బిగ్ న్యూస్: డేంజర్ జోన్‌లో ఇద్దరు BRS మంత్రులు.. కొత్త ముఖాలను బరిలోకి దించేందుకు KCR ప్లాన్!

by Disha Web Desk 19 |
బిగ్ న్యూస్: డేంజర్ జోన్‌లో ఇద్దరు BRS మంత్రులు.. కొత్త ముఖాలను బరిలోకి దించేందుకు KCR ప్లాన్!
X

రాష్ట్రమంత్రుల్లో ఇద్దరు డేంజర్ జోన్‌లో ఉన్నట్టు తెలుస్తున్నది. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తే వారు ఓడిపోతారని, ఈ విషయాన్ని ఇప్పటికే గ్రహించిన సీఎం కేసీఆర్.. ఆ స్థానాల్లో కొత్త వారిని ఎంపిక చేయడంపై ఫోకస్ పెట్టారని మరో మంత్రి తాజాగా ఆఫ్ ది రికార్డుగా చెప్పారు. ఆ స్థానాల్లో ప్రస్తుతం బీజేపీ గెలిచే చాన్స్ ఉందని చెప్పిన సదరు మినిస్టర్.. ఆ రెండు స్థానాల్లో ఒకదాంట్లో గెలిచే చాన్స్ ఉన్న విపక్ష పార్టీ అభ్యర్థిని బీఆర్ఎస్‌లోకి చేర్చుకునే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. మరి ఆ ఇద్దరు మంత్రులు ఎవరు అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ప్రస్తుతం మంత్రులుగా కొనసాగుతున్న వారిలో ఇద్దరు వచ్చే ఎన్నికల్లో గెలవడం కష్టంగా కనిపిస్తున్నది. ఫలితంగా వీరికి బీఆర్ఎస్ తరఫున టికెట్ దక్కదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయాన్ని మరో మంత్రి సోమవారం ఆఫ్ ది రికార్డుగా చెప్పారు. సోమవారం హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్‌లో మీడియాతో మాట్లాడిన సదరు మంత్రి.. వచ్చే ఎన్నికల్లో మంత్రులు, ఎమ్మెల్యేల గెలుపు ఓటములు, పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చే పరిస్థితులపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.

ఇద్దరు మినిస్టర్లకు సొంత సెగ్మెంటల్లో వ్యతిరేకత ఉన్నదని, ఆ రెండు స్థానాల్లోనూ బీజేపీ గెలిచే చాన్స్ ఉందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆ ఇద్దరు మంత్రులకు గడ్డుకాలం ఉన్నదన్నారు. సదరు మినిస్టర్ మాటల ప్రకారం గడ్డుపరిస్ధితుల్లో ఉన్న ఆ ఇద్దరు మంత్రులు ఉత్తర తెలంగాణకు చెందని వారేనని తెలుస్తున్నది. అందులో ఒకరు 2004 నుంచి, మరోకరు 2009 నుంచి వరసగా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తున్నారు.

వారు వచ్చే ఎన్నికల్లో ఓడిపోతారనే విషయం తెలుసుకున్న సీఎం కేసీఆర్.. ప్రత్యామ్నయ మార్గాలను అన్వేషిస్తున్నట్టు సదరు మంత్రి తెలిపారు. అందులో భాగంగా ఓ అసెంబ్లీ సెగ్మెంట్‌లో గెలిచే అవకాశం ఉన్న విపక్ష పార్టీ అభ్యర్థిని బీఆర్ఎస్‌లోకి చేర్చుకునే చాన్స్ కూడా ఉందని చెప్పుకొచ్చారు.

మా ఫ్యామిలీకి రెండు టికెట్లు

వచ్చే ఎన్నికల్లో తమ ఫ్యామిలీకి రెండు టికెట్టు వస్తాయని సదరు మంత్రి ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేతో పాటు ఎంపీ సీటు ఇస్తానని ఈ మధ్యే సీఎం కేసీఆర్ తనకు హామీ ఇచ్చినట్టు తెలిపారు. ఆ రెండు స్థానాల్లో తాము విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. సిటీలో బీజేపీకి పెద్దగా సానుకూలత లేదని సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఒక్క ఎమ్మెల్యే స్థానంలోనూ ఆ పార్టీ విజయం సాధించదని అన్నారు.

మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మాత్రం రెండు నుంచి మూడు ఎమ్మెల్యే స్థానాల్లో బీజేపీ గెలిచే చాన్స్ ఉందని పేర్కొన్నారు. కానీ మల్కాజిగిరి ఎంపీ స్థానంలో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మూడోసారి పవర్‌లోకి వచ్చేందుకు మరికొందరు పహిల్వాన్లు బీఆర్ఎస్‌లోకి చేర్చుకుంటామని సదరు మినిస్టర్ వివరించారు. ఏ పార్టీ నుంచి వస్తారనే విషయాన్ని ఇప్పడు చెప్పలేనన్నారు. గులాబీ పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్లిన ఇద్దరుముగ్గురు లీడర్లు తిరిగి సొంత గూటికి వచ్చేందుకు రెడీగా ఉన్నారని చెప్పుకొచ్చారు.

Next Story

Most Viewed