TSPSC పేపర్ల లీకేజీ పాపం కేటీఆర్ శాఖదే: రేవంత్ రెడ్డి ఫైర్

by Disha Web Desk 19 |
TPCC Chief Revanth Reddy Slams CM KCR and PM Modi Over Floods assistance
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీక్ వ్యవహారంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి మంత్రి కేటీఆర్‌ను టార్గెట్ చేశారు. పేపర్ లీక్ ఘటనకు మంత్రి కేటీఆర్ పరిధిలో ఉన్న ఐటీ శాఖే కారణం అని ధ్వజమెత్తారు. బుధవారం రేవంత్ రెడ్డి నేతృత్వంలో టీ కాంగ్రెస్ నేతలు పొన్నాల లక్ష్మయ్య, మధు యాష్కీ, సంపత్ కుమార్, మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, మల్లు రవి, వేం నరేందర్ రెడ్డి, తదితరులతో కూడిన బృందం గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌ను కలిశారు.

ఈ సందర్భంగా టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ అంశంపై జరిగిన అవకతవకలపై ఫిర్యాదు చేశారు. గవర్నర్‌తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్‌తో లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందని.. ఈ వ్యవహారంలో మంత్రి కేటీఆర్ శాఖ ఉద్యోగులదే కీలక పాత్ర అని ఆరోపించారు.

మంత్రి కేటీఆర్, జనార్దన్ రెడ్డి, అనితా రామచంద్రన్‌ను ప్రాసిక్యూట్ చేయడానికి కాంగ్రెస్‌కు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌కు అప్లికేషన్ ఇచ్చామన్నారు. కేసు విచారణలో ఉన్నందున ఈ ముగ్గురిని అదే పదవిలో కొనసాగిస్తే కేసును తప్పుదోవ పట్టించే అవకాశం ఉందని, గవర్నర్ తనకు ఉన్న విచక్షణ అధికారాలను ఉపయోగించుకుని తక్షణమే వారిని పదవుల్లో నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. సిట్ విచారణపై తమకు నమ్మకం లేదని కేసు దర్యాప్తు పారదర్శకంగా జరిగేలా చూడాలన్నారు. పేపర్ లీకేజీలో ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందిని.. కోట్లాది రూపాయలకు పేపర్లు అమ్ముకున్నారని ఆరోపించారు. తమ ఫిర్యాదుపై గవర్నర్ సానుకూలంగా స్పందించారని, న్యాయ సలహా తీసుకుని ముందుకు వెళ్తానని చెప్పినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.

Next Story

Most Viewed