నర్సంపేటలో పంట నష్ట పరిహార చెక్కుల పంపిణీ ప్రారంభం..

by Disha Web Desk 11 |
నర్సంపేటలో పంట నష్ట పరిహార చెక్కుల పంపిణీ ప్రారంభం..
X

దిశ, నర్సంపేట: 2022లో కురిసిన అకాల వర్షం కారణంగా పంట నష్టం జరిగిన రైతులకు నష్టపరిహారం చెక్కుల పంపిణీ ప్రక్రియ నర్సంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రారంభమైంది. మంగళవారం రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ప్రావీణ్య చేతుల మీదుగా రైతులకు చెక్కులను పంపిణీ మొదలు పెట్టారు. సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ మాట్లాడుతూ.. పంట నష్టపరిహారంలో భాగంగా రైతులకు చెక్కులను ఇవ్వడం నర్సంపేట నియోజకవర్గంలో మొదలు పెట్టడం జరిగిందన్నారు. గత ఏడాది ఉమ్మడి వరంగల్ జిల్లాలో వడగండ్ల వర్షాలకు వేల మంది రైతులు పంట నష్టపోవడం జరిగిందన్నారు. ఇంత జరిగినా కేంద్రం పట్టించుకోలేదన్నారు.

జిల్లా వ్యాప్తంగా నర్సంపేటలోనే పెద్ద ఎత్తున నష్టం జరిగిందన్నారు. చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాలు అక్కడ కురిసిన భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు రూపాయి కూడా పంచలేదని విమర్శించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాకపోవడం వలన తెలంగాణకు నష్టం జరుగుతుందని చెప్పారు. ఇది ఇలా ఉండగా ఇటీవల కురిసిన అకాల వర్షానికి జరిగిన పంట నష్టాన్ని స్వయంగా పరిశీలించడానికి సీఎం కేసీఆర్ త్వరలో నర్సంపేటకు రానున్నట్లు స్పష్టం చేశారు. ప్రతి రైతు భూమి వద్దకు వెళ్లి నష్టపోయిన పంట వివరాలను సేకరించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు అందించాల్సిన నష్టపరిహారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 శాతం నిష్పత్తిలో ఇవ్వాలని గుర్తు చేశారు.

కానీ కేంద్రం ఎలాంటి నిధులు ఇవ్వలేదని, దీంతో నష్టపరిహారం మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే రైతులకు అందిస్తోందన్నారు. గత ఏడాది రైతులు నష్టపోయిన పంటలను వ్యవసాయ శాఖ అధికారులతో సర్వే నిర్వహించి వివరాలు కలెక్టర్ కు సమర్పించినట్లు తెలిపారు. అందులో వ్యవసాయ శాఖ భాగంలో మొత్తం 1,874 హెక్టార్ల పంట (అన్ని రకాల) నష్టానికి గాను 3,712 మంది రైతులకు రూ.1,56,16,302 లు అందాలన్నారు. ఉద్యానవన శాఖ కింద 5,265.81 హెక్టార్ల పంట నష్టానికి గాను 12,417 మంది రైతులకు రూ. 7,10,88,435 విలువ గల చెక్కులను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్, జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ సహకారంతో నర్సంపేట నియోజకవర్గ రోడ్ల మరమ్మత్తు కోసం రూ.64 కోట్లతో ప్రత్యేకమైన జీవో తీసుకురావడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు.

Next Story

Most Viewed