అసాధ్యమన్న పదం కేసీఆర్ డిక్షనరీలోనే లేదు : MLA Jeevan Reddy

by Disha Web Desk 4 |
అసాధ్యమన్న పదం కేసీఆర్ డిక్షనరీలోనే లేదు : MLA Jeevan Reddy
X

దిశ ఆర్మూర్: అసాధ్యమన్న పదం కేసీఆర్ డిక్షనరీలోనే లేదని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ దార్శనిక పాలన వల్ల రాష్ట్రంలోని ప్రతీ పల్లెలో అభివృద్ధి కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయన్నారు. ప్రతీ ఇంటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. నందిపేట్ మండల కేంద్రంలో పద్మశాలి, గౌడ, కురుమ, మున్నూరు కాపు సామాజిక వర్గాల కమ్యూనిటీ ఫంక్షన్ హాళ్లు, ముస్లిం మైనారిటీలకు షాదీ ఖానా నిర్మాణ పనులను సోమవారం ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పరిశీలించారు.

ఉదయం 4 గంటలకే ఈ ఫంక్షన్ హాళ్ల నిర్మాణం పనుల పరిశీలనకు వచ్చిన జీవన్ రెడ్డికి వివిధ సామాజిక వర్గాల ప్రతినిధులు, స్థానిక ప్రజలు, బీఆర్‌ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. రెండు ఎకరాల భూమిలో రూ.50 లక్షల రూపాయల వ్యయంతో పద్మశాలి సంఘానికి, మూడెకరాల భూమిలో రూ. 50 లక్షలతో కురుమ సంఘానికి, పదెకరాల భూమిలో రూ. 50 లక్షలతో గౌడ సామాజిక వర్గానికి ఫంక్షన్ హాళ్లు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. యుద్ధప్రాతిపదికన పనులు సాగించి వచ్చే మార్చి నాటికి నిర్మాణాలు పూర్తి చేయడమేకాక వెంటనే పెండ్లిండ్లు జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. వీటి పనులు తుది దశకు చేరుకున్నాయని, ఇంకేమైనా నిధులు అవసరమైతే సీఎం కేసీఆర్ దృష్టికి తెచ్చి మంజూరు చేయిస్తానని ఆయన హామీ ఇచ్చారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో

తెలంగాణ రాష్ట్రం దేశానికే ప్రగతి రథ సారధిగా దారి చూపుతోందన్నారు. రైతుబంధు, రైతుబీమా, దళితబంధు, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ మంచినీటి సరఫరా, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ, 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా, కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ ద్వారా పేదింటి ఆడపిల్లల పెండ్లిండ్లు చేస్తున్నామన్నారు. బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలు వంటి అన్ని సామాజిక వర్గాల వారికి కమ్యూనిటీ హాళ్లు నిర్మించడం, ఆసుపత్రుల ఆధునీకరణ, ఉచిత ప్రసవాలు, కేసీఆర్ కిట్ల పంపిణీ, రూ. 2016, రూ.3016 చొప్పున పెన్షన్లు ఇస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రగతికి కర్మ,కర్త, క్రియ అన్నీ కేసీఆర్ అన్నారు.

ఆర్మూర్ లో మేరు సంఘానికి ఫంక్షన్ హాలు

ఆర్మూర్ పట్టణ మేరు సంఘం ప్రతినిధులు సోమవారం ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని కలిసి తమకు ఫంక్షన్ హాలు మంజూరు చేయాలని కోరారు. దీని పై స్పందించిన జీవన్ రెడ్డి మేరు సంఘానికి ఆర్మూర్ పట్టణములో 15 వందల నుంచి 2000 వేల గజాల స్థలంతో పాటు ఫంక్షన్ హాలు నిర్మాణానికి రూ.25 లక్షల నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మేరు సంఘం సభ్యులు, నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed