కారు దిగేద్దామా..? బీఆర్ఎస్ కేడర్‌లో మాట ముచ్చట‌

by Shiva Kumar |
కారు దిగేద్దామా..? బీఆర్ఎస్ కేడర్‌లో మాట ముచ్చట‌
X

దిశ, వ‌రంగ‌ల్ బ్యూరో: అసెంబ్లీ, పార్లమెంట‌రీ ఎన్నిక‌ల్లో ఎదురుదెబ్బలు తిన్న కారు పార్టీకి క్యాడ‌ర్ గుడ్ బై చెప్పేస్తున్నారు. భ‌విష్యత్తు లేని పార్టీలో ఫ్యూచర్ఏం ఉంటుంద‌నే అభిప్రాయం ఆ పార్టీ క్యాడ‌ర్‌లో వ్యక్తమ‌వుతుండ‌టం గ‌మ‌నార్హం. పంచాయ‌తీ రాజ్‌, మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌ను కూడా ఎదుర్కొనే స‌త్తా లేద‌ని భావిస్తున్న ముఖ్య, క్షేత్రస్థాయి నేత‌లు ఎవ‌రి దారి వారు చూసుకునేందుకు మార్గాలు వెతుక్కున్నారు. వారి నియోజ‌క‌వ‌ర్గ, మండ‌ల‌, గ్రామాల్లో నెల‌కొన్న రాజ‌కీయ‌ ప‌రిస్థితుల‌ను బేరీజు వేసుకుని కాంగ్రెస్‌, బీజేపీలో చేరేందుకు సిద్ధమ‌వుతున్నారు. ముఖ్యంగా మ‌రో నాలుగైదు నెల‌ల్లో పంచాయ‌తీ, మున్సిప‌ల్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఇప్పటి నుంచి రాజ‌కీయ అనుకూల వాతావ‌ర‌ణాన్ని ఏర్పాటు చేసుకోవాల‌నే ఉద్దేశంతో ఉన్న నేత‌లు అదును చూసి పార్టీ కండువా మార్చుకోవ‌డ‌మే శ్రేయ‌స్కర‌మ‌న్న ధోర‌ణితో ఉండ‌టం గ‌మ‌నార్హం.

కారు దిగేందుకు స‌న్నద్ధం..

వ‌రుస ఓట‌ముల‌తో కారు పార్టీ క్యాడ‌ర్ డీలా ప‌డిపోయింది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లాలో రెండు స్థానాల్లో గెలిచిన ఆ పార్టీ అభ్యర్థుల్లో స్టేష‌న్‌ఘ‌న్‌పూర్ ఎమ్మెల్యే క‌డియం శ్రీహ‌రి పార్లమెంటు ఎన్నిక‌ల ముందు త‌న కూతురుతో క‌లిసి కాంగ్రెస్ పార్టీలో చేరిన విష‌యం తెలిసిందే. ఇక జ‌న‌గామ ఎమ్మెల్యేగా ఉన్న ప‌ల్లా రాజేశ్వర్ రెడ్డి త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ఉనికిని నిల‌బెట్టుకునేందుకు రాజ‌కీయంగా క‌ష్టాలు ప‌డాల్సి వ‌స్తోంది. ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లాలో కారు పార్టీ డీలా కావ‌డంతో బీజేపీ ఓటు బ్యాంకు పుంజుకోవ‌డాన్ని కాంగ్రెస్ వ్యతిరేకులు ఆ పార్టీ వైపు చూసేలా చేస్తోంది. త‌మ రాజ‌కీయ భ‌విష్యత్‌కు కాంగ్రెస్‌లో చేరినా ప్రయోజ‌నం.. ల‌క్ష్యం నెర‌వేర‌క‌పోవ‌చ్చని భావిస్తున్న నియోజ‌క‌వ‌ర్గ, మండ‌ల, గ్రామ‌స్థాయి లీడ‌ర్లు బీజేపీ వైపు చూస్తుండ‌టం గ‌మ‌నార్హం. అయితే అధికార పార్టీలో ఏమాత్రం రాజ‌కీయ అవ‌కాశం చిక్కే అవ‌కాశం ఉన్నా ఆ పార్టీ కండువా క‌ప్పుకునేందుకు బీఆర్ఎస్ పార్టీలోని కొంత‌మంది నేత‌లు త‌హ‌త‌హ‌లాడుతున్నారు.

