పీఠం ప‌దిలానికే.. సుధారాణిని వెంటాడిన అవిశ్వాసం భ‌యం

by Disha Web Desk 23 |
పీఠం ప‌దిలానికే.. సుధారాణిని వెంటాడిన అవిశ్వాసం భ‌యం
X

దిశ‌,వ‌రంగ‌ల్ బ్యూరో : బెల్లం ఎక్క‌డుంటే ఈగ‌లు అక్క‌డ వాలిన చందంగా అధికారం ఎక్క‌డుంటే రాజ‌కీయ నాయ‌కులు ఆ పార్టీలోకి జంపవ‌డం కామ‌న‌మైపోయింది. ఈ స‌త్యాన్ని నిజం చేస్తూ వ‌రంగ‌ల్ మ‌హాన‌గ‌ర పాల‌క సంస్థ మేయ‌ర్ గుండు సుధారాణి గులాబీకి గుడ్ బై చెప్పి.. కాంగ్రెస్ పార్టీ కండువా క‌ప్పేసుకున్నారు. వ‌రంగ‌ల్ తూర్పు ఎమ్మెల్యే, మంత్రి కొండా సురేఖ అయిష్టంగా ఉన్నా.. చేతి పార్టీలో చేరేందుకే మొగ్గు చూపుతూ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి, కోదండ‌రెడ్డి స‌మ‌క్షంలో గురువారం గాంధీ భ‌వ‌న్‌లో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వాస్త‌వానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన కొద్దిరోజుల‌కే వ‌రంగ‌ల్‌ బీఆర్ఎస్ పార్టీ నుంచి చేతి పార్టీలోకి వ‌ల‌స‌లు పెరిగాయి. ఈ క్ర‌మంలోనే మేయ‌ర్ గుండు సుధారాణి సైతం మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి ద్వారా ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డిని క‌లిసి పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నాన‌నే సంకేతాలు పంపారు. ఆ త‌ర్వాత గులాబీ పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటూ వ‌స్తుండ‌టంతో ఆమె పార్టీని వీడ‌టం ఖ‌రారైంది. అయితే అదే స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీలో చేరికకు లైన్ క్లియ‌ర్ కాక‌పోవ‌డంతో సుధారాణి డైలామాలో ప‌డింది.

సురేఖ దంపతుల వ్య‌తిరేక‌త‌..!

మేయ‌ర్ గుండు సుధారాణిని కాంగ్రెస్‌లో చేర్చుకోక‌పోవ‌డంపై వ‌రంగ‌ల్ తూర్పు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన కొంత‌మంది కాంగ్రెస్ నాయ‌కులు, అప్ప‌టికే బీఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వ‌చ్చిన కార్పోరేట‌ర్లు వ్య‌తిరేకించారు. మంత్రి కొండా సురేఖ‌, ముర‌ళీధ‌ర్‌రావు దంప‌తుల‌కు సైతం గుండు సుధారాణిని చేర్చుకోవ‌డం ఇష్టం లేద‌న్న వార్త‌లు వినిపించాయి. ఇదే స‌మ‌యంలో పార్టీ నేత‌ల‌తో నిర్వ‌హించిన‌ అంత‌ర్గ‌త స‌మావేశాల్లోనూ సుధారాణి చేరిక‌పై విమ‌ర్శ‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఆమె కాంగ్రెస్‌లో చేరిక అసాధ్య‌మ‌న్న వార్త‌లు వినిపించిన‌... కాంగ్రెస్ పార్టీ బ‌లోపేతానికి చేరిక‌ల‌ను ఆహ్వానించాల్సిందేన‌న్న అధిష్ఠానం ఆదేశాల‌తో.. రాష్ట్ర నాయ‌క‌త్వం అన్ కండిష‌న‌ల్ ఒప్పందం మీద చేరిక‌కు స‌రేన‌న్న‌ట్లుగా స‌మాచారం.

మేయ‌ర్ పీఠం ప‌దిల‌మైన‌ట్లే..!

