బడాయి బల్దియా.. ఖాళీ ఖజానాతో కాలం గడిచేనా?

by Dishanational2 |
బడాయి బల్దియా.. ఖాళీ ఖజానాతో కాలం గడిచేనా?
X

దిశ, వరంగల్‌ టౌన్‌ : వరంగల్‌ మహానగర పాలక సంస్థ పరిధిలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. నగరంలో ఎక్కడ చూసినా అసంపూర్తి పనులే దర్శనమిస్తున్నాయి. నిధుల లేమితో అభివృద్ధి పనులు ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగా ఉన్నట్లు తెలుస్తోంది. బిల్లుల చెల్లింపుల్లో జాప్యంతో కాంట్రాక్టర్లు పనులు చేపట్టేందుకు సముఖత చూపడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా, మరో నెలలో వానాకాలం రాబోతోంది. ఏటా నగరంలో పలు కాలనీలు ముంపునకు గురవుతున్నా కార్పొరేషన్‌ కప్పదాటు చర్యలతో కాలం వెళ్లదీసుకుంటూ వస్తోంది. వరదలు వచ్చిన సమయంలోనే శాశ్వత పరిష్కారమంటూ ఊదరగొట్టే పాలకవర్గం, అధికారులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. ఈ సారి కూడా నగరం నీట మునగాల్సిందేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రూ.3కోట్లతో నాలాల పూడికతీత..

ముందు జాగ్రత్తనో లేదా కంటితుడుపు చర్యలో గానీ సుమారు రూ.3కోట్లతో నాలాల పూడికతీత పనులకు బల్దియా శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. బల్దియా పరిధిలోని ట్రైసిటీస్‌ పలు ప్రాంతాలు ఏటా వర్షాకాలంలో నీట మునుగుతున్నాయి. ప్రధానంగా హన్మకొండ నయీంనగర్‌, ములుగురోడ్డు పెద్దమోరీ, పెద్దమ్మగడ్డ పెద్దమోరీ, భద్రకాళి బొంది వాగు ఏరియా, పెరుకవాడ, శివనగర్‌, కాశీబుగ్గ, గణేష్ నగర్, ఎస్సార్ నగర్ ప్రాంతాల్లో పలు కాలనీలు వరద మంపునకు గురవుతున్నాయి. ఈ ప్రాంతాల్లో నాలాలు ఆక్రమణకు గురికావడం, చెరువుల ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఇళ్లు నిర్మించుకోవడంతో నగరానికి ముంపు సమస్య తలెత్తుతున్నదని జగమెరిగిన సత్యం. అయితే, అధికారులు ముంపు సమస్యకు ఏటా శాశ్వత పరిష్కారం చూపుతామని అంటున్నారే తప్ప ఇప్పటివరకు కించిత్‌ మాత్రం కూడా చర్యలు చేపట్టిన దాఖలాలు లేవనేది నిర్వివాదాంశం. ఈ సారి కూడా అదే తరహా పద్ధతిలో చేతులెత్తేస్తారా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ‘చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా’ వరదలు ముంచుకొచ్చిన తర్వాత మళ్లీ శాశ్వత పరిష్కారం అంటూ కాలనీలు తిరుగుతారా అనే సందేహాలు ప్రజల నుంచి వెల్లువెత్తుతున్నాయి. రూ.3కోట్లతో చేపట్టనున్న నాలాల పూడికతీత కూడా తూతూ మంత్రంగానే నిర్వహిస్తారా అనే విమర్శలు వినిపిస్తున్నాయి.

నేడు కౌన్సిల్‌ సమావేశం..

నేడు జీడబ్ల్యూఎంసీ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించనున్నారు. గత సమావేశంలో అన్నపూర్ణ పథకం బిల్లుల చెల్లింపు ఎజెండాతోనే మమ అనిపించారు. మరీ ఈ సారి సింగిల్‌ ఎజెండా కాకుండా నగరంలో సమస్యలపై చర్చ సాగుతుందా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరో నెలలో వర్షాలు పడే అవకాశం ఉండడం, మరో పక్క కార్పొరేషన్‌ ఖజానా ఖాళీగా ఉందనే సమాచారం నేపథ్యంలో ఎలాంటి చర్చ కొనసాగుతుందనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. స్మార్ట్‌ సిటీ పేరిట చేపట్టిన పనులు కొన్ని పెండిరగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. మరోపక్క కార్పొరేషన్‌కు పూర్తి స్థాయి కమిషనర్‌ లేకపోవడం ఆఫీసు కార్యకలాపాల్లో అధికారుల అలసత్వం రాజ్యమేలుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం బల్దియా కౌన్సిల్‌ సమావేశంలో ఎలాంటి అంశాలు ప్రస్తావనకు రానున్నాయి? ప్రతిపక్షాలు ఎలా స్పందించనున్నాయనేది చర్చనీయాంశంగా మారింది.

Next Story

Most Viewed