Telangana Agitation : జై తెలంగాణ.. ఉద్యమమే శ్వాసగా ప్రాణత్యాగం చేసిన అమరవీరులు వీళ్లే!

by Disha Web Desk |
Telangana Agitation :  జై తెలంగాణ.. ఉద్యమమే శ్వాసగా ప్రాణత్యాగం చేసిన అమరవీరులు వీళ్లే!
X

దిశ, నెట్‌వర్క్: జై తెలంగాణ.. ఇది నినాదం కాదు. యావత్తు తెలంగాణ ప్రజల శ్వాస. అంతేకాదు.. అస్తిత్వం, ఆరాటం, పోరాటం, ఆత్మగౌరవం, చైతన్యం, భావోద్వేగం కూడా. అన్నింటినీ మించి బలమైన ఆకాంక్ష. భారత స్వాతంత్ర్య పోరాటం సమయంలోని సాయుధ రైతాంగ తిరుగుబాటుతో మొదలైంది. 1969లో తొలిదశ ఉద్యమం ఊపిరులూదింది. 2009 తర్వాత ఎగసిన మలి దశ ఉద్యమం తారస్థాయికి చేరింది. వెయ్యిమందికి మించిన ప్రాణత్యాగాలతో స్వరాష్ట్రం సాకారమైంది. అమరుల త్యాగంతో ఆకాంక్ష నెరవేరింది. ‘నా తెలంగాణ’ అంటూ మూడున్నరకోట్ల మంది సగర్వంగా ప్రకటించుకున్నారు. తొమ్మిదేళ్లు గడిచిపోయింది. ‘దశాబ్ది’ సంబురాలూ పూర్తయ్యాయి.

అమరులు త్యాగాలకు న్యాయం జరిగింది.. కానీ వారి కుటుంబాలకేదీ దిక్కు.. అనే వాదన ముందుకొచ్చింది. త్యాగాల పునాదిపై ఏర్పడిన స్వరాష్ట్రంలో అమరుల కుటుంబాల్లో, యావత్తు రాష్ట్ర ప్రజల బతుకుల్లో ఏం మార్పు వచ్చిందనే చర్చ మొదలైంది. త్యాగం అమరులది.. భోగం ఒక్క కుటుంబానిది అనే విమర్శలు సరేసరి. తీరని దుఃఖంలో ఉన్న ఆ కుటుంబాల ఆలనా పాలనా ఎట్లున్నది? సంతోషంగా ఉన్నాయా? ప్రభుత్వం పట్టించుకున్నదా? అమరుల ఆకాంక్షల్ని నెరవేర్చే తీరులో పాలన సాగుతున్నదా? సమైక్య రాష్ట్రంలో ఎదుర్కొన్న అవమానాలు, అన్యాయం ఆగిపోయిందా? సమాన అవకాశాలు లభిస్తున్నాయా..? ఇవీ తొమ్మిదేండ్ల తర్వాత జరుగుతున్న చర్చ.

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఉపాధి లభిస్తుందన్న ఆలోచనతో లక్షలాది మంది విద్యార్థులు, నిరుద్యోగులు ఉద్యమంలోకి దూకారు. కులం, మతం, చిన్నా, పెద్దా తేడాల్లేకుండా సబ్బండవర్ణాలు బరిగీసి నిలిచాయి. ఇప్పుడు కాకపోతే.. ఇంకెప్పుడూ రాదు.. అనే నిర్ణయానికి వచ్చారు. పొలిటికల్ వార్‌లో రాష్ట్ర ఏర్పాటుపై నీలినీడలు కమ్ముకున్నాయి. నిరాశా నిస్పృహలు ఒకవైపు.. తెగించి కొట్లాడాలనే చైతన్యం ఇంకోవైపు.. యువతలో మానసిక సంఘర్షణ మొదలైంది. ఎమోషన్స్ పీక్ స్టేజీకి చేరుకున్నాయి. అందుకే ‘'ఉద్యమం నీరుగారుతోంది.. నావల్లనైనా తెలంగాణ రాష్ట్రం రావాలి'’ అంటూ విద్యార్థి శ్రీకాంతాచారి, పోలీసు కానిస్టేబుల్ కిష్టయ్య, సిరిపురం యాదయ్య, వేణుగోపాల్, యాదిరెడ్డిలాంటి వందలమంది ప్రాణాలర్పించారు.

