అగ్గిరాజుకుంటే బుగ్గే.. ఏండ్లుగా ప్రమాదాల్లో నష్టపోతున్న ఏజెన్సీ వాసులు

by Disha Web Desk 23 |
అగ్గిరాజుకుంటే బుగ్గే.. ఏండ్లుగా ప్రమాదాల్లో నష్టపోతున్న ఏజెన్సీ వాసులు
X

దిశ, కొత్తగూడ : వేసవి కాలం సమీపించిందంటే కొత్తగూడ ప్రజలకు భయంకరమైన సంఘటన తిరుగాడుతుంది. కొత్తగూడ గ్రామ ప్రజలు మొత్తం తినడానికి తిండి లేక కట్టుకోవడానికి బట్ట లేక ఒంటి మీద కట్టు బట్టలు తప్ప మరే వస్తువు లేకుండా చెట్టు నీడలో తల దాచుకుంటూ బిక్కు బిక్కు మంటూ అభయహస్తం కొరకు ఎదురు చూస్తూ వారు పంచి పెట్టే అన్నం పొట్లాలను తొక్కిసలాటను సైతం లెక్క చేయకుండా పరుగెత్తి అందుకొని కడుపు నింపుకున్న ఘోర విషాద సంఘటన కొత్తగూడలో ఒకప్పుడు చోటుచేసుకుంది. అది ఇప్పటికీ ప్రజల మనస్సుల్లో దాగి ఉంది. చుట్టూ పచ్చదనంతో నిండిన గ్రామీణ ప్రాంతం కల్మషం ఎరుగని ప్రజలు కుల,మత భేదం లేకుండా కలిసి జీవిస్తున్న గ్రామంలో ఒక్కసారిగా విషాదం చోటుచేసుకుంది. 1985 మండు వేసవి పక్కనే ఉన్న అటవీ శాఖ కార్యాలయం సమీపం నుంచి మంటలు వ్యాపించాయి.

వ్యాపించిన మంటలు నెమ్మదిగా గ్రామంలోని ఓ ఇంటిపై నిప్పు మెరుగులు పడి అంటుకుంది ఒక్కొక్కటిగా ఊరంతా ధ్వంసం అయ్యి ఒక్క ఇళ్ళు మిగలకుండా వల్లకాడుగా మారింది. దాదాపు రెండు వందల ఇళ్లకు ఉన్న గ్రామంలో పూర్తిగా ధ్వంసం అయ్యి రెండే రెండు ఇళ్లు జంగాల నాగభూషణం, మహమ్మద్ తాజుద్దీన్ లకు చెందిన రెండు ఇళ్లు మాత్రమే మిగిలాయి. అలాంటి భయంకర సంఘటన జరిగి నలభై సంవత్సరాలు కావస్తోంది. ఇంతజరిగినా ఇప్పటి వరకు మండల కేంద్రములో అగ్నిమాపక శకటాలను ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. వేసవికాలంలో చెట్లు ఎండి ఆకులు రాలి ఆకతాయిలు, బీడీ, సిగరెట్ తాగి వేసిన, తునికి ఆకు ప్రూనింగ్ నిప్పుకు అగ్గి రాసుకుని మంటలు వ్యాపిస్తాయి. దీనివల్ల గ్రామాలలో మంటలు వ్యాపించి అగ్ని ప్రమాదం జరిగిన సంఘటనలు ఏజెన్సీ ప్రాంతంలో అప్పట్లో జనాల్ని భయాందోళనకు గురి చేసేవి. మార్చి ౧౦ 1984లో ఘటన అనంతరం మరలా 1990లో జరిగిన అగ్నిప్రమాదంలో 30 ఇళ్లు పూర్తిగా కాలిపోయాయి. అది మరువక ముందే 1998లో విద్యుత్ తీగలకు షార్ట్ సర్క్యూట్ అయ్యి గ్రామంలోని చిరు వ్యాపార సముదాయం మొత్తం అగ్నికి ఆహుతి అయ్యింది. ఇలాంటి సంఘటనలు కొత్తగూడలో కోకొల్లలు.


ఫైర్ ఇంజన్ వచ్చే సరికి బుడిదే మిగిలేది..

కొత్తగూడ, గంగారం మండలాల్లో మొత్తం దాదాపు ఎనభై గ్రామాలు ఉన్నాయి. ఎక్కడ అగ్నిప్రమాదం సంభవించిన మంటలను ఆర్పేందుకు నర్సంపేట అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వాల్సి వస్తుంది. వరంగల్ జిల్లాకు చెందిన నర్సంపేట నుంచి వచ్చే సరికి అగ్నికి ఆహుతి అయ్యి బూడిద మిగులుతోంది. బూడిదను ఆర్పి వెళ్ళటమే తప్ప మరేమీ ఉండదు. ఏజెన్సీ ప్రాంతం కావడంతో సౌకర్యాలు సరిగ్గా లేకపోవడంతో ఈ ప్రమాదాలకు ప్రజలు ఆర్థికంగా నష్ట పోతున్నారు. ఇలా మండలంలో తరుచూ సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. మండల కేంద్రానికి దూరంగా ఉన్న నర్సంపేట లో ఉన్న అగ్నిమాపక కేంద్రం నుంచి గ్రామాలకు దాదాపు 30 నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. మండలం లో ఎక్కడైనా అగ్ని ప్రమాద సంఘటనలు జరిగిందంటే నర్సంపేట నుండి గాని గూడూరు, మహబూబాబాద్ నుండి గాని అగ్ని శకటం (వాహనం) రావడానికి గంట నుంచి మూడు గంటలు పడుతుంది. అప్పటికే కాలి బూడిద అవుతుంది.


