మండలంలోనే ‘భూ’ పరిష్కారం.. ధరణి కమిటీ రికమెండేషన్స్ ఇవే..!

by Rajesh |
మండలంలోనే ‘భూ’ పరిష్కారం.. ధరణి కమిటీ రికమెండేషన్స్ ఇవే..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ధరణి భూ బాగోతాలపై సీరియస్‌గా ఉన్న కాంగ్రెస్ సర్కార్ రైతుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఏర్పాటు చేసిన ధరణి కమిటీ ఫీల్డ్ విజిట్ చేసి రిపోర్ట్ రెడీ చేసింది. కమిటీ సభ్యుడు ఎం. సునీల్ కుమార్, సీఎమ్మార్వో వి.లచ్చిరెడ్డిలు మిగతా సభ్యుల సమన్వయంతో ఫైనల్ నివేదికను తయారు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ రెండు, మూడు రోజుల్లోనే ఆ నివేదికను ప్రభుత్వానికి అందజేయనున్నట్టు విశ్వసనీయ సమాచారం. అందులో భాగంగా ఇప్పటికే అధికారులు, పలు శాఖలతో సమావేశాలు పూర్తయ్యాయి. ప్రధానంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కేంద్రీకృతం చేసిన అధికారాలను, బాధ్యతలను వికేంద్రీకరిస్తేనే రైతులకు త్వరగా న్యాయం జరుగుతుందని గుర్తించినట్టు తెలుస్తున్నది.

అప్పీల్ వ్యవస్థతోనే సమగ్రత

గత కాంగ్రెస్ పాలనలో ఏర్పాటైన అప్పీల్ వ్యవస్థను తిరిగి అమలు చేసేందుకు ధరణి కమిటీ సిఫారసు చేస్తున్నది. తహశీల్దార్ దగ్గర న్యాయం దక్కకపోతే ఆర్డీవో, అక్కడా ఇబ్బంది అనుకుంటే అదనపు కలెక్టర్ స్థాయిలో అప్పీల్ చేసుకోవచ్చు. ఇంతకు ముందు భూ సమస్యల పరిష్కారానికి జాయింట్ కలెక్టర్‌కి సర్వ హక్కులు ఉండేవి. జాయింట్ కలెక్టర్ కోర్టులోనే ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరికేది. అయితే బీఆర్ఎస్ హయాంలో జాయింట్ కలెక్టర్ వ్యవస్థను రద్దు చేసి అదనపు కలెక్టర్ల వ్యవస్థను తీసుకొచ్చింది. ఇప్పుడు కూడా ఇద్దరులో ఒకరికి రెవెన్యూ శాఖను అప్పగించారు. వారి హయాంలోనే ట్రిబ్యునల్ లేదా రెవెన్యూ కోర్టు నడిచేటట్లు ఉండాలన్నది ధరణి కమిటీ అభిప్రాయం. అన్నింటికీ కలెక్టర్ స్థాయిలోనే పని చేయాలన్న నిబంధన సరైంది కాదు. ఎన్నో శాఖలను పర్యవేక్షించే కలెక్టర్ కు భూ సమస్యల దరఖాస్తుల పరిశీలన, డిజిటల్ సంతకం వంటివి అప్పగించడం ద్వారా జాప్యం జరుగుతున్నది. అందుకే ఆర్డీవో, అదనపు కలెక్టర్ల స్థాయిలో దాదాపుగా అన్ని అంశాలకు పరిష్కారం లభించే వ్యవస్థను సిఫారసు చేస్తున్నారని సమాచారం.

రూల్స్ ఫ్రేం చేయాలి

ధరణి పోర్టల్, ఆర్వోఆర్ 2020 లోపభూయిష్టంగా ఉంది. ఎవరు ఏ అధికారి చేయాలి? దేని ఆధారంగా చేయాలి? అనే అధికారాల అప్పగింత లేనేలేదు. కేవలం సర్క్యూలర్ మాత్రమే రిలీజ్ చేశారు. కానీ ఈ చట్టానికి సంబంధించిన రూల్స్ ఫ్రేం చేయలేదు. దాంతో 33 మాడ్యూళ్ల ద్వారా వచ్చిన అప్లికేషన్లన్నీ సీసీఎల్ఏ దాకా వస్తున్నాయి. లక్షలాదిగా దరఖాస్తులు వస్తున్నా అంతా సక్రమంగానే ఉందంటూ అప్పటి సీఎం కేసీఆర్‌కి చెప్పారని అధికారుల నుంచి సమాచారం. ఇప్పటికైనా చట్టానికి రూల్స్ ఫ్రేం చేయడం ద్వారా న్యాయం జరుగుతుంది.

భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో వివాదాలు ఉన్నాయంటూ పార్టు-బి కింద ఏకంగా 18 లక్షల ఎకరాలను చేర్చారు. దీంతో అనేక మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వాటికీ పరిష్కారం చూపాలని ధరణి కమిటీ సిఫారసు చేయనున్నది.

ప్రధాన సమస్యలు

– ప్రతి ఊరిలో వందల్లో భూమి సమస్యలు

– భూమి హద్దులకు లేని స్పష్టత, హక్కులకు లేని భద్రత

– 9 లక్షల సాదాబైనామా దరఖాస్తులు పెండింగులోనే

– నిషేదిత జాబితాలో లక్షలాది ఎకరాల పట్టా భూమి

– 25 లక్షల ఎకరాల అసైన్డ్ భూములపై సమస్యలు

– ఎనభై ఏళ్లుగా భూ సర్వే చేయడంలేదు

– 10 లక్షలకు పైగా కౌలుదారులకు గుర్తింపు కరువు

– వేల సంఖ్యలో పోడు భూములకు పట్టాలు రాని ఆదివాసీ, గిరిజనులుNext Story

Most Viewed