అలర్ట్: TS పీఈసెట్-2023 షెడ్యూల్ రిలీజ్.. దరఖాస్తులకు చివరి తేదీ అదే!

by Disha Web Desk 19 |
అలర్ట్: TS పీఈసెట్-2023 షెడ్యూల్ రిలీజ్.. దరఖాస్తులకు చివరి తేదీ అదే!
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ స్టేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ పీఈసెట్) – 2023 షెడ్యూల్ విడుద‌లైంది. బీ.పీఈడీ, డీ.పీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్‌పీఈసెట్ నోటిఫికేష‌న్ ఈ నెల 13న విడుద‌ల కానుంది. ఉన్నత విద్యామండ‌లి తరపున శాతవాహన విశ్వవిద్యాలయం నిర్వహిస్తోంది. ఈ షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండ‌లి చైర్మన్ ప్రొఫెస‌ర్ ఆర్ లింబాద్రి గురువారం విడుదల చేశారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 15 నుంచి మే 6వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌రఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీల‌కు రూ. 500, మిగ‌తా కేట‌గిరిల వారికి రూ. 900గా ఫీజు నిర్ణయించారు. లేట్ ఫీజు రూ. 500తో మే 15 వ‌ర‌కు, రూ. 2000తో మే 20 వ తేదీ వ‌ర‌కు, రూ. 5 వేల‌తో మే 25వ తేదీ వ‌ర‌కు ఆలస్య రుసుముతో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

మే 26 నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ ప్రక్రియ ఉంటుంది. జూన్ 1 నుంచి 10వ తేదీ వ‌ర‌కు ఫిజిక‌ల్ టెస్టులు నిర్వహించ‌నున్నారు. జూన్ మూడో వారంలో ఫ‌లితాల‌ను విడుద‌ల చేయ‌నున్నారు. అర్హత త‌దిత‌ర వివ‌రాల కోసం www.pecet.tsche.ac.in అనే వెబ్‌సైట్‌ను సంద‌ర్శించాలని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ వి. వెంకట రమణ, శాత‌వాహ‌న యూనివ‌ర్సిటీ వీసీ, టీఎస్ పీఈసెట్ చైర్మన్ ఎస్ మల్లేశ్‌, మ‌హాత్మాగాంధీ యూనివ‌ర్సిటీ వీసీలు గోపాల్ రెడ్డి, పాల‌మూరు యూనివర్సీటీ వీసీ ల‌క్ష్మీకాంత్ రాథోడ్, ఉన్నత విద్యామండలి కార్యదర్శి శ్రీనివాసరావు, టీఎస్ పీఈసెట్ కన్వీనర్ రాజేష్ కుమార్ పాల్గొన్నారు.



Next Story

Most Viewed