కష్టపడిన ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటా..: దాస్యం వినయ్ భాస్కర్

by Aamani |
కష్టపడిన  ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటా..: దాస్యం వినయ్ భాస్కర్
X

దిశ, హనుమకొండ టౌన్ : బాలసముద్రంలోని హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రభుత్వ చీఫ్ విప్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2005లో ఉద్యమ నేత కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, అప్పటి పార్లమెంట్ సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ ప్రోద్బలంతో టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగిందన్నారు. నాటి నుండి నేటి వరకు టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ వరకు ఏ పని అప్పజెప్పిన బాధ్యతాయుతంగా చేశానని అన్నారు. కార్పొరేటర్ గా పోటీ చేయమని ఆదేశిస్తే 37వ డివిజన్ నుండి కార్పొరేటర్ గా గెలిచానని, తదుపరి నగర అధ్యక్షుడిగా పని చేశానని అన్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ, ప్రజా సమస్యలపై పోరాడానని తెలిపారు. తెలంగాణ 2009 ఉద్యమ సమయంలో ఏకైక ఎమ్మెల్యేగా గెలుపొందానని అన్నారు.

2009లో ఆనాటి ఉద్యమ సమయంలో తెలంగాణను సాధించడమే ధ్యేయంగా ఆర్నిశలు కృషి చేసానని, రాస్తారోకోలు, ధర్నాలు, అనేక నిరసన కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. అంతే కాకుండా ఉద్యమ సమయంలో పనిచేసిన ఉద్యమకారులకు ఆర్థికంగా సహాయ సహకారాలు అందించడం జరిగిందన్నారు. స్వరాష్ట్రం కోసం రాజీనామా చేసి గెలుపొందానని అన్నారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014, 2018లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వస్తే అనేక పెండింగ్ లో ఉన్నటువంటి పనులను పూర్తి చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం ఉన్నత పదవులు ఇచ్చినప్పటికిని ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేశానని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారపక్షంలో ఉన్నప్పుడు నాయకులను గౌరవిస్తూ పనులు చేయించడం జరిగిందన్నారు. గుడిసె వాసుల కోసం వామపక్షాలతో కలిసి పోరాడానని తెలిపారు. వారిని పిలిచి గౌరవించి, సన్మానించడం జరిగిందని కూడా అన్నారు.

వరంగల్ పశ్చిమ నియోజకవర్గం లో ఉన్నవారికి అనేక సంక్షేమ ఫలాలు దళిత బంధు, బీసీ బంధు,మైనారిటీ బంధు ఇవే కాకుండా అనేక మంది లబ్ధిదారులకు చేయూతనిచ్చే విధంగా సంక్షేమ పథకాలను అందించానని తెలిపారు. నగరాభివృద్ధి ని చేయడమే ధ్యేయంగా పెట్టుకుని, నిస్వార్థంగా, నిజాయితీగా, నిబద్ధతతో పనిచేశానన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఎన్నికైన రేవంత్ రెడ్డిని, మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన కొండా సురేఖ, సీతక్కలను, పశ్చిమ నియోజకవర్గంలో గెలిచిన నాయిని రాజేందర్ రెడ్డికి, ఎమ్మెల్యేలుగా గెలిచిన వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పదేళ్ల హయాంలో వివిధ విభాగాల నుండి అనేక నిధులను తీసుకురావడం జరిగిందన్నారు. మున్సిపల్, టూరిజం,ఆర్ అండ్ బీ,బీసీ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్, రెవెన్యూ ఇలా చాలా రకాలుగా కొన్ని వేల కోట్లు తీసుకువచ్చి అభివృద్ధి చేశానని అన్నారు. గతంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయనటువంటి అభివృద్ధిని వరంగల్ పశ్చిమ నియోజకవర్గం లో చేశానని, ఇటీవల జరిగిన ఎన్నికల్లో నా గెలుపు కోసం కృషి చేసినటువంటి కార్యకర్తలకు,బూతు కెప్టెన్లకు,హౌస్ కెప్టెన్ లకు, డివిజన్ అధ్యక్షులకు, ఇన్చార్జిలకు, కార్పొరేటర్లకు, ముఖ్య నాయకులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నాగుర్ల వెంకటేశ్వర్లు, సుందర్ రాజు యాదవ్, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ జనార్ధన్ గౌడ్, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed