ఎమ్మెల్యే VS ఎమ్మెల్సీ.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేసీఆర్‌కు కొత్త తల నొప్పి!

by Disha Web Desk 19 |
ఎమ్మెల్యే VS ఎమ్మెల్సీ.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేసీఆర్‌కు కొత్త తల నొప్పి!
X

దిశ, డైనమిక్ బ్యూరో: అధికార టీఆర్ఎస్ పార్టీలో ఇంటి పోరు రోజు రోజుకు పెద్దదవుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ వర్గపోరుకు చెక్ పెట్టి అభివృద్ధితో పాటు అందరిని కలుపుకుపోవాల్సిన నేతలు కయ్యానికి కాలు దువ్వుతున్నారు.వాగ్భానాలతో అగ్గికి ఆజ్యం పోస్తున్నారు. పార్టీ పెద్దల దృష్టికి ఎన్నిసార్లు వెళ్లినా పరిస్థితి మారకపోడవంతో ఆ నియోజకవర్గాల్లో కారు పార్టీ క్యాడర్ అయోమయానికి గురవుతోంది. తాజాగా ఎమ్మెల్యేకు ఎమ్మెల్సీకి మధ్య స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ టీఆర్ఎస్ క్యాడర్ పూర్తిగా రెండుగా చీలిపోతుందనే టాక్ వినిపిస్తోంది. ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు, ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. వేరు వేరు పార్టీల నుంచి కారు పార్టీలో చేరిపోయిన ఈ ఇరువురు నేతలు ప్రస్తుతం పరస్పరం విమర్శలు ఎక్కుపెట్టుకుంటున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరి మధ్య ప్రభుత్వ పథకాల విషయంలో పైచేయి ఎవరిది అనేదానిపై పరస్పరం ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. ఇది చాలదన్నట్టుగా తాజాగా దళితబంధు స్కీం విషయంలో ఆధిపత్యపోరుకు దిగడం హాట్ టాపిక్‌గా మారింది. దళితబంధు పథకాన్ని కొందరు నీరుగారుస్తున్నారంటూ కడియం చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

దళితబంధు లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలని.. ఎవరైతే అవినీతికి పాల్పడుతారో అలాంటి వారి వల్ల మొత్తం పథకమే మూతపడిపోయే ప్రమాదం ఉందని కడియం హెచ్చరించారు. యూనిట్ల ద్వారా ఆర్థికంగా ఎదిగే ప్రయత్నం చేయకపోతే ఈ స్కీం నీరుగారిపోతుందని అందువల్ల అవినీతికి పాల్పడే వారు దళితబంధును అడ్డుకున్నవారు అవుతారని కడియం చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. శ్రీహరి వ్యాఖ్యలు పరోక్షంగా ఎమ్మెల్యే రాజయ్యను ఉద్దేశించే చేశారనే గుసగుసలు నియోజకవర్గంలో వినిపిస్తున్నాయి. దీనికి రాజయ్య సైతం పరోక్షంగా కౌంటర్ ఇవ్వడం నియోజకవర్గం టీఆర్ఎస్‌లో సెన్సేషనల్‌గా మారింది.

నియోజకవర్గంలో ఏం కావాలన్న ఎమ్మెల్యేనే సుప్రీం అని రాజయ్య కౌంటర్ ఇచ్చారు. కాకి, కోకిలా ఎన్నటికి ఒక్కటి కాలేవని, ఇళ్లు కేవలం ఎమ్మెల్యేనే ఇస్తాడని, గాడిదకు గడ్డి వేసి ఆవుకు పాలు పిండితే కుదరదని అందరూ అర్థం చేసుకోవాలన్నారు. అందువల్ల ఇళ్లు అవసరం ఉన్న వారు ఎవరిని పడితే వారిని అడిగితే వారు తిరిగి మళ్లీ ఎమ్మెల్యే వద్దకే రావాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి వద్ద స్పషల్ కోటాలు ఏమీ లేవని అన్ని ఎమ్మెల్యేల ద్వారానే లబ్దిదారుల ఎంపిక ఉంటుందని రాజయ్య కామెంట్స్ చేశారు. అయితే రాజయ్య వ్యాఖ్యలు కడియంను ఉద్దేశించి చేసినవే అనే టాక్ వినిపిస్తోంది. దీంతో మాటకు మాట కౌంటర్ ఇచ్చుకుంటూ ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ మధ్య సాగుతున్న రాజకీయ రగడ టీఆర్ఎస్ లో సంచలనంగా మారుతోంది. వీరి విషయంలో గులాబీ బాస్ కేసీఆర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో అనే చర్చ జరుగుతోంది.


Next Story

Most Viewed