గులాబీ లీడ‌ర్‌.. క్యాడ‌ర్ ప‌క్క చూపులు

మాజీ ఎమ్మెల్యేలు, సీనియ‌ర్ నేత‌లు సైతం పార్టీ వీడేందుకు కార‌ణాలను వెతుక్కునే ప‌నిలో ఉన్నట్లుగా వ‌రంగ‌ల్ పొలిటిక‌ల్ స‌ర్కిళ్లలో టాక్ న‌డుస్తోంది. అసెంబ్లీ ఎన్నిక‌ల త‌ర్వాత బీఆర్ ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పెద్ద సంఖ్యలో నేత‌లు క్యూ క‌ట్టారు. బీఆర్ ఎస్ ప్రభుత్వంలో కీల‌కంగా ప‌నిచేసిన కొంత‌మంది నేత‌లు, పార్టీలో ప్రాధాన్యం ఉంద‌ని భావించిన ఇంకొంత‌మంది నేత‌లు ఆచితూచి వ్యవ‌హ‌రించే ధోర‌ణితో క‌నిపించారు. పార్లమెంటు ఎన్నిక‌ల ఫ‌లితాలను అనుస‌రించి రాజ‌కీయ నిర్ణయం తీసుకోవాల‌నుకున్నట్లు స‌మాచారం. పార్లమెంటు ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ పార్టీకి రుచించ‌ని ఫ‌లితాలు రావ‌డంతో పాటు కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో బీజేపీ రెండో స్థానానికి ఎగ‌బాకడంతో గులాబీ పార్టీ క్యాడ‌ర్‌కు ఏమాత్రం మింగుడు ప‌డ‌టం లేదు.

ఈనేప‌థ్యంలోనే స‌మీప భ‌విష్యత్‌లో పార్టీ గాడిన ప‌డే అవ‌కాశం లేద‌ని పొలిటిక‌ల్ పండితులు జోస్యం చెబుతున్నారు. ఇదిలా ఉండ‌గా వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన ఓ సీనియ‌ర్ రాజ‌కీయ నేత పార్టీ మారేందుకు పావులు క‌దుపుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీ మారుతున్నట్లుగా వస్తున్న వార్తల‌ను ఆయ‌న ప‌లుమార్లు ఖండిస్తూ వ‌చ్చారు. బీజేపీలో చేరేందుకు లైన్ క్లియ‌ర్ చేసుకుంటున్నట్లుగా ఆయ‌న‌తో పాటు ఓ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు, మ‌రో మాజీ ఎమ్మెల్యే త‌న సొంత ప్రయ‌త్నాల‌ను ముమ్మరం చేసుకుంటున్నట్లు రాజ‌కీయ వ‌ర్గాల్లో టాక్ న‌డుస్తోంది. నేత‌లు త‌మ దారి తాము వెతుక్కుంటున్న క్రమంలో వారి అనుచ‌ర‌గ‌ణం, క్షేత్రస్థాయి లీడ‌ర్లు సైతం ప‌క్క చూపులు చూస్తుండ‌టం విశేషం.

ఊరిస్తున్న క‌మ‌లం.. కాంగ్రెస్ స్నేహ‌ హ‌స్తం

ఇప్పటికే పార్టీని గ్రౌండ్‌లో బ‌లోపేతం చేయ‌డానికి కాంగ్రెస్ పార్టీ ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చే నాయ‌కుల‌కు స్నేహ‌హ‌స్తం అంద‌జేస్తోంది. పార్టీలోకి ఎవ‌రొచ్చినా తీసుకోవాల‌నే అధిష్టానం ప్రాథ‌మిక ఆదేశాల‌ను పాటిస్తోంది. చేరిక‌ల‌ను అడ్డుకోకూడ‌ద‌ని ఆదేశించ‌డంతో స్వచ్ఛదంగా పార్టీలోకి త‌ర‌లివ‌చ్చే వారికి ఆటంకాలు లేకుండా పోతున్నాయి. ఇక భ‌విష్యత్ అంతా మ‌న‌దే..పార్టీలోకి వ‌స్తే ప్రాధాన్యం, ప‌ద‌వులు ద‌క్కుతాయంటూ క‌మ‌లం పార్టీ నేత‌లు లీడ‌ర్లను ఊరిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి పెరిగిన వ‌ల‌స‌ల‌తో కాంగ్రెస్ నిండుకుండ‌గా మారుతున్న క్రమంలో క‌మ‌లం పార్టీ ఆయా నియోజ‌క‌వ‌ర్గ, మండ‌లాల లీడ‌ర్లకు పొలిటిక‌ల్ ఛాన్స్‌ల‌ను చూపుతోంది. రెండు పార్టీలు దూకుడుతో వ్యవ‌హ‌రిస్తుండ‌టం కారు పార్టీ మాత్రం ప్రస్తుతం క్యాడ‌ర్ ను కాపాడుకునేందుకు తంటాలు ప‌డాల్సి వ‌స్తోంది.Next Story

Most Viewed