రాష్ట్రానికి పెద్దకొడుకు సీఎం రేవంత్ రెడ్డి

by Sridhar Babu |
రాష్ట్రానికి పెద్దకొడుకు సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ పాలకుర్తి/తొర్రూరు : పేద ఇంటి ఆడపిల్లలకు అండగా, తెలంగాణ రాష్ట్రానికి పెద్ద కొడుకులా మన సీఎం రేవంత్ రెడ్డి ఉంటారని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీరెడ్డి అన్నారు. బుధవారం జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో పాలకుర్తి మండలానికి సంబంధించిన 62 మంది లబ్ధిదారులకు రూ 62,06,572 విలువగల చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీరెడ్డి అందచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...కళ్యాణలక్ష్మి పథకాన్ని తొలుత దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ప్రపోజల్ చేశారని, అదే పథకాన్ని గత పాలకులు కొనసాగించారని, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ కాంగ్రెస్ పథకాలే అని ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి అన్నారు.

గత ప్రభుత్వాల నాయకులు రాజకీయ కక్ష సాధింపుతో అర్హులైన లబ్ధిదారులకు పథకాలను అడ్డుకున్నారని అన్నారు. రానున్న కాలంలో పేదల కోసం మరిన్ని కార్యక్రమాలు చేపడతామని కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ప్రజల కండ్లల్లో ఆనందం చూడడమే ప్రధాన లక్ష్యం అని తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యపు పాలన వల్ల రాష్ట్ర ఖజానా భారీగా దెబ్బ తినటంతో తులం బంగారం అందించలేక పోతున్నామని, వారి దోపిడీని ఎండగట్టి పారదర్శక పాలన అందిస్తామన్నారు. రాష్ట్రంపై బీఆర్ఎస్ మోయలేని భారాన్ని వేసి ప్రజల భవిష్యత్ ను ప్రశ్నార్థకం చేసిందన్నారు. త్వరలోనే కళ్యాణ లక్ష్మి చెక్కులతో పాటుగా తులం బంగారం సైతం అందిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలతో నిరుపేదలు లబ్ధి పొందుతున్నారని, మా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, పార్టీ ముఖ్యనాయకులు, యూత్ నాయకులు, మహిళ నాయకులు, తదితరులు, పాల్గొన్నారు.

Next Story