేట కాంగ్రెస్ పార్టీ నేతలతో కేసుపెట్టించడం ఏంటని ప్రశ్నించారు. ఇంత దిగజారుడు రాజకీయాలు తగవన్నారు. గడచిన వారం రోజులకే చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 ఏండ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ కూడా, ఎవరి మీద తప్పుడు వ్యాఖ్యలు చేయలేదన్నారు. ప్రభుత్వం ఎక్కడైనా దొంగ జీవోలు ఇస్తదా అని ప్రశ్నించారు. ఇప్పుడు ప్రభుత్వం మీదే కదా.. దమ్ముంటే వ్యవసాయ శాఖ మంత్రితో సమీక్ష, స్థానిక జిల్లా కలెక్టర్ తో రివ్యూ పెట్టాలని డిమాండ్ చేశారు. దొంగ జీవో లైతే కాంగ్రెస్ పార్టీ రైతులకు లబ్ధి ఎలా జరిగింది. సబ్సిడీ ఎలా వచ్చిందన్నారు. కనీస ఇంగిత జ్ఞానం ఉండాలి కదా అని ఎద్దేవా చేశారు. దీనిపై సమీక్షించే అధికారం ఉన్నప్పటికీ ఇలాంటి దుష్ప్రచారాలు చేయడం పద్ధతి కాదన్నారు. నర్సంపేట శాసనసభ్యుడిగా రాష్ట్రంలో ఎక్కడా లేని పథకాలను రూపకల్పన చేసి అధికంగా రూ.700 కోట్ల నిధులు తీసుకు వచ్చినట్లు గుర్తు చేశారు. ఒక్క ప్రాజెక్టు వెనక్కి పోయిన, ఒక్క రూపాయి ల్యాప్స్ అయిన కాంగ్రెస్ వెంట పడతామని, ప్రజాక్షేత్రంలో నిలదీస్తామని స్పష్టం చేశారు.

Next Story

Most Viewed