చైనా మార్కెట్‌ను తలపిస్తున్న డాల్ఫిన్‌ గల్లీ.. మొఘల్‌ సామ్రాజ్యంలా మొబైల్‌ వ్యాపారం

by Disha Web Desk 1 |
చైనా మార్కెట్‌ను తలపిస్తున్న డాల్ఫిన్‌ గల్లీ.. మొఘల్‌ సామ్రాజ్యంలా మొబైల్‌ వ్యాపారం
X

దిశ, వరంగల్ టౌన్ : చైనా పేరు వినపడగానే ముందుగా మొబైల్‌ ఫోన్లే గుర్తుకొస్తాయి. ఒకప్పుడు ఎక్కువ శాతం మంది చైనా సెల్‌ఫోన్లనే వినియోగించే వారు. కంపెనీ ఫోన్ల ఫీచర్లతో పాటు తక్కువ ధరకే దొరకడంతో భలే డిమాండ్‌ ఏర్పడింది. కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం చైనా ఉత్పత్తులపై పూర్తిగా నిషేధం విధించింది. దీంతో చైనా వస్తువుల మార్కెట్‌ తగ్గిపోయింది. కానీ, మొబైల్‌ రంగ వ్యాపారం మాత్రం మూడు సెల్స్, ఆరు రిపేర్లుగా విలసిల్లుతోనే ఉంది. ఇందుకు వరంగల్‌ నగరంలోని డాల్ఫిన్‌ హోటల్‌ గల్లీ పేరుగాంచింది. ఒకప్పుడు ఇదే ప్రాంతంలో టీవీ రిపేరింగ్‌ షాపులు ఉండేవి. ఇప్పుడు మొబైల్‌ ఫోన్లే మినీ టీవీలుగా మారడంతో టీవీ సెంటర్లు పూర్తిగా తగ్గిపోయాయి. వాటి స్థానంలోనే సెల్‌ఫోన్‌ రిపేరింగ్‌, విడి భాగాల విక్రయ కేంద్రాలు వెలిశాయి. సాఫ్ట్‌వేర్‌ మార్పిడితో పాటు సెల్‌ఫోన్‌కు సంబంధించిన సామగ్రి అమ్మకాలతో చైనా బజార్‌ను తలపిస్తోంది.

సెకండ్‌ క్వాలిటీ సరుకులే..

ఈ షాపుల్లో ఎక్కువగా సెకండ్‌ క్వాలిటీ ఐటెమ్స్‌ విక్రయిస్తుంటారు. సెల్‌ఫోన్‌కు ఏ రిపేరు వచ్చినా షోరూంల్లో కంటే ఇక్కడికే ఎక్కువగా వస్తుంటారు. కంపెనీ పరికరాలైతే ధర ఎక్కువగా ఉండడం, ఇక్కడ తక్కువ ధరకు లభిస్తుండడంతో ఆ షాపులకు గిరాకీ ఏ మాత్రం తగ్గడం లేదు. కంపెనీకి చెందిన ఒక సెల్‌ ఫోన్‌ డిస్‌ప్లే రూ.3 వేలు పలుకుతుండగా, అదే ఇక్కడ మాత్రం సగం ధరకే లభిస్తున్నాయి. అయితే, ఇక్కడి వస్తువులకు మాత్రం గ్యారంటీ ఉండదు. అయినా, ఈ షాపులు మాత్రం నిత్యం కిటకిటలాడుతూనే ఉంటాయి. అయితే, ఈ సరుకులు మొత్తం ఢల్లీ, గుజరాత్‌ నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. జీవనోపాధి కోసం వచ్చిన గుజరాతీ మార్వాడీలు ఇదే బిజినెస్‌లో పాతుకుపోయినట్లు తెలుస్తోంది. వీరికి ఉత్తరాది భాషపై ఉన్న పట్టు, అక్కడి పరిచయాలతో వ్యాపారంలో రాటుదేలినట్లు అవగతమవుతోంది.

సాఫ్ట్‌వేర్‌ మార్పిడితో దోపిడీ వ్యాపారం..

ఇక్కడి వ్యాపార సముదాయాల్లో సెల్‌ఫోన్ల సాఫ్ట్‌వేర్‌ మార్చే టెక్నాలజీ ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. చోరీ కాబడిన సెల్‌ఫోన్లలో ఇక్కడ సాఫ్ట్‌వేర్‌ మార్చడంతో పాటు క్రయవిక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం. ఒకరిద్దరు నేరుగా వినియోగదారుల ఆధార్‌ కార్డులు తీసుకుని సాఫ్ట్‌వేర్‌ మార్చుతుండగా, పరిచయం ఉన్న వారి వ్యాపారుల ద్వారా అయితే, ఎలాంటి ఆధారాలు లేకపోయినా సాఫ్ట్‌వేర్‌ మార్చుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

చోద్యం చూస్తున్న పోలీసులు..

సెల్‌ఫోన్లు చోరీకి గురయ్యాయనే ఫిర్యాదుతోనే స్పందించే పోలీసులు అసలు ఈ ప్రాంతంలో ఎలాంటి వ్యాపారం సాగుతున్నదనే అంశంపై దృష్టి సారించలేకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. రోజుకు లక్షల్లో వ్యాపారం సాగుతున్నా వాణిజ్య శాఖ సైతం కన్నెత్తి చూడకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇక్కడ దొరికే సెల్‌ఫోన్‌ విడి భాగాలపై ఏ కంపెనీకి చెందినవనే సమాచారం లేకపోయినా.. విక్రయాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆ సరుకు ఎక్కడి నుంచి వస్తోంది? ఏ కంపెనీ నుంచి ఉత్పత్తి అవుతున్నదన్న ప్రశ్నలకు సమాధానం కరువనే చెప్పాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రైవేట్​ కొరియర్‌ ద్వారా వచ్చే ఈ సరుకుల దిగుమతులపై దృష్టి సారిస్తే వాస్తవాలు వెలుగు చూసే అవకాశం లేకపోలేదు.

ఇక ఇక్కడ విక్రయించే ఏ వస్తువుకైనా బిల్లులు ఉండవు.. అడిగినా ఇచ్చే వారే లేరని కొనుగోలుదారులు కొందరు చెబుతున్నారు. జిల్లాలోని ఇతర ప్రాంతాల షాపుల నిర్వాహకులు పెద్ద మొత్తంలో కొనుగోలు చేసే సరుకులకు సైతం ఎలాంటి రశీదులు లేకుండా.. కేవలం తెల్ల కాగితం ధరలు వేసి డబ్బులు తీసుకోవడం వరకే వ్యవస్థ సాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసు, వాణిజ్య శాఖ ఉమ్మడిగా ఈ ప్రాంతంలో జరిగే వ్యాపారాలపై తనిఖీలు చేపడితే సెల్‌ఫోన్ల లోగుట్టు ఏమిటో తెలిసిపోతుంది. అడ్డూ అదుపు లేకుండా మొఘల్​సామ్రాజ్యంలా విస్తరించుకున్న ఈ మొబైల్‌ బిజినెస్‌ అసలు గుట్టు రట్టయ్యే అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.


Next Story

Most Viewed