జిల్లా అధికారులపై ప్రజా దర్బార్‌లో ఫిర్యాదు

by Disha Web Desk 23 |
జిల్లా అధికారులపై ప్రజా దర్బార్‌లో ఫిర్యాదు
X

దిశ,జనగామ: జనగామ జిల్లా కలెక్టర్,జిల్లా పంచాయతీ అధికారి, డీసీపీ ఇతర పోలీసు ఉన్నతాధికారులపై ప్రజా దర్బార్ లో రఘునాథపల్లి గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. జ్యోతిరావు పూలే ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమానికి రఘునాథపల్లి గ్రామస్తులు శుక్రవారం తరలి వెళ్లారు. ఇందులో భాగంగా జిల్లాలోని రఘునాథపల్లి గ్రామ సర్పంచ్ పోకల శివ కుమార్,రౌడీ షీటర్ గా చలామణి అవుతూ సర్పంచ్ గా అనేక అవకతవకలకు పాల్పడ్డాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అతనిపై ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోవాల్సిన ఉన్నతాధికారులు నిర్లక్ష్యం చేస్తూ అతనికే వంత పాడుతున్నారని షాడ శ్రీనివాస్ సహా మరికొందరు ఆ ఫిర్యాదులో వివరించారు.

మొత్తం 100 పేజీలతో సర్పంచ్ అక్రమాలకు సంబంధించిన వివరాలు పొందుపరచి ఫిర్యాదు వెంట ప్రగతి భవన్ లో అందజేశారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అండదండలతో జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య,జిల్లా పంచాయతీ అధికారి రంగాచారి,డీసీపీ సీతారాం ఇతర అధికారులు సర్పంచ్ అనేక అక్రమాలకు పాల్పడుతున్న చర్యలు తీసుకోవడం లేదని మీడియాతో మాట్లాడుతూ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. సర్పంచ్ శివకుమార్ పై తక్షణమే చర్యలు తీసుకొని, అక్రమాలకు పాల్పడిన ప్రభుత్వ సొమ్మును రికవరీ చేయాలని కోరారు. అనంతరం జిల్లా మంత్రి సీతక్కను కూడా కలిశారు. అధికార యంత్రాంగం సర్పంచ్ పై చర్యలు తీసుకునే వరకు పోరాటం ఆపేది లేదని వారు స్పష్టం చేశారు.Next Story