ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని అడ్డుకున్న బచ్చన్నపేట రైతులు..

by Disha Web Desk 11 |
ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని అడ్డుకున్న బచ్చన్నపేట రైతులు..
X

దిశ, జనగామ: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిని జనగామ జిల్లా బచ్చన్నపేట గ్రామంలో ఆదివారం రైతులు అడ్డుకున్నారు. శనివారం రాత్రి కురిసిన అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులకు నష్టపరిహారం చెల్లించి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఆదివారం మండల కేంద్రంలో పార్టీలకు అతీతంగా రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు రైతులకు సంఘీభావం తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పొన్నాల లక్ష్మయ్య అక్కడికి చేరుకొని రైతులకు సంఘీభావం తెలిపి మాట్లాడారు. అనంతరం ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఆ తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ లు స్పందించి తక్షణమే రైతులకు బాసటగా ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రైతులు ధర్నా చేశారు. అదే సమయంలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి జనగామ నుంచి చేర్యాల వెళుతున్న క్రమంలో బచ్చన్నపేట వరకు చేరుకున్నాడు. ఆ సమయంలో రైతులు ఆందోళన చేస్తుండడంతో వారిని పరామర్శించేందుకుగాను ఆయన తన కారులో నుంచి దిగి రైతుల వద్దకు వచ్చాడు. పంటలు దెబ్బతిని తీవ్ర ఆవేదనతో ఉన్న రైతులు ఎమ్మెల్యేను నిలదీశారు. తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లు స్పష్టమైన హామీ ఇస్తే గాని ఇక్కడి నుంచి కదలబోమని స్పష్టం చేశారు.

పోలీసులు రైతులను వారించేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. అయినప్పటికీ రైతులు ససేమిరా అంటూ రోడ్డుపై బైఠాయించారు. వరి, మామిడి పంటలు పూర్తిగా దెబ్బ తిన్నాయని, పంట నష్టం అంచనా వేసి తక్షణమే సాయం అందించాలని వారు డిమాండ్ చేశారు. కాగా శనివారం జనగామ జిల్లా గానుగుపాడులో కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై నోరు జారిన ముత్తిరెడ్డికి మరుసటి రోజు బచ్చన్నపేట మండల కేంద్రంలో రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురు కావడంతో ఏమి చేయాలో తెలియక గమ్మున అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ విషయం జిల్లాలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.






Next Story

Most Viewed