ప్రధాని మోడీకి కేసీఆర్ అంటే ఎందుకంత భయం..? రేవంత్ రెడ్డి ఫైర్

by Satheesh |
ప్రధాని మోడీకి కేసీఆర్ అంటే ఎందుకంత భయం..? రేవంత్ రెడ్డి ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలతో కేసీఆర్ పని ఖేల్ ఖతం అయిందని.. ఇకనైనా కేసీఆర్ అబద్దాలు చెప్పడం మానుకోవాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి రద్దు చేస్తారని, రైతుబంధు రద్దు అవుతుందని కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. అబద్దాల పోటీ పెడితే ఫస్ట్ ప్రైజ్ కేసీఆర్, కేటీఆర్‌లో ఎవరికి ఇవ్వాలో అర్థం కాదంటూ ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ మతి ఉండి మాట్లాడుతున్నారా లేక మందేసి మాట్లాడుతున్నారా అంటూ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఖానాపూర్ నియోజకవర్గం ఉట్నూర్‌లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రజా గర్జన సభలో మాట్లాడారు.

రాబోయే కాంగ్రెస్ పాలనలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను ప్రత్యేక నిధులతో అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఇంద్రవెల్లి కాల్పుల్లో మరణించిన గోండులు, ఆదివాసీల కుటుంబాలను గుర్తించి వారికి న్యాయం చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. వెడ్మ బొజ్జు పటేల్‌ను ఇక్కడి నుంచి గెలిపిస్తే మీకోసం పని చేస్తాడని ఇందుకు నేను మాటిస్తున్నానన్నారు. కాంగ్రెస్‌లో కొట్లాడి మరీ పేద వ్యక్తి వెడ్మ బొజ్జుకు టికెట్ ఇప్పించాన్నారు. కాంగ్రెస్ టికెట్లు అమ్ముకుంటున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఓట్లున్న వారికే కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇస్తే కోట్ల రూపాయలున్న వారికి బీఆర్ఎస్ టికెట్లు ఇచ్చిందన్నారు.

ధరణి ముసుగులో కేసీఆర్ కుటుబం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భూములను కబ్జా చేసిందని అలాంటి ధరణిని బంగాళాఖాతంలో వేస్తామంటే కేసీఆర్‌కు ఎందుకంత ఏడ్పు అని ప్రశ్నించారు. ధరణి స్థానంలో ఎవరికి నష్టం జరగకుండా మెరుగైన పోర్టల్ తీసుకువస్తామన్నారు. ఆదివాసీలు, లంబాడీలకు ఇందిరమ్మ కాలంలో ఇచ్చిన పట్టాలను మీ పేరుమీదనే ఇచ్చి వాటిని అమ్ముకునే హక్కు కల్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందన్నారు.

మోడీకి కేసీఆర్ అంటే ఎందుకంత భయం?:

నిన్న ప్రధాని మోడీ వచ్చి కాళేశ్వరం పేరైనా ఎత్తకుండా వెళ్లిపోయారని అన్నారు. కేసీఆర్‌ను చూసి మోడీ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ దగ్గర బీజేపీ లంచాలు తీసుకుందా అని నిలదీశారు. బీసీ వ్యక్తిని సీఎం చేస్తే మాకెలాంటి అభ్యంతరం లేదన్న రేవంత్.. మోడీ తొలుత గుజరాత్‌లో బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసి తెలంగాణకు వచ్చి చెప్పాలన్నారు. బీజేపీ పార్టీ 10 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఉంటే కేవలం ఒక్క చోట మాత్రమే బీసీ సీఎం ఉన్నారని.. అదే కాంగ్రెస్ పార్టీ నాలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉంటే మూడు చోట్ల బీసీలే ముఖ్యమంత్రులు ఉన్నారని అన్నారు. డిపాటిట్లే రాని బీజేపీ బీసీలను ఎలా సీఎం చేస్తుందని ప్రశ్నించారు. బీసీ పేరుతో ఓట్లు కొల్లగొట్టాలని చూస్తున్నారు ఇదేనా మీ నీతి అని ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం మూడు ఒక్కటే అని దొరల తెలంగాణ కావాలా ప్రజల తెలంగాణ కావాలా అనేది ప్రజలు నిర్ణయించుకోవాలన్నారు. కాంగ్రెస్‌కు అవకాశం ఇస్తే మెరుగైన పాలన అందిస్తామన్నారు.

Next Story