GWMC : బల్దియాలో గోల్‌మాల్..! దోచుకున్నోళ్లకు దోచుకున్నంత‌..

by Gopi |
GWMC : బల్దియాలో గోల్‌మాల్..! దోచుకున్నోళ్లకు దోచుకున్నంత‌..
X

దిశ, వరంగల్‌టౌన్: అభివృద్ధి పనుల్లో కమీషన్లు, ఖాళీ జాగల కబ్జాలు, పైరవీల్లోనే కార్పొరేటర్లు కాకలు తీరిపోయారనుకుంటే.. చివరకు కాంట్రాక్ట్‌ ఉద్యోగ నియామ‌కాల్లోనూ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ప్రజాప్రతినిధులే కాదు, పలుకుబడి కలిగిన నాయకులు పెత్తనం చలాయిస్తున్నారు. ఏకంగా తమ సంబంధీకులను కాంట్రాక్ట్‌ పనుల్లో ఇరికించి అధికార పార్టీ పవర్‌ ప్రదర్శిస్తున్నారు. ఆఖరికి పని చేయకుండానే నెలనెలా వేతనాలు అందుకుంటూ రాచరికపు వారసత్వానికి ప్రతినిధులుగా తిరుగుతుండ‌టం గ‌మ‌నార్హం. అప్పనంగా ప్రజాధనం కొల్లగొడుతూ గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు అల్లుళ్లుగా వైట్‌ కాలర్‌ చౌర్యానికి పాల్పడున్నారు. ఇటీవల ఓ ఉన్నతాధికారి పర్యవేక్షించడంతో ఈ విషయం బయటకు రాగా, ఆనోటా ఈనోటా ఇప్పుడు బల్దియాలో ప్రధానచర్చగా మారింది.

వ‌రంలా శానిటేష‌న్ విభాగంలో నియామ‌కాలు

సాధారణంగా బల్దియాలో శానిటేషన్‌ విభాగంలోనే తరచూ నియామకాలు జరుగుతుంటాయి. ఇదే క్రమంలో రెండేళ్ల క్రితం సుమారు 452 మందిని నియమించుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియలోనే పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు జరిగాయంటూ కొన్ని రోజుల క్రితం దుమారమే చెలరేగింది. కొంతమందిని అన్యాయంగా తీసేశారంటూ ప్రత్యక్ష ఆందోళనలకు సైతం దిగారు. ఈ విషయమై బల్దియాలో పలువురు నిరసనలు వ్యక్తం చేశారు. ఒక మహిళా కార్మికురాలు అధికారుల తీరుపై దుమ్మెత్తిపోసింది కూడా. ఈ అంశంపైనే బల్దియా గ్రీవెన్స్‌సెల్‌కు సైతం ఫిర్యాదులు అందాయి. అయితే, దిద్దుబాటు చర్యలు చేపడతామని చెప్పినప్పటికీ ఇప్పటికీ ఆ 452 మంది నియామకాలపై విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి.

కార్పోరేట‌ర్ల తనయుల బాగోతం..

అసలు ఆ 452 మంది నియామకాల్లో అవకతవకలు, రూ. లక్షల్లో ధనం చేతులు మారినట్లు ఆరోపణలు ఉండగా, అందులో పలువురు కార్పొరేటర్ల కొడుకులు, గల్లీ లీడర్ల తనయులు, సంబంధీకులు ఉన్నట్లు తెలుస్తోంది. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలనుకున్న సదరు కార్పొరేట‌ర్ల కొడుకులు మాత్రం దీపంలో నూనె పోయాలనే విషయాన్నే మరిచిపోయినట్టున్నారు. ఏ మాత్రం పనిచేయకుండానే ఏకంగా నెలనెలా రూ. వేలల్లో వేతనాలు తీసుకుంటున్నట్లు బల్దియాలో బాహాటంగానే చర్చసాగుతోంది. ఈ విషయం ఇటీవల ఓ అధికారి పసిగట్టినట్లు తెలుస్తోంది. దాదాపు పదిమంది విధులు చేపట్టకుండానే జీతం కాజేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నారు. అలాగే ఒకరు చేయాల్సిన పనిని మరొకరితో చేయిస్తూ లబ్ధిపొందుతున్నారు. ఆ సంగతి ఎలా బయటకు పొక్కిందో గానీ, ఇప్పుడు బల్దియా మొత్తం ప్రచారం జరుగుతోంది. ఇంకా లోతుగా పరిశీలిస్తే మరింత మంది వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుందని, అయితే.. ఉన్నతాధికారులకు ఖచ్చితంగా తెలిసే ఈ బాగోతం జరుగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ విషయమై చర్యలు తీసుకునే వారే లేరంటూ అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. మేయర్‌ గుండు సుధారాణికి తెలిసినా పట్టించుకునే పరిస్థితుల్లో లేరనే చర్చ సాగుతోంది. ఇక కమిషనర్‌ దృష్టికి వచ్చినా నెలనెలా ఉద్యోగుల వేతనాల బిల్లులపై సంతకం పెట్టడం తప్ప చేసేదేమీ ఉండదనే రుసరుసలు వినిపిస్తున్నాయి. ఇక విజిలెన్స్‌ విభాగం ఉన్నా.. అది రబ్బర్‌స్టాంపు లాగానే పనిచేస్తుంటుందనే విమర్శలు ఉన్నాయి. అవినీతి ఆరోపణలు వచ్చినపుడలా విజిలెన్స్‌ విచారణ అంటూ హడావుడి తప్ప.. వారు ఎక్కడుంటారు? ఎప్పుడొస్తారు? ఎలా విచారణ చేపడతారు? ఎలాంటి చర్యలు తీసుకుంటారనే విషయంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు బల్దియా చరిత్రలోనే విజిలెన్స్‌ విభాగం చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని చెప్పుకుంటున్నారు. అందుకే వరంగల్‌ మున్సిపల్‌ కార్యాలయం అవినీతిపరులకు, అక్రమార్కులకు వరనిలయంగా మారిందని చర్చించుకుంటున్నారు.

Also Read:

గుట్టు చప్పుడు కాకుండా తప్పుడు వ్యవహారం?

Next Story

Most Viewed