రైతులూ తస్మాత్ జాగ్రత్త... ఈ రకాల వడ్లే పండించాలి...

by Disha Web Desk 20 |
రైతులూ తస్మాత్ జాగ్రత్త... ఈ రకాల వడ్లే పండించాలి...
X

దిశ, కాటారం : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కరపత్రాలతో వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఖరీఫ్ సీజన్లో ఈ రకం వరి విత్తనాలనే పండించాలని, 1001 రకం ధాన్యం పండిస్తే ఖరీదు చేయబోమని మిల్లర్లు పేర్కొంటున్నారు. ఈ వర్షాకాలం నుండి 1001, 1121, 1153, 1156 రకాల ధాన్యం పండించవద్దని, రైతులు రైస్ మిల్లర్లు ఎటువంటి ఇబ్బందులు పడరాదని కరపత్రాల్లో పేర్కొన్నారు. ఈ విషయమై ముద్రించిన కరపత్రాలను జిల్లాలోని కొనుగోలు కేంద్రాలు గ్రామాలలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. రాబోవు వానాకాలం సీజన్లో బాయిల్డ్ బియ్యం సేకరణ లేదు. కావున రాబోవు ఈ రకం విత్తనాలు వానాకాలం సీజన్లో వేయవద్దని మనవి చేస్తున్నాము. దీనికి సంబంధించిన జిల్లా కలెక్టర్ కి విజ్ఞప్తి పత్రం ఇచ్చినట్లు, భవిష్యత్తులో ఈ ధాన్యం పండిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ దిగుమతి చేసుకోమని రైస్ మిల్లుల అసోసియేషన్ ప్రకటించింది.

వర్షాకాలంలో రైతులు ఈ రకం వరి విత్తనాలు ఎంపీయు 1061, 1064, 1224, 1262, 1271, 1318, 7029, 2423, ఆర్ఎన్ఆర్, హెచ్ఎంటి, సోనా, 5204, స్వర్ణ వంటి రకాలు పండించినట్లయితే సీఎంఆర్ ధాన్యం సేకరణ విషయంలో ఇబ్బందులు ఉండవని, రైతులు ఎంఎస్పి పొందాలంటే నాణ్యత ప్రమాణాలు పాటించితే ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని రైతు సోదరులకు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేశారు. రైతులందరూ ఆలోచించి విన్నపాన్ని ఆచరణలో పెట్టాలని కోరారు.

రైస్ మిల్లులలో 1001 రకం వడ్ల నిల్వలు..

2021-22 వానాకాలంలో 1.30 వేలు, యాసంగిలో 57 వేలు, 2022 - 23 వానాకాలంలో 1,27,600 మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వం సేకరణ చేసి జయశంకర్ జిల్లా రైస్ మిల్లులకు అలాట్మెంట్ ఇచ్చారు. వీటిలో 1001 వెరైటీ ధాన్యము ఎక్కువగా 70% ఉంది. ప్రస్తుత పరిస్థితులలో ఈ ధాన్యం మరపట్టించగా వచ్చే బియ్యంలో అధికశాతం (45) నూకలు, పొట్ట తెలుపు, డ్యామేజీ ఆరుశాతం ఉండడం వలన ఈ బియ్యం ఎఫ్సిఐ సీఎంఆర్ సేకరణలో తీవ్రఇబ్బందులు ఉన్నట్లు పేర్కొంటున్నారు. బియ్యం సేకరణలో భాగంగా నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉండకపోవడంతో ఎఫ్సీఐ ఈ బియ్యాన్ని తిరస్కరిస్తుందని తిరస్కరణకు గురైన బియ్యం స్థితిలో ఉన్నట్లు ఆర్థికంగా నష్టపోతున్నట్లు గత సీజన్లో జిల్లాలో సేకరించిన 1001 రకం ధాన్యం ఇంకా దాదాపు 57 వేల మెట్రిక్ టన్ల ధాన్యం మిల్లుల వద్ద పేరుకుపోయినట్లు అసోసియేషన్ పేర్కొంది.

అయోమయ స్థితిలో రైతులు..

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రైస్ మిల్లర్లు కరపత్రాలతో పలురకాల వరి ధాన్యం పండించవద్దని కరపత్రాల ద్వారా ప్రచారం చేస్తుండటంతో ఏం చేయాలో తెలియని స్థితిలో రైతులు అయోమయంలో పడ్డారు. ఈ రకమైన ప్రచారం చేస్తుండడంతో వ్యవసాయ శాఖ లేదా ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు ఈ విషయమై ఎలాంటి ప్రకటన చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



Next Story

Most Viewed