2023లో బీజేపీ ముందున్న సవాళ్లు ఇవే!

by Disha Web Desk 4 |
2023లో బీజేపీ ముందున్న సవాళ్లు ఇవే!
X

దిశ, వెబ్ డెస్క్: 'కేసీఆర్ హఠావో.. తెలంగాణ బచావో' నినాదంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లేందుకు బీజేపీ సిద్ధమయింది. మిషన్ -90 పేరుతో 90 అసెంబ్లీ స్థానాల్లో సత్తా చాటడమే లక్ష్యంగా ముందుకు సాగనున్నట్లు రాజ్య సభ ఎంపీ లక్ష్మణ్ ఇటీవల ప్రకటించారు. 10వేల సభలు నిర్వహిస్తామని టీఆర్ఎస్‌పై ఛార్జిషీట్ వేసి ప్రజల్లోకి వైఫల్యాలను తీసుకెళ్తామన్నారు. పార్టీని సంస్థాగతంగా బలం చేస్తామన్నారు.

అయితే 90 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీకి గెలుపు గుర్రాల్లాంటి అభ్యర్థులున్నారా అనేది మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగులుతోంది. ఎన్నికల నాటికి కీలక నేతలు తమ పార్టీలోకి వస్తారని బీఆర్ఎస్ అసంతృప్త నేతలకు అప్పటి వరకు తమ పార్టీ కండువా కప్పి ఎలాగైనా ఈ సారి అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తోంది. అయితే ఎన్నికల్లో గెలుపు విషయంలో బీజేపీ ముందు అనేక ప్రశ్నలున్నాయి.

ముస్లిం ఓటర్లు కీలకం..

తెలంగాణలో 12.7 శాతం ముస్లిం ఓటర్లు ఉన్నారు. తెలంగాణ సోషల్ డెవలప్‌మెంట్ రిపోర్ట్ 2011 లెక్కల ప్రకారం తెలంగాణలో 44, 64,669 మంది ముస్లింలున్నారు. హైదరాబాద్‌లో 17.13లక్షల ముస్లింలున్నారు. సిద్ధాంత వైరుద్యం పరంగా బీజేపీకి చాలా మంది ముస్లిం ఓటర్లు దూరంగా ఉంటున్నారు. ట్రిపుల్ తలాఖ్ విషయంలో మాత్రం ఉత్తరాది రాష్ట్రాల్లో ముస్లిం మహిళలు కొంత సానుకూలంగా ఉన్నారు. 12 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నానని సీఎం కేసీఆర్ హామీ ఇవ్వడంతో గత రెండు పర్యాయాలు వీరు బీఆర్ఎస్ పార్టీకి 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మద్దతు పలికారు.

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ సైతం బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలవాలని పలుచోట్ల ప్రచారం నిర్వహించారు. కాగా పాతబస్తీ మినహా ఎంఐఎం తమ అభ్యర్థులను బరిలో దించడం లేదు. పరోక్షంగా తాము మద్దతు తెలిపే పార్టీకి ఓటు వేయాలని ఎంఐఎం నేతలు కోరడం ఆనవాయితీగా వస్తోంది. గతంలోనూ సెక్యులర్ భావాలున్న కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం మద్దతు పలికింది. అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముస్లిం ఓట్లు కీలకం కానున్న నేపథ్యంలో బీజేపీ గెలుపు సాధ్యమేనా అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. దళితులు, కమ్యూనిస్ట్‌లు సైతం బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు. ఆయా నియోజకవర్గాల్లో వీరి ఓట్లు కీలకం కానున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు, గ్యాస్ సిలిండర్ ధర పెంపు వంటి అంశాలు రానున్న ఎన్నికల్లో కీలకంగా మారనున్నాయి.

వ్యతిరేకత కలిసొస్తుందా..

2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 5 ఎమ్మెల్యే స్థానాల్లో గెలిచింది. ఈ ఐదు స్థానాలు ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలే కావడం విశేషం. ఆది నుంచి అర్బన్ ఏరియాలో బీజేపీకి పట్టు ఉన్నా 2018లో ఆ పట్టును కూడా నిలుపుకోలేకపోయింది. 2018లో ఎమ్మెల్యేల సంఖ్య ఏకంగా ఒకటికి చేరింది. ప్రస్తుతం అసెంబ్లీలో ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలంటే ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థులు కావాల్సి ఉంది. బీజేపీ అధినాయకత్వం సైతం ఇదే అంశంపై ఫోకస్ చేసింది.

పార్టీలో, ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడిన వారికి.. నియోజకవర్గంపై గట్టి పట్టు ఉన్న నేతలు ఎవరు అనే అంశంపై ఫోకస్ చేసింది. ఇటీవల నిర్వహించిన పార్టీ సమావేశంలో కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇస్తాననడంతో చాలా మంది ఆశావాహ బీఆర్ఎస్ నేతలు బీజేపీ వైపు చూస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందున వారికి గాలం వేసేలా బీజేపీ స్కెచ్ వేసింది. అయితే ఎన్నికల నాటికి పార్టీలో చేరికలు లేకుంటే మాత్రం బీజేపీ వచ్చే ఎన్నికల్లో సత్తా చాటడం మాత్రం అంతా ఈజీ కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలితే అది మళ్లీ బీఆర్ఎస్‌కే లాభం చేకూరుతుందని వారంటున్నారు. మరి రానున్న ఎన్నికల్లో బీజేపీ తన యాక్షన్ ప్లాన్ ఏ మేరకు అమలు చేస్తుంది. ఏ మేరకు ఫలితాలు సాధిస్తుందనే విషయాలు తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Also Read...

గులాబీ పార్టీకి డొనేషన్ల వెల్లువ.. 2022లో ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా?



Next Story

Most Viewed