ఇండోనేషియాలో పేలిన అగ్నిపర్వతం.. ఆకాశాన్ని కమ్మేసిన బూడిద

by Disha Web Desk 17 |
ఇండోనేషియాలో పేలిన అగ్నిపర్వతం.. ఆకాశాన్ని కమ్మేసిన బూడిద
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇండోనేషియాలో ఇటీవల కాలంలో అగ్నిపర్వతాలు పేలుతున్న ఘటనలు తరుచుగా జరుగుతున్నాయి. తాజాగా బుధవారం తూర్పు ఇండోనేషియాలోని ఒక అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు పిలుపునిచ్చారు. అలాగే రెండవ అత్యధిక స్థాయి హెచ్చరికను జారీ చేశారు. ఉత్తర మలుకు ప్రావిన్స్‌లోని హల్మహెరా ద్వీపంలో ఉన్న మౌంట్ ఇబు పర్వతం ఉదయం 11 గంటలకు విస్ఫోటనం చెందింది. దీంతో దాని నుంచి భారీ స్థాయిలో లావా, బూడిద, పోగ రావడంతో అక్కడి ప్రాంతం మొత్తం కూడా చీకటిగా మారిపోయింది. అగ్ని పర్వత శిఖరానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో బూడిద కమ్మేసిందని ఇండోనేషియా అగ్నిపర్వత సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

అగ్నిపర్వతం చుట్టూ దాదాపు ఐదు కిలోమీటర్ల వరకు ప్రత్యేక జోన్‌ను అధికారులు ఏర్పాటు చేశారు. బహిరంగ కార్యకలాపాలకు వెళ్లినప్పుడు ఫేస్ మాస్క్‌లు, అద్దాలు ధరించాలని హెండ్రా సమీపంలోని నివాసితులను కోరారు. ఇండోనేషియా, విస్తారమైన ద్వీపసమూహం. ఇటీవల కాలంలో ఇక్కడ తరుచుగా అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయి. గత నెలలో, ఉత్తర సులవేసి ప్రావిన్స్‌లోని రువాంగ్ పర్వతం 6 కంటే ఎక్కువ సార్లు విస్ఫోటనం చెందింది, దీంతో సమీప ద్వీపాల్లోని వేలాది మంది నివాసితులు ఖాళీ చేయాల్సి వచ్చింది. రువాంగ్ ద్వీపంలోని దాదాపు 800 మంది నివాసితులను శాశ్వతంగా అక్కడి నుంచి తరలించారు.

Next Story