ఆపదొస్తే అనంతలోకాలకే..! రైల్వే స్టేషన్‌లో వైద్య సేవల్లేవ్?

by Disha Web Desk 4 |
ఆపదొస్తే అనంతలోకాలకే..! రైల్వే స్టేషన్‌లో వైద్య సేవల్లేవ్?
X

దిశ, మెట్టుగూడ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ద్వారా గ్రీన్ స్టేషన్‌గా పరిగణించబడింది, 1874లో గ్రేట్ ఇండియన్ ద్వారా సికింద్రాబాద్-వాడి రైల్వే లైన్ ప్రారంభమయ్యింది. 1.8 లక్షల ప్రయాణికులు రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణం చేస్తున్నారు. రోజుకు 210 ప్యాసింజర్/ఎక్స్‌ప్రెస్/ఎంఎంటీఎస్ రైళ్లు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి నడుస్తున్నాయి. నేరస్తులు రైల్వే స్టేషన్ నుంచి తప్పించుకోకుండా 86 సీసీ కెమెరాల ద్వారా ప్రయాణికులకు భద్రత కల్పిస్తున్నారు. సిటీ బస్సులు, ఆటోలు, క్యాబ్‌లు మొదలైనవి, తాజాగా హైదరాబాద్ మెట్రో కూడా అందుబాటులో ఉంది.

స్టేషన్‌లో బస కోసం ఏసీ, నాన్ ఏసీ వెయిటింగ్ హాల్స్ ఉన్నాయి. రాత్రి బస కోసం రిటైరింగ్ గదులు, డార్మిటరీ అందుబాటులో ఉన్నాయి. ప్రయాణికులు సామాన్లు భద్రపర్చుకోడానికి క్లాక్ రూమ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇ-బుకింగ్ వంటి సౌకర్యాలు ఉన్న ఫ్రెండ్లీ రైల్వే స్టేషన్ ఇది, వీల్ చైర్లు, వెయిటింగ్ హాల్స్, లిఫ్టులు, టాయిలెట్లు, టికెట్ కౌంటర్లు అందుబాటులో ఉన్నాయి. లేడీస్ వెయిటింగ్ హాల్‌లో బేబీ ఫీడింగ్ రూమ్‌లు ఏర్పాటు చేయబడ్డాయి. ఫ్లాట్‌ఫామ్ నెం.1లో ప్లాస్టిక్ బాటిల్ క్రషియంట్ మిషన్ అందుబాటులో ఉంది. ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలకు పార్కింగ్ సౌకర్యాలు ఉన్నాయి. 36 శాతం విద్యుత్ వినియోగం సోలార్ ప్లాంట్ ద్వారా లభిస్తుంది. రాబోయే 4 ఏళ్లలో అంతర్జాతీయ ప్రమాణాలతో వరల్డ్ క్లాస్ రైల్వే‌స్టేషన్‌గా పునర్నిర్మాణం జరగబోతుంది. దీని కోసం రూ.699 కోట్లు కేటాయించబడ్డాయి. ఈ మధ్యకాలంలో సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నంకు వందే భారత్ రైలు కూడా ప్రారంభమయ్యింది.

ఇన్ని హంగులు ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆసుపత్రి సౌకర్యం కాదు కదా డాక్టర్ కూడా అందుబాటులో లేడని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. సుదీర్ఘ ప్రయాణం చేసి వచ్చిన వారికి ఆరోగ్యపరంగా ఏమైనా ఇబ్బందులు వస్తే డాక్టర్స్, నర్సులు కరువయ్యారని, కనీసం ప్రాథమిక చికిత్స కూడా అందుబాటులో లేదనే వాదనలున్నాయి. సంవత్సరాల తరబడి స్టేషన్‌లో వైద్యుడు కానీ నర్స్ కానీ అందుబాటులో లేరు. ఇక్కడ పనిచేస్తున్న సిబ్బందికి కానీ ప్రయాణికులకు కానీ హెల్త్ పరంగా సమస్యలు వస్తే ఇక అంతే సంగతులని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో మెడికల్ షాప్‌‌నకు పర్మిషన్ ఇచ్చినట్టే ఇచ్చి మల్టీపర్పస్‌ స్టాల్‌గా మార్చేశారు. ఇక్కడ అరకొర మందులున్నా ఇవ్వడానికి ఒకరు తప్ప ఎవరూ ఉండరు.

