ఠంచ‌నుగా మాముళ్లు అందుతున్నాయంట... అందుకే ఎంత ఇసుక తోడుకపోతున్నా ఏమనట్లేదంట...?

by Dishanational1 |
ఠంచ‌నుగా మాముళ్లు అందుతున్నాయంట... అందుకే ఎంత ఇసుక తోడుకపోతున్నా ఏమనట్లేదంట...?
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్: వ‌ర్ధన్నపేట నియోజ‌క‌వ‌ర్గంలో ఇసుకాసురుల రాజ్యం న‌డుస్తోంది. వాగులు, వంక‌ల‌ను, ఒర్రెల‌ను సైతం వ‌ద‌ల‌కుండా ఇసుక త‌వ్వకాల‌తో గుల్ల చేస్తున్నారు. ఇప్పటికే ల్యాబ‌ర్తిలో ఇసుక‌ను దాదాపుగా తోడేశారు. ఎలాంటి అనుమ‌తుల్లేకుండా సాగుతున్న ఈ దందాకు.. రెవెన్యూ, పోలీస్ అధికారుల అండ‌దండ‌లు పుష్కలంగా ఉన్నట్లుగా స్పష్టమ‌వుతోంది. మ‌హా అయితే మాముళ్లు ఇవ్వని ట్రాక్టర్లను ప‌ట్టుకుని.. ఆ త‌ర్వాత అంతా సెట్టయ్యాక వ‌దిలేయ‌డం మిన‌హా అధికారులేం చేయ‌డం లేద‌ని స‌మాచారం. వాస్తవానికి ట్రాక్టర్లను ఎన్ని ప‌ట్టుకున్నారు..? ఎన్నింటికి జ‌రిమానాలు విధించారు.? సీజ్ చేసిన ఇసుక‌ను రెవెన్యూ అధికారుల‌కు అప్పగించారా.? అప్పగించిన ఇసుక‌ను రెవెన్యూ అధికారులు వేలం పాట నిర్వహించారా.? వంటి ప్రశ్నల‌కు రెండు డిపార్ట్‌మెంట్ల అధికారుల వ‌ద్ద నుంచి స‌మాధాన‌మే క‌రువ‌వుతుండ‌టం గ‌మ‌నార్హం. ఇసుక ట్రాక్టర్ల ప‌ట్టివేత‌లో కూడా అధికారులు త‌మ వ్యవ‌హారాల‌ను చ‌క్కబెట్టుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

అక్రమాలు హ‌క్కుగా త‌వ్వకాలు..!

వ‌ర్ధన్నపేట నియోజ‌క‌వ‌ర్గంలో ఇసుక అక్రమ ర‌వాణాను హ‌క్కువ‌గా భావిస్తున్న చందంగా క‌నిపిస్తోంది. వ‌ర్ధన్నపేట మండ‌లంలోని ల్యాబ‌ర్తి, కొత్తప‌ల్లి నుంచి పెద్ద ఎత్తున ఇసుక అక్రమ ర‌వాణా జ‌రుగుతోంది. అలాగే ప‌ర్వత‌గిరి మండ‌లంలోని నారాయ‌ణ‌పురం, చెరువు ముందుతండా, రోళ్లక‌ల్‌లోని ఆకేరు వాగు ప‌రిస‌ర ప్రాంతం నుంచి, అలాగే పంట పొలాల‌ల్లో ఫిల్టర్ ఇసుక పెద్ద ఎత్తున జ‌రుగుతోంది. ఇదే మండ‌లంలోని క‌ల్లెడ‌, రావూరు, రాయ‌ప‌ర్తి మండ‌లం, వ‌ర్ధన్నపేట‌ ద‌మ‌న్నపేట‌ల నుంచి పెద్ద ఎత్తున ఇసుక అక్రమ ర‌వాణా జ‌రుగుతోంది. ఇదంతాకూడా పోలీసు, రెవెన్యూ అధికారుల స‌హ‌కారంతో సాగుతున్నట్లుగా ఆరోప‌ణ‌లున్నాయి. ఎలాంటి చ‌ర్యలు తీసుకోకుండా నామ‌మాత్రంగా ఇసుక ట్రాక్టర్లను ప‌ట్టుకుని నామ‌మాత్రపు ఫైన్లు క‌ట్టించుకుని.. ఆ త‌ర్వాత పెద్ద ఎత్తున సెటిల్‌మెంట్ చేసుకుని మ‌మ అనిపిస్తున్నట్లు స‌మాచారం.

