ఆ మూడు పార్టీలు ఒక్కటే..: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

by Disha Web Desk 4 |
ఆ మూడు పార్టీలు ఒక్కటే..: సీపీఐ  జాతీయ కార్యదర్శి నారాయణ
X

దిశ, తెలంగాణ బ్యూరో : లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియాను అరెస్టు చేసి, కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. బుధవారం అయన ముగ్దుమ్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. బీ‌ఆర్‌ఎస్, ఎంఐ‌ఎం, బీజేపీలు ఒకే తాను ముక్కలు అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా బ్రహ్మాండంగా పోరాడతున్నట్లు ఎం‌ఐఎం వ్యవహరిస్తుందన్నారు. బీజేపీని గెలిపించేందుకు ఆ పార్టీ శాయ శక్తుల కృషి చేస్తున్నదని అన్నారు. బీఆర్‌ఎస్ కూడా బీజేపీతో లోపాయికారిగా రాజకీయ అవగాహన చేసుకున్నదన్నారు. ఏపీలో వైసీపీ తొత్తుగా ఉన్నందునే జగన్, అవినాశ్ బయట తిరుగుతుంటే, చంద్రబాబును లొంగదీసుకునేందుకు జైలులో వేసారని అన్నారు.

రెండు స్థానాలకు ఒకే..

తెలంంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో రాజకీయ అవగాహనపై చర్చలు జరుగుతున్నాయని, సీపీఐకి రెండు స్థానాలు ఇస్తామని జాతీయ కమిటీకి చెప్పారని నారాయణ తెలిపారు. అందులో ఒకటి జనరల్ స్థానం కొత్తగూడెం‌, మరొకటి ఎస్సీ రిజర్వ్ స్థానమని( చెన్నూర్‌), అయితే అధికారికంగా ఇంకా ప్రకటించలేదన్నా‌రు. పార్టీ అంతర్గతంగా ఎన్ని అభిప్రాయాలు ఉన్నప్పటికీ కమ్యూనిస్టు పార్టీ విధానాలను, పార్టీని ధిక్కరించి ఎవరు కూడా బయటికి వెళ్తారని అనుకోవడం లేదన్నారు.

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు మోడీ వికృత చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. అడ్డదారులు తొక్కైనా సరే అధికారాన్ని దక్కించుకునేందుకు చూస్తున్నారని తెలిపారు. బీజేపీని ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించే పార్టీలను కూడా ఓడించేందుకు సీపీఐ కుదిరిన చోట సర్దుబాట్లు, లేని చోట స్వంతంగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. అందుకే తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో రాజకీయ అవగాహన కోసం చర్చలు జరిగాయని తెలిపారు. పార్టీ అంతిమంగా ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ దానికి కట్టుబడే ఉంటారని వెల్లడించారు.

రాహుల్‌ను ముద్దాయి చేస్తారేమో..!

కాళేశ్వరం లక్ష్మీ బ్యారేజీ కుంగిపోవడాని కారణం కూడా రాహుల్ కారణమని, ఆయనను ముద్దాయిని చేస్తారేమోనని నారాయణ ఎద్దేవా చేశారు. రాజకీయ ప్రత్యర్థులపై కేసులు పెట్టడం అధికారంలో ఉన్న పార్టీలకు అలవాటుగా మారిపోయిందన్నారు. సీఎం కేసీఆర్ మానసపుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిందని, అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కూలిపోతుందని ప్రకృతి ఇచ్చిన సందేశమే లక్ష్మిబ్యారేజీ ఘటననేమో అని నారాయణ అన్నారు.

