ట్రూ అప్ చార్జీల భర్తీ రాష్ట్ర సర్కారుదే.. టీఎస్ ఈఆర్సీ కమిషన్ చైర్మన్ శ్రీరంగారావు వెల్లడి

by Dishafeatures2 |
ట్రూ అప్ చార్జీల భర్తీ రాష్ట్ర సర్కారుదే.. టీఎస్ ఈఆర్సీ కమిషన్ చైర్మన్ శ్రీరంగారావు వెల్లడి
X

దిశ, తెలంగాణ బ్యూరో : ట్రూ అప్ చార్జీలను ప్రజలపై రుద్దడం సరికాదని, దీన్ని రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేస్తోందని తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్(టీఎస్ ఈఆర్సీ) చైర్మన్ శ్రీరంగారావు తెలిపారు. టీఎస్ ఈఆర్సీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2023-24 ఏడాదికిగాను రిటైల్ సప్లయ్ టారిఫ్ ను ఆమోదించారు. డిస్కంలు సమర్పించిన ఏఆర్ఆర్ లకు అనుగుణంగానే ఈఆర్సీ ఆమోదం తెలిపింది. కాగా పవర్ పర్చేస్ కాస్ట్ ను కిలోవాట్ కు రూ.4.49 ప్రస్తుతం ఉండగా దాన్ని రూ.4.39 గా చేసింది. 10 పైసలు తగ్గించింది. యావరేజ్ కాస్ట్ ఆఫ్ సర్వీస్ ను కిలోవాట్ కు రూ.7.03 ఉంటే దాన్ని రూ.7.02 కు స్పల్పంగా తగ్గించింది.

ఇదిలా ఉండగా డిస్కంలు తమ నష్టాలను పూడ్చుకునేందుకు ప్రజలపై ట్రూ అప్ చార్జీల పేరిట భారం వేసిన విషయం తెలిసిందే. 15 ఏండ్లుగా పెండింగ్ లో ఉన్న చార్జీలను ఒక్కసారిగా వేసి ప్రజల నుంచి పిండుకోవాలని చూసింది. కానీ డిస్కంల నష్టాలను తాము పూడుస్తామని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందని శ్రీరంగారావు తెలిపారు. ఐదేండ్ల పాటు రూ.12,718 కోట్లను వడ్డీతో సహా చెల్లించనున్నట్లు చెప్పారు. ఇకనుంచి విద్యుత్ పంపిణీ సంస్థలు అంతర్గత సామర్థ్యాన్ని పెంచుకుని సరఫరాకు అంతరాయం కలగకుండా చూసే అంశంపై దృష్టిపెట్టాలని ఈఆర్సీ కమిషన్ స్పష్టంచేసింది. అంతే తప్పా ప్రభుత్వం నుంచి ఏమీ ఆశించవద్దని క్లారిటీ ఇచ్చింది. ఇదిలా ఉండగా ప్రార్థనా మందిరాలకు ఉన్న విద్యుత్ బిల్లులను తగ్గిస్తూ ఈఆర్సీ నిర్ణయం తీసుకుంది.

గతంలో రూ.6.40 నుంచి రూ.7 వరకు ఉండగా 2 కిలోవాట్ లోడ్ లోబడి ఉన్నా, అంతకుమించి ఉన్నా రూ.5 గానే వసూలు చేయనున్నట్లు స్పష్టంచేశారు. ఇటీవల విద్యుత్ వినియోగం పీక్ డిమాండ్ కు చేరుకున్న విషయం తెలిసిందే. అయితే డిస్కంలు 16 వేల మెగావాట్ల విద్యుత్ అందించడం మంచిందే అయినా వినియోగదారులకు పొదుపుగా వినియోగించుకోవాలని సూచించడంపై దృష్టిసారించాని ఆదేశించింది. ప్రభుత్వ కార్యాలయాల పెండింగ్ బిల్లులు వసూలు చేయాలని ఆదేశాలు జారీచేసింది. బిల్లులు తక్కువగా వస్తున్న చోట టార్గెట్ పెట్టుకుని వసూలుచేయాలని ఉద్యోగులకు సూచించాలని ఈఆర్సీ కమిషన్ చైర్మన్ శ్రీరంగారావు స్పష్టంచేశారు. మొత్తానికి విద్యుత్ వినియోగదారులకు భారం లేకుండా టారిఫ్ ను ఈఆర్సీ ఆమోదించింది. కస్టమర్ చార్జీల్లోనూ ఎలాంటి మార్పులు చేయలేదు.

Next Story

Most Viewed