ప్రయాణికుల భద్రత పట్ల రైల్వే అధికారులకు ఏమాత్రం పట్టింపు లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో అన్ని రకాల రోగాలకు మెడికల్ షాప్‌లో మందులు అందుబాటులో ఉండేవని, కానీ ఇప్పుడు అంతంతమాత్రంగానే మందులు అందుబాటులో ఉన్నాయని తెలిసింది. ప్రయాణికుల ఆరోగ్యం దృష్ట్యా రైల్వే స్టేషన్‌లో రైల్వే అధికారులు చొరవ చూపాలని ప్రయాణికులు కోరుకుంటున్నారు. గతంలో రైలులో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు మెడికల్ ఎమర్జెన్సీ వస్తే టికెట్ కలెక్టర్‌ను లేదా ఇతర సిబ్బందిని సంప్రదిస్తే వారు తదుపరి స్టేషన్‌కు సమాచారం అందిచేవారు. వెంటనే సమీపంలోని రైల్వే ఆసుపత్రి అందుబాటులో ఉన్న స్టేషన్‌కు సమాచారం పంపబడుతుంది. రైలు ఆ స్టేషన్‌కు చేరుకోకముందే రైల్వే వైద్యులు స్టేషన్‌కు చేరుకుని జాగ్రత్తలు తీసుకునే వారు. ఇది ఒక్కప్పటి సంప్రదాయ వ్యవస్థ, ఇప్పుడే అదేది కనిపించడం లేదు.

ఏదైనా సమస్యవస్తే మార్గమేంటి..

ఉత్తర భారత దేశం నుంచి దక్షిణ భారత దేశానికి రైల్లో ప్రయాణం చేయడానికి 3 రోజుల టైం పడుతుంది. వీరు సికింద్రాబాద్ జంక్షన్ మీదుగా ప్రయాణం చేయాలి. ప్రయణికుల్లో వృద్ధులు, మహిళలు, చిన్నారులు, గర్భవతులు ఉంటారు. వీరికి ఆరోగ్యపరంగా ఏదైనా సమస్యవస్తే మార్గమేంటి, గతంలో రైళ్లలో ప్రయాణం చేస్తూ చనిపోయిన ఉదంతాలు ఉన్నాయి. డయాబెటిక్, షుగర్, బీపీ, చెస్ట్ పెయిన్ లాంటి ఇతర ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయినప్పుడు పరిష్కార మార్గం ఉండదనే వాదనలున్నాయి. రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల ద్వారా రాబడి పెంచుకోడానికి డివిజనల్ కమర్షియల్ మేనేజర్, కమర్షియల్ ఇన్‌స్పెక్టర్‌లు ఆహార్నిశలు కృషి చేస్తారు. కానీ ప్రయాణికుల ఆరోగ్యం పట్ల శ్రద్ద చూపరనే ఆరోపణలున్నాయి. ప్రయాణికులకు ఆరోగ్య సమస్య ఉత్పన్నమయినప్పుడు అందుబాటులో ఉన్న చిలకలగూడా, లాలాగూడా రైల్వే ఆసుపత్రికి తరిలించడానికి అంబులెన్స్ కూడా అందుబాటులో ఉండదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇక‌నైనా రైల్వే అధికారులు ప్రయాణికుల ఆరోగ్యం పట్ల దృష్టిపెట్టాలని ప్రయాణికులు కోరుకుంటున్నారు.

Also Read..

చెల్లెలి 'సెంటిమెంట్'.. కలసి వస్తుందని తెలంగాణ కాంగ్రెస్‌లో ఆశ!


Next Story

Most Viewed