ఎంఐఎంకు ఏడు సిట్టింగ్ స్థానాలు కష్టమే : అజీజ్ పాషా

ఐదు రాష్ట్రాల ఎన్నికలలో భాగంగా తెలంగాణలో ఏడు స్థానాలలోనే పోటీ చేస్తున్న ఎంఐఎం, రాజస్తాన్‌లో మాత్రం 17 స్థానాలలో పోటీ చేస్తున్నదని అజీజ్ పాషా తెలిపారు. తెలంగాణలో పోటీ చేసే సంఖ్యపై నియంత్రణ పాటిస్తున్నదని ఎద్దేవా చేశారు. చాలా మంది ఏడు సీట్లలో ఎంఐ ఎం గెలుస్తుందని చెబుతున్నారని, తనకు మాత్రం అన్ని గెలుస్తుందనడంలో అనుమానం ఉన్నదన్నారు. రాజస్తాన్ ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుందని భావించినప్పటికీ, అక్కడ అందరికీ రూ.5లక్షల ఆరోగ్య బీమా, నిరుద్యోగ భృతి, మహిళలకు మొబైల్ ఫోన్ వంటి సంక్షేమ పథకాల అమలుతో కాంగ్రెస్ మరోసారి విజయం సాధించే అవకాశం ఉన్నదన్నారు. మధ్య ప్రదేశ్‌లో మాత్రం బీజేపీకి విపరీతమైన ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నదని, మిజోరాంలో కూడా మణిపూర్ అంశంలో కేంద్ర ప్రభుత్వం అనుసరించిన తీరుతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తాము బీజేపీకి వ్యతిరేకమని స్పష్టం చేశారని గుర్తు చేశారు. కాబట్టి ఐదు రాష్ట్రాలలో బీజేపీ వ్యతిరేక తీర్పు వచ్చే అవకాశం ఉన్నదని అజీజ్ పాషా వివరించారు.

నేడు మేడిగడ్డకు సీపీఐ బృందం..

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా లక్ష్మీ బ్యారేజ్ పిల్లర్ కుంగిపోయిన ప్రాంతాన్ని పరిశీలించేందుకు సీపీఐ బృందం గురువారం నాడు మేడిగడ్డకు వెళ్లనుంది. సీపీఐ జాతీయ కార్యదర్శులు డాక్టర్ కె.నారాయణ, సయ్యద్ అజీజ్ పాషా, కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డిలతో కూడిన బృందం ఆ ప్రాంతంలో పర్యటించనుంది. అలాగే కరీంనగర్ దెబ్బతిన్న మానేరుపై కేబుల్ బ్రిడ్జి కూడా బృందం పరిశీలించనుంది. తొలుత హైదరాబాద్ నుండి కరీంనగర్ వెళ్ళి, అక్కడ కేబుల్ బ్రిడ్జి చూసి, అక్కడ నుండి మేడిగడ్డకు వెళ్ళనుంది. ప్రభుత్వ వైఫల్యం, నిర్మాణ పనుల్లో నాణ్యతా లోపాలు, అధికారుల నిర్లక్షం కారణంగానే ఈ ఘటనలు చోటు చేసుకున్నాయని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి విమర్శించారు.

మేడిగడ్డ ప్రాంతంలో బొగ్గు గనులు ఉంటాయని, అక్కడ జాగ్రత్తగా నిర్మించాలని గతంలో ఆ ప్రాంతంలో పర్యటించిన అనంతరం సీఎం కేసీఆర్ సూచించినట్లు గుర్తు చేశారు. అలాగే మానేరుపై కేబుల్ బ్రిడ్జి అద్భుతమని, మంచి పర్యాటక కేంద్రంగా ఉండబోతుందని, దానిని స్వయంగా ప్రారంభించిన మంత్రి కేటీఆర్ గొప్పగా చెప్పారని, కాని కొద్ది రోజులకే అది దెబ్బ తిన్నదన్నారు. రూ.117 కోట్ల అంచనాతో ప్రారంభించి, పూర్తయ్యే నాటికి రూ.224 కోట్లు ఖర్చు చేశారని, అయినా నాణ్యతా లోపాలు ఉండడం ఘోరమని విమర్శించారు. ఇది కూడా కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు.

విద్రోహక చర్య అయితే.. పోలీసుల వైఫల్యమా..?

కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్మీ బ్యారేజ్ కుంగిపోవడానికి విద్రోహ చర్యే కారణమని పోలీసులు చెప్పడాన్ని అయన తప్పుబట్టారు. నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరాంసాగర్ వంటి ప్రాజెక్టుల వద్ద నిరంతర ప్రహారా ఉంటుందని, ఒకవేళ కాళేశ్వరం వద్ద అలాంటి పహారా లేకపోతే విద్రోహ చర్యకు పోలీసుల అసమర్ధతే కారణమని చెప్పారు. ఒకవేళ పహారా ఉండి కూడా విద్రోహ చర్య జరిగినా కూడా పోలీసుల వైఫల్యమే కారణమవుతుందని వెంకట్ రెడ్డి అన్నారు.



Next Story

Most Viewed