శుభకార్యం తలపెట్టేటప్పుడు విఘ్నేశ్వరుడిని తల్చుకున్నట్లే తెలంగాణ రాష్ట్రం సంబురాలప్పుడూ అమరుల త్యాగాలను స్మరించుకోవడం న్యాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆ అమరుల త్యాగాలకు గుర్తుగా స్మృతిచిహ్నం ఉనికిలో రావడానికి తొమ్మిదేళ్లు పట్టింది. ప్రాణత్యాగాలతో తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు తీరని దుఃఖమే మిగిలింది. రాష్ట్రం ఏర్పాటైతే వారి కోరిక తీరినట్లేనని బాధను దిగమింగుతూ సర్దిచెప్పుకున్నారు. ఈ తొమ్మిదేళ్ళ పాలనలో ఒక్కో కుటుంబానిది ఒక్కో అభిప్రాయం. పోయిన ప్రాణం తిరిగిరాకపోయినా వారి త్యాగంతో రాష్ట్రం ఏర్పడిందనే మానసిక సంతృప్తి, ధైర్యం, చైతన్యం ఆ కుటుంబాలకు భరోసా కల్పిస్తున్నాయి.

“అమరుల త్యాగఫలమే తెలంగాణ రాష్ట్రం.. విలువైన ప్రాణాలర్పించిన అమరుల త్యాగాలను ఉజ్వలంగా స్మరించుకోవాలి... బిడ్డలను కోల్పోయిన ఆ కుటుంబాల సంక్షేమ బాధ్యతను విధిగా తెలంగాణ ప్రభుత్వమే స్వీకరిస్తుంది..” అంటూ ఉద్యమ పార్టీగా చెప్పుకుంటున్న బీఆర్ఎస్ తన తొలి మేనిఫెస్టో (2014)లో ప్రకటించింది. అమరుల కుటుంబాలకు రూ. 10 లక్షల సాయం చేస్తామని, ఆ కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇస్తామని, వ్యవసాయ మీద ఆధారపడిన కుటుంబాలకు సాగుకు యోగ్యమైన భూమిని ఇస్తామని, ఆ కుటుంబాలకు గృహవసతి కల్పిస్తామని, వారి పిల్లలకు చదువు చెప్పించే బాధ్యతను ప్రభుత్వమే స్వీకరిస్తుందని.. ఇలాంటి పలు హామీలు ఇచ్చింది.

తెలంగాణ మలిదశ ఉద్యమంలో సుమారు 1200 మంది త్యాగం చేసినట్లు అధికార పార్టీతో పాటు విపక్షాల నేతలు పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం 2014 అక్టోబరు 27న జీవో (నెం. 36) జారీ చేసి 459 మంది అమరుల కుటుంబాలను గుర్తించినట్లు ప్రకటించింది. ఈ కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి తలా రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బీఆర్ మీనా స్పష్టత ఇచ్చారు. ఈ కుటుంబాల సమాచారాన్ని సేకరించి ధ్రువీకరించుకున్న తర్వాత అందజేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ఆ ప్రకారం మొత్తం 459 కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందింది.

తొలి మేనిఫెస్టోలో బీఆర్ఎస్ ప్రకటించినట్లు కొన్ని కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. కానీ సాగుకు యోగ్యమైన భూమి, గృహవసతి, వారి పిల్లల చదువు బాధ్యత.. తదితరాలు పూర్తిస్థాయిలో అందలేదు. అందుకే అమరుల కుటుంబ సభ్యుల నుంచి “స్వాతంత్ర్య సమరయోధుల తరహాలో ఐదెకరాల భూమి, పెన్షన్, హెల్త్ కార్డు, ఐడెంటిటీ కార్డు ఇవ్వాలి” అనే డిమాండ్లు ముందుకొచ్చాయి. “అసెంబ్లీలో అమరులకు నివాళులు అర్పించాకనే, ఏ పనైనా మొదలుపెడతాం అని కేసీఆర్ గతంలో చెప్పారు.. తెలంగాణలో చాలా మంది సంతోషంగా ఉన్నారు.. కానీ ప్రాణాలు అర్పించిన అమరుల కుటుంబాలు మాత్రం సంతోషంగా లేవు” అని కొద్దిమంది వారి వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకున్నారు.

అయితే తెలంగాణ ఉద్యమంలో బలిదానాలు చేసుకుంది కేవలం 459 మందే అని కేసీఆర్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కానీ ఉవ్వెత్తున ఎగిసిపడ్డ ఉద్యమంలో 1200 మంది ఉద్యమకారులు ప్రాణాలు అర్పించారు. ప్రభుత్వం గుర్తించని వారి వివరాలను ‘దిశ’ మీ ముందుకు తీసుకువస్తుంది. తెలంగాణ కోసం ఆత్మహత్యలకు పాల్పడిన వారి వివరాల కోసం కింది లింక్‌ను క్లిక్ చేయండి.

Click here : తెలంగాణ కోసం ఆత్మహత్యలకు పాల్పడిన వారి వివరాలు కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.



Next Story