మేయ‌ర్ గుండు సుధారాణిపై అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెట్టాల‌ని చాలామంది కార్పోరేట‌ర్లు, కాంగ్రెస్ పార్టీ యోచించింది. బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటే మేయ‌ర్ పీఠం కోల్పోక త‌ప్ప‌ద‌ని భావించిన సుధారాణి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు వేగంగా పావులు క‌దిపారు. చేరిక‌పై కొంత గంద‌ర‌గోళం నెల‌కొన్నా..చివ‌ర‌కు అనుకున్న ల‌క్ష్యం మాత్రం సుధారాణి సాధించుకున్నార‌న్న విశ్లేష‌ణ జ‌రుగుతోంది. కాంగ్రెస్‌లో చేరిక‌తో ఇక మేయ‌ర్‌ప‌ద‌వికి ఢోకా లేన‌ట్లేన‌ని ఆమె స‌న్నిహితులు చెబుతుండ‌టం గ‌మ‌నార్హం. అయితే మంత్రికొండా సురేఖ‌కు, కార్పోరేట‌ర్లు, కాంగ్రెస్ నేత‌ల‌కు ఇష్టం లేకున్నా.. పార్టీలో చేరిన గుండు సుధారాణిపై వ‌రంగ‌ల్ తూర్పులో మున్ముందు ఎలాంటి రాజ‌కీయ ప‌రిణామాలు, ప‌రిస్థితులు ఏర్ప‌డ‌బోతున్నాయ‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తికరంగా మారింది. గుండు సుధారాణి బీఆర్ఎస్‌ను వీడ‌టంతో వ‌రంగ‌ల్ తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో కారు పార్టీ మ‌రింత చ‌తికిల ప‌డిన‌ట్లేన‌ని చెప్ప‌వ‌చ్చు. మాజీ ఎమ్మెల్యే న‌న్న‌పునేని న‌రేంద‌ర్ మిన‌హా నియోజ‌క‌వ‌ర్గాన్ని ప్ర‌భావితం చేసే నాయ‌కుడు మ‌రోక‌రు క‌నిపించ‌డం లేద‌న్న విశ్లేష‌ణ జ‌రుగుతోంది. ఇక న‌న్న‌పునేని న‌రేంద‌ర్ సైతం ఇటీవ‌ల బీజేపీలోకి వెళ్లేందుకు ప్ర‌య‌త్నాలు చేసి.. విఫ‌ల‌మైన‌ట్లుగా తెలుస్తోంది. వ‌రంగ‌ల్ తూర్పు బీజేపీ నేత‌ల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వడంతో ఆయ‌న్ను పార్టీలోకి చేర్చుకునే విష‌యంపై క‌మ‌ల‌ద‌ళం వెన‌క‌డుగు వేసిన‌ట్లు స‌మాచారం.

లోక్‌స‌భ ఎన్నిక‌ల స‌మ‌యంలో వ‌రంగ‌ల్ బీఆర్ఎస్ పార్టీకి మ‌రో ఎదురుదెబ్బ త‌గిలింది. తాజాగా వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి బీఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైద‌రాబాద్ గాంధీభ‌వ‌న్‌లో కాంగ్రెస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి స‌మ‌క్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ వైపు చూసిన గుండు సుధారాణి గత కొద్దిరోజులుగా గుండు సుధారాణి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు అన్న చర్చ జరిగింది. అయితే ఆ చర్చకు ఊతమిస్తూ ఇటీవల వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరంగల్ పర్యటనలో కూడా ఆమె పాల్గొనలేదు. కేటీఆర్ సభకు గుండు సుధారాణి డుమ్మా కొట్టారు.

కేటీఆర్ కి స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో కూడా ఆమె ఫోటో ఎక్కడ కనిపించలేదు. వాస్త‌వానికి గుండు సుధారాణి గత కొద్ది రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డిని స్వ‌యంగా క‌లిశారు. ఈ స‌మ‌యంలోనే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేర‌డం ఖాయ‌మైంద‌న్న వార్త‌లు వినిపించాయి. అయితే అనుహ్యంగా కొద్దిరోజుల పాటు ఆమె చేరిక‌పై స‌స్పెన్స్ కొన‌సాగ‌గా గురువారం జ‌గ్గారెడ్డి స‌మ‌క్షంలో పార్టీ కండువా క‌ప్పుకోవ‌డం విశేషం. ఆమె చేరిక‌ను మంత్రి కొండా సురేఖ ముర‌ళీ దంప‌తులు అడ్డుకున్న‌ట్లుగా కూడా వార్త‌లు వినిపించాయి. సుధారాణి చేరికను వారు ఆహ్వానించ‌లేద‌ని స‌మాచారం.



Next Story

Most Viewed