హైవేపైనే అమ్మకాలు.. ఖాకీల‌కు క‌న‌బ‌డ‌ట్లేదా..!?

వ‌ర్ధన్నపేట నియోజ‌క‌వ‌ర్గంలోని ప‌లు ప్రాంతాల నుంచి ఇసుక అక్రమ ర‌వాణా జ‌రుగుతుండ‌గా, ద‌ర్జాగా హైవేపైనే అమ్మకాలు జ‌రుపుతుండ‌టం గ‌మనార్హం. అర్ధరాత్రి దాటిన త‌ర్వాత మొద‌ల‌య్యే ట్రాక్టర్ల సందడి.. తెల్లవారుజామున వ‌ర‌కే వ‌రంగ‌ల్ - ఖ‌మ్మం హైవే ట్రాక్టర్లతో నిండిపోయి క‌నిపిస్తోంది. చేసేది అక్రమ ర‌వాణే అయినా.. ద‌ర్జాగా పోలీస్‌చెక్ పోస్టులు దాటుకుంటూ.. ఖాకీల‌కు న‌మ‌స్తేలు పెడుతూ మ‌రీ ఇసుకాసురులు తాపీగా గ‌మ్యాలు చేరుకుంటుండ‌టం విశేషం. ట్రాక్టర్ల యూనియ‌న్ల లీడ‌ర్లను గుర్తుంచుకునే స్థాయిలో ప‌రిచ‌యాలు ఏర్పడ‌టంతో ఏ ట్రాక్టర్ ఏ యూనియ‌న్‌దో ఇట్టే కింది స్థాయి పోలీస్ సిబ్బంది క‌నిపెట్టి వ‌దిలేస్తున్నట్లు స‌మాచారం. అందుకే తేడా రానంత వ‌ర‌కు ట్రాక్టర్‌ని ఆపేది లేదు... అడిగేది లేదు. అంతా ఓ లెక్క ప్రకారం సాగుతున్న దందాలో రెవెన్యూ, పోలీస్‌ అధికారుల‌కు ఠంచ‌నుగా మాముళ్లు అందుతున్నట్లు సమాచారం. అందుకే ఇసుక అక్రమ ర‌వాణాదారులు హైవేల‌పైనే ఆడింది ఆట‌గా సాగుతున్నట్లు తెలుస్తోంది.

ఆ రెండు చోట్లా పైకం..!

వ‌ర్ధన్నపేట‌, ఐన‌వోలు, ప‌ర్వత‌గిరి మండ‌లాల్లో ప‌లు ప్రాంతాల నుంచి వెలికితీస్తున్న ఇసుక‌ను అమ్మేందుకు వ‌రంగ‌ల్ ప‌రిస‌రా ప్రాంతాల‌కే తీసుకువ‌స్తున్నారు. ఈ క్రమంలోనే ఉప్పర‌ప‌ల్లి క్రాస్‌, మామునూరు వ‌ద్ద చెక్ పోస్టు, ఖిలా వ‌రంగ‌ల్ సిగ్నల్ పాయింట్ వ‌ద్ద కొంత‌మంది కింది స్థాయి పోలీస్ సిబ్బంది వ‌సూళ్లకు పాల్పడుతున్నట్లుగా ఆరోప‌ణ‌లున్నాయి. ట్రాక్టర్ ట్రిప్పున‌కు వంద నుంచి రెండు వంద‌ల వ‌ర‌కు వ‌సూలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.



Next Story

Most Viewed