'ఆకేరు'.. చీకటిలో హుష్ కాకి..

by Disha Web Desk 20 |
ఆకేరు.. చీకటిలో హుష్ కాకి..
X

దిశ, నెల్లికుదురు : ప్రభుత్వం గుడ్లప్పగించి చూస్తుండగానే ఘనత వహించిన ఇసుక గుర్తుందార్లు, వ్యాపారులు ప్రకృతి మాతను నిలువునా దోచుకుతింటున్నారు. 'పొదుగు కోసుకొని పాలు తాగిన చందంగా' ఇసుక దందా ముఠాలు విజృంభిస్తున్నాయి. ఫలితంగా నెల్లికుదురు మండలంలోని ఆకేరు వాగులోని ఇసుక కనుమరుగైపోతుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ తతంగం కొనసాగుతుంది. 'తివిరి సుమున తైలంబు తీయవచ్చు' అని ఎందుకన్నారో కానీ ఆకేరుని తోడేస్తూ లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్న ముఠాలను చూస్తే ఇట్టే అర్థమవుతుంది. మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లి, భగ్నతండా, మదనతుర్తి, మేచరాజుపల్లి, మునిగలవేడు శివారులో ప్రవహించే ఆకేరు వాగులో చీకటిలో రాత్రికి రాత్రి ఇసుక తరలిస్తూ తెల్లవారితే ఏమి తెలియనట్టుగా పవళిస్తున్నారు.

అక్రమ ఇసుకను తవ్వి ఇతర జిల్లాలకు, హైదరాబాద్ దూర ప్రాంతాలకు తరలించడం ఓ భారీ వ్యాపారంగా మారింది. అక్రమ ఇసుక రవాణా చేసే ట్రాక్టర్లకు, నెంబర్ ఉండదు నడిపే డ్రైవర్లులకు లైసెన్సు ఉండదు, ట్రాక్టర్ డ్రైవర్లు మైనర్లు కూడా కావడం ఓ విశేషం. ఇసుక ట్రాక్టర్ లు ఓవర్ స్పీడ్ లతో గ్రామాలలో నుంచి వెళ్లడం వల్ల గ్రామస్తులు భయభ్రాంతులకు లోనవుతున్నారు. అంతకుమును పోయి ఓవర్ స్పీడ్ లతో ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. వర్షాకాలంలో ఆకేరు వాగులో నీరు ప్రవహించడంతో ఇసుక తవ్వడానికి వీలుకాదు కాబట్టి. బ్రాహ్మణ కొత్తపల్లి శివారులో ప్రతి ఏడాది వేసవిలో ముందస్తుగా ఇసుక డంపులు ఏర్పాటు చేసుకునే విధంగా ప్రయత్నాలు చేసుకున్నట్లు సమాచారం. ప్రభుత్వ పనుల నెపంతో ఇసుక రవాణా చేయడం ఎక్కువ జరుగుతుంది.

అందుకే బ్రాహ్మణ కొత్తపల్లి, భగ్నతండా, మేచరాజుపల్లి మునిగలవేడు శివారులో చీకటిలో అక్రమఇసుక తరలిస్తున్నారు. అత్యధికంగా బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామంలో 80 ట్రాక్టర్ల పైబడి ఉండడం విశేషం దుర్గ భవాని తండా శివారు భగ్నతండాలో జోరుగా ఇసుక నడుపుతూ ఉండడం పరిపాటే. మునిగిలవీడు నుంచి నరసింహుల పేట, మహబూబాబాద్ కు కూడా ఇసుక రవాణా జరుగుతుంది. గమనించిన ఇసుక గుర్తుందార్లు అక్రమంగా ఇసుకను సరఫరా చేస్తూ లక్షల్లో సొమ్ము చేసుకోవడానికి వర్షాలు కురవక ముందే ఇసుకను డంపుగా నిలువ చేయడం పరిపాటిగా మారింది. దీనిని దూరప్రాంతాల వారికి అధికరేట్లకు లారీల్లో తరలిస్తున్నారు. అప్పుడప్పుడు టాస్క్ ఫోర్స్, స్థానిక పోలీసుల సహకారంతో ఆకేరు వాగు పై తనిఖీలు నిర్వహించి ట్రాక్టర్లను సీజ్ చేస్తున్నప్పటికీ తీరు మారడం లేదు.

ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపట్ల పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కింది నుంచి పై స్థాయి అధికారులకు వేళల్లో ముడుపులు ముట్టడంతోనే ఈ తతంగం జరుగుతుందని వాదనలను వినిపిస్తున్నాయి. అక్రమ ఇసుకరవాణా తరలింపులో నెల్లికుదురు ఇతర మండలంలోని ఆఖీరువాగు సమీపంలో 500కు పైగా ట్రాక్టర్ ఇసుక రవాణా చేస్తున్నట్లు మండలంలో ప్రజలు అనుకొని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకొని అక్రమ ఇసుక రవాణా నియంత్రణ తోడ్పడి ప్రకృతి సంపదను కాపాడాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.

Next Story

Most Viewed