మండలం లో లోతట్టు గ్రామాల్లో పూరి గుడిసెలు పండించిన పంటలు గడ్డివాములలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదాలు జరిగి అగ్నిమాపక కేంద్రం అందుబాటులో లేకపోవడం వల్ల ఆర్థికంగా చాలా నష్ట పోయి కుటుంబాలు వీధిన పడుతున్నాయి. ఈ మధ్య కాలంలో మండలంలోని కిష్టపురం, ముస్మి, గంగారం, మర్రిగూడెం గ్రామాల్లో అగ్ని ప్రమాద సంఘటనలు జరిగి ఆర్ధికంగా నష్టపోయారు. వేసవికాలం ఎండలు దంచికొడుతున్నాయి. ఎప్పుడు ఏ అగ్ని ప్రమాదం సంభవిస్తుందొ అని మండల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు పాలకులు స్పందించింది అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

భయంకర పీడకలలు నేమరెస్తు కుటుంబ సభ్యులతో చెబుతుంటారు : యాకుబ్ పాషా కొత్తగూడ మైనారిటీ నాయకులు

వేసవి కాలం వచ్చిందంటే భయంకర పీడకలను నేమరేస్తు కుటుంబ సభ్యులతో చెబుతుంటాము. ఎలాంటి ఉరుకులు పరుగులు లేని జీవితం ప్రేమానురాగాల మధ్య గడుపుతున్న రోజుల్లో అగ్నికి ఆహుతి అయ్యి కొత్తగూడ గ్రామం మొత్తం కాలి బూడిద అయింది. మండే ఎండలు మిట్ట మధ్యాహ్నం ఒక్క సారిగా చెల రేగిన మంటలను కట్టుబట్టలతో ఊరి చివరన చెరువు వద్ద అడవిలో పరుగులు తీసి తల దాచుకున్నాం. కుటుంబ సభ్యులు ఒకరికొకరు సంబంధం లేకుండా ప్రాణాలను కాపాడుకునేందుకు పరుగులు తీశాము. మంటల్లో పడి కాలి పోయారా బ్రతికే ఉన్నారా అనే విషయం కూడా తెలియదు రెండవ రోజు వెతుక్కొని ఒకరికొకరు కలిశాము. గ్రామం మొత్తం కాలిపోవడంతో కొత్తగూడ ప్రజలు ఉండేందుకు ఇళ్ళు లేక చెట్ల కింద ప్రభుత్వ కార్యాలయాల్లో కాలం వెళ్లదీశాము.తినటానికి అన్నం లేదు కట్టుకోవడానికి బట్ట లేదు ఎవరు వచ్చి ఇస్తారో అని ఎదురు చూసేవాళ్ళం అలాంటి సంఘటన ఎవ్వరికి జరగకూడదు పెద్ద మండలం వెంటనే అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలి.

బాధిత కుటుంబాలను ఆదుకోవాలి : పూల యాదగిరి, మాజీ వైస్ ఎంపీపీ

ఏజెన్సీ ప్రాంతంలో నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలు కూలీ వ్యవసాయ పనులు చేసుకొని జీవిస్తున్నారు. వేసవి కాలంలో మండలంలోని వివిధ గ్రామాల్లో అగ్ని ప్రమాదానికి గురై ఆర్థికంగా నష్టపోయి చాలా కుటుంబాలు వీధిన పడ్డాయి. మండుతున్న ఎండలకు చిన్న చిన్న నిప్పు రవ్వలకు అగ్ని ప్రమాదాలు జరిగి గ్రామాలు బూడిద పాలవుతున్నయి. గతంలో జరిగిన అగ్ని ప్రమాదాలకు ఇళ్లు, సామగ్రి, ధనం, పశువులు మొత్తం అగ్నికి ఆహుతి అయ్యి ఇప్పటి వరకు కోలుకోకుండా జీవిస్తున్నారు. అతి పెద్ద మండలం అయిన కొత్తగూడలో అగ్ని మాపక కేంద్రాన్ని ఏర్పాటు చేసి అగ్ని ప్రమాదాలు జరగకుండా కాపాడి బాధిత కుటుంబాలను ఆదుకోవాలన్నారు.


అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలి : సిద్దబోయిన రమేష్, గాంధీనగర్ గ్రామ పెద్ద

ఇళ్లలో దొంగలు పడితే ఒకటి రెండు రకాలుగా కోల్పోయి కొంత నష్ట పోతారు. అదే అగ్ని ప్రమాదం జరిగితే అంతా ఊడ్చుకొని పోతుంది. ఏజెన్సీలో నిత్యం జరుగుతున్న అగ్ని ప్రమాదాలకు మండల ప్రజలు ఆర్థికంగా చాలా నష్టపోతున్నారు. అగ్ని ప్రమాదం జరిగి మంటల ఎగసి పడే వరకు ఆర్పడానికి ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత ఎక్కడో దూరాన ఉన్న అగ్నిమాపక కేంద్రానికి సమాచారం చేస్తారు. అయితే అగ్నిమాపక శకటం వచ్చే సరికే పూర్తిగా ధ్వంసం అయ్యి బూడిద మిగులుతుంది. చేసేదేముంది బూడిదను చల్లార్చి తన కర్తవ్యం తాను నిర్వర్తించి వాళ్ళు వెళ్ళిపోతారు. సర్వం కోల్పోయి వీధిన పడుతున్నారు ప్రమాదాలు జరిగిన వెంటనే అప్రమత్తం అయ్యి ఎటువంటి నష్టం జరగకుండా ఉండాలంటే స్థానికంగా అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలి.


Next Story