టెన్త్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా లాస్ట్ ప్లేస్.. నిర్లక్ష్యం ఎవరిది?

by Disha Web Desk 4 |
టెన్త్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా లాస్ట్ ప్లేస్.. నిర్లక్ష్యం ఎవరిది?
X

దిశ ప్రతినిధి, వికారాబాద్: వికారాబాద్ జిల్లా అంటే ఒకప్పుడు చదువులకు పుట్టినిల్లుగా వెలిగింది. ఉమ్మడి రాష్ట్రంలో పబ్లిక్ పరీక్ష ఏదైనా ఆ పరీక్షల్లో ఆంధ్ర విద్యార్థాలను మించి హైదరాబాద్ విద్యార్థులు ఉన్నత ర్యాంక్‌లు సాధిస్తే, హైదరాబాద్ విద్యార్థులకు మేము ఏ మాత్రం తక్కువ కాదు అనేలా వికారాబాద్ జిల్లా విద్యార్థులు చదువులో పోటీ ఉండేది. అందుకే ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్థులు చాలా మంది హైదరాబాద్‌లోని విద్యాసంస్థలను కాదని వికారాబాద్‌కు వచ్చి చదువులు పూర్తి చేసేవారు.

ప్రతిరోజు హైదరాబాద్ నుంచి ట్రైన్‌లో వచ్చి మరీ చదువుకుంటుంటే, వికారాబాద్ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగేది. మంచి వాతావరణం, మంచి చదువు కావాలి అంటే వికారాబాద్ లో మాత్రమే దొరుకుతుంది అనే ప్రచారం ఉండేది. కానీ ఇప్పుడు వికారాబాద్ జిల్లాల్లో విద్యా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్థం అయ్యిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. గత బుధవారం విడుదలైన 10వ తరగతి పరీక్షల్లో వికారాబాద్ జిల్లా అట్టడుగు స్థాయికి పడిపోయింది. గతేడాది 24వ స్థానంలో ఉన్న జిల్లా ఈ ఏడాది ఏకంగా 33వ స్థాయికి పడిపోయిందంటే ఇక్కడ విద్యా వ్యవస్థ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. విద్యార్థులపై కరోనా ప్రభావం కూడా పడినట్లు తెలుస్తోంది.

10 పరీక్షలపై పేపర్ లీకేజీ ప్రభావం..!

తాండూర్‌లోని నెంబర్ 1 పాఠశాలలో మొదటి రోజు జరిగిన పేపర్ లీకేజీ ఘటన రాష్ట్రంలో హాట్ టాపిక్ అయ్యింది. ఈ ఘటనతో జిల్లాలో పరీక్షలు మరింత స్ట్రిక్ట్‌గా నిర్వహించడం ఫలితాలపై చాలానే ప్రభావం పడిందని చెబుతున్నారు. పైగా ఈ సారి 100 శాతం సిలబస్ ఉండడం, ఎక్జామ్ ప్యాటర్న్ మొత్తం ఛేంజ్ చేయడం కూడా ఈసారి ఫలితాలపై ప్రభావం పడినట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. పరీక్షలో అవుట్ అఫ్ సిలబస్ నుంచి ప్రశ్నలు వచ్చినట్లు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఎక్కువగా గణితం పరీక్షలోనే విద్యార్థులు ఫెయిల్ అయినట్లు, పాస్ అయినవారికీ తక్కువ మార్కులు వచ్చినట్లు తెలుస్తుంది.

ఇదిలా ఉంటే పేపర్ లీకేజ్ ఘటన అనంతరం కలెక్టర్ నారాయణ రెడ్డి ఇతర శాఖల అధికారుల పర్యవేక్షణలో పరీక్షలు ఎప్పుడూ లేనివిధంగా పకడ్బందీగా నిర్వహించడం కూడా ఫలితాలపై ప్రభావం చూపినట్లు తెలుస్తుంది. ఇలా అనేక కారణాలతో ముఖ్యంగా ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే వికారాబాద్ జిల్లా రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిందని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. కాబట్టి వచ్చే ఏడాదైనా జిల్లాకు పూర్వ వైభవం తీసుకొచ్చి వికారాబాద్ జిల్లా అంటే చదువులకు పుట్టినిల్లు అనేలా గుర్తింపు తెచ్చేలా అధికారులు, ఉపాధ్యాయులు కష్టపడాలని కోరుకుందాం.

టెన్త్ ఫలితాల్లో పూర్తిగా వెనకబడ్డ జిల్లా

ఈ మధ్యే విడుదలైన ఇంటర్ ఫలితాలు కొంత అటు ఇటుగా ఉన్నప్పటికీ, 10వ తరగతి ఫలితాల్లో మాత్రం జిల్లా పూర్తిగా వెనకబడిన పరిస్థితి. కేవలం 59.46 శాతం ఉత్తిర్ణత సాధించి 10 ఫలితాల్లో రాష్ట్రంలోనే అత్యంత వెనకబడిన జిల్లాలో ఒకటిగా రికార్డ్ సృష్టించింది. గతే డాది 90.46 శాతం ఉత్తీర్ణత సాధించడం గమనార్హం. ఈ ఏడాది ఏకంగా జిల్లాలోని 4 పాఠశాలలో ఒక్కరంటే ఒక్క విద్యార్థి పాస్ కాలేదు.. అంటే జిల్లాలో విద్యారంగం పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో విద్యా వ్యవస్థ ఇంత విఫలమవడం విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయుల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని చెప్పలేమని, జిల్లాలో ఉపాధ్యాయుల కొరత పెద్ద సమస్య అని అధికారులు, ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రధాన సమస్యగా టీచర్స్ కొరత

జిల్లాలో ఉపాధ్యాయుల కొరత అత్యంత ప్రధాన సమస్యగా కనిపిస్తుంది. ప్రభుత్వం ప్రతి సబ్జెక్ట్‌కు ఒక టీచర్‌ను నియమించాల్సింది. కనీసం స్కూల్స్‌కు ఇద్దరు, ముగ్గురు టీచర్లు మినహా ఉపాధ్యాయులు నియమించడంలో ప్రభుత్వం విఫలమైంది. ఇలాంటి సమయంలోనే బదిలీల పేరుతో అకడమిక్ ఇయర్ మధ్యలో ప్రభుత్వం ఇష్టారాజ్యంగా బదిలీలు చేయడంలో, ప్రాథమిక పాఠశాలకు బోధించే అనుభవం లేని ఉపాధ్యాయులు పదో తరగతి విద్యార్థులకు బోధించాల్సి వచ్చింది. రాష్ట్రంలో ఉపాధ్యాయుల కొరత ఉన్న జిల్లాలో వికారాబాద్ మొదటి స్థానంలో ఉంది.

సుమారు 630 మంది స్కూల్ అసిస్టెంట్లకు పైగా ఉన్నత స్థాయి విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయులు లేరు. 300 మందికి పైగా ప్రాథమిక స్థాయిలో బోధించే ఉపాధ్యాయులకు ఉన్నత తరగతులను బోధించే బాధ్యతలను అప్పగించారు. ఇలాంటి కారణాలతో జిల్లాలోని రెసిడెన్షియల్ పాఠశాలలు మినహా, ప్రభుత్వ పాఠశాలలో ఉత్తీర్ణత శాతం పూర్తిగా పడిపోయినట్లు స్పష్టం అవుతుంది. చివరికి ఈ ఏడాది ప్రైవేట్ స్కూల్స్ కూడా వంద శాతం ఉత్తీర్ణతలో వెనకబడడంతో జిల్లా పరువు పూర్తిగా పోయినట్లయ్యింది. 10 జీపీఏ సాధించడంలో జిల్లా ఆధిక్యత సాధించినప్పటికీ వంద శాతం ఉత్తీర్ణత సాధించడంలో విఫలమైంది.

Next Story

Most Viewed