హైదరాబాద్ శివార్లలో అసాంఘిక కార్యకలాపాలు

by Disha Web Desk 2 |
హైదరాబాద్ శివార్లలో అసాంఘిక కార్యకలాపాలు
X

హైదరాబాద్ శివార్లలోని ఫామ్ హౌజులు ఇల్లీగల్ యాక్టివిటీస్ కు కేంద్రంగా మారాయి. మద్యం, పేకాట, హుక్కా అక్కడ కామన్ గా మారిపోయాయి. కొన్ని సార్లు అవి క్రిమినల్స్ కు షెల్టర్ జోన్లుగా మారిపోతున్నాయి. ఎస్ఓటీ పోలీసులు అప్పుడప్పుడు దాడులు చేస్తున్నా.. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఆగడం లేదు.

దిశ, తెలంగాణ బ్యూరో క్రైమ్: హైదరాబాద్ శివార్లలో వందకు పైగా ఫామ్ హౌజులు, గెస్ట్ హౌజులు ఉన్నాయి. ముఖ్యంగా మొయినాబాద్, చిల్కూర్, శంషాబాద్, శంకర్ పల్లి, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, శంషాబాద్, షాద్ నగర్, కొత్తూరు ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. కొందరు యజమానులు వీటిలో పూలతోటలు, కూరగాయలతోపాటు ఇతర పంటలు పండిస్తుండగా, మరికొందరు వాటిని అద్దెలకు ఇస్తూ దండిగా సంపాదిస్తున్నారు. ఫామ్ హౌజ్ లోపల స్విమ్మింగ్ పూళ్లు, కాటేజీలు, బాంక్వేట్ హాళ్లు కట్టించి రోజుకు రూ.25 వేల నుంచి రూ.35 వేల వరకు అద్దెకు ఇస్తున్నారు. మరికొందరు లాడ్జీల్లా భవనాలు నిర్మించి రోజుకు రూ.3వేల నుంచి రూ. 10వేల వరకు వసూలు చేస్తున్నారు.

నిరంతరం నిఘా..

డబ్బు సంపాదనే లక్ష్యంగా ఉన్న యజమానులు ఫామ్ హౌజులను ప్రధాన రహదారులకు ఒకటి నుంచి నాలుగు కిలోమీటర్ల లోపల కడుతున్నారు. మెయిన్ గేట్ల వద్ద చెక్ పోస్టులు పెట్టి పెద్ద సంఖ్యలో ప్రయివేట్ సెక్యూరిటీ గార్డులను నియమిస్తున్నారు. సీసీ కెమెరాలు పెట్టి వాటి కంట్రోల్ రూంలను ఎక్కడో లోపల ఏర్పాటు చేసి నిరంతరం నిఘా పెడుతున్నారు. 10 నుంచి 30 మంది వరకు బౌన్సర్లను నియమించుకుంటున్నారు. మా దగ్గరకు వస్తే ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకుంటామని ప్రచారం చేసుకుంటున్నారు. వీకెండ్స్ లో ఈ ఫామ్ హౌజులు, గెస్ట్ హౌజులు కిటకిటలాడుతూ కనిపిస్తుంటాయి.

పేకాట, హుక్కా, రేవ్ పార్టీలు

వీకెండ్స్ లో చాలా ఫామ్ హౌజులు పేకాట క్లబ్స్ గా మారిపోతున్నాయి. గదులు అద్దెకు తీసుకొని చాలా మంది జూదం ఆడుతున్నారు. వీరిలో రియల్టర్లు మొదలుకొని చాలా మంది ప్రముఖులు ఉంటున్నారు. అంతేకాకుండా మద్యం, హుక్కా ఇక్కడ సర్వసాధారణమైపోయింది. రేవ్ పార్టీలు కూడా జరుగుతున్నాయి. డ్రగ్స్ ను కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తున్నది. కొన్నిసార్లయితే ఇవి వాంటెడ్ క్రిమినల్స్ కు కూడా షెల్టర్లుగా మారిపోతున్నాయి. మహరాష్ట్ర, బీహార్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక తదితర రాష్ర్టాలకు చెందిన పాతనేరస్తులు పోలీసుల నుంచి తప్పించుకోవటానికి హైదరాబాద్శివార్లలోని ఫామ్ హౌజులు, గెస్ట్ హౌజులలో తల దాచుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. గతంలో ఇలా షెల్టర్ తీసుకున్న నేరస్తులను అరెస్టు చేసినట్లు ఎస్వోటీకి చెందిన ఓ అధికారి తెలిపారు.

'మామూలు'గా తీసుకుంటున్న పోలీసులు

ఫామ్ హౌజుల్లో జరుగుతున్నదని అంతా తెలిసినా కొందరు పోలీసులు 'మామూలు'గా తీసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. యజమానులు నెలానెలా కొంత మొత్తాన్ని వీరికి పంపిస్తున్నారనే విమర్శలున్నాయి. రేవ్ పార్టీలాంటివి ఏర్పాటు చేసినపుడు అదనంగా సమర్పించుకుంటున్నట్లు తెలుస్తున్నది. పై అధికారులు దాడులకు ప్లాన్ చేస్తే స్థానిక పోలీసులు ఆ సమాచారాన్ని ముందుగానే అవతలి వారికి అందిస్తున్నారని, దాంతో వాళ్లు జాగ్రత్త పడుతున్నారని ఎస్ఓటీసి చెందిన ఓ అధికారి తెలిపారు. అందుకే ఇటీవల మా కిందిస్థాయి సిబ్బందికి కూడా తెలియకుండా ఆకస్మిక దాడులు చేస్తున్నట్టు చెప్పారు. అయినా, కొన్నిసార్లు ఫామ్ హౌజ్, గెస్ట్ హౌజ్ నిర్వాహకులు తప్పించుకుంటున్నట్టు తెలిపారు. మెయిన్ గేట్ల వద్ద పెడుతున్న సీసీ కెమెరాలను దీనికి ఉపయోగించుకుంటున్నట్టు వివరించారు.

Also Read..

గురుకుల ఖాళీల భర్తీకి ఎలక్షన్ కోడ్ ఎఫెక్ట్..

Next Story

Most Viewed