బిగ్ న్యూస్: తెలంగాణ సర్కార్‌కు మరో కొత్త గండం.. BRS ఎమ్మెల్యేల్లో మొదలైన టెన్షన్..!!

by Disha Web Desk 19 |
బిగ్ న్యూస్: తెలంగాణ సర్కార్‌కు మరో కొత్త గండం.. BRS ఎమ్మెల్యేల్లో మొదలైన టెన్షన్..!!
X

డిమాండ్ల సాధన కోసం జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చేపట్టిన నిరవధిక సమ్మె ప్రభుత్వానికి మింగుడు పడటం లేదు. వారి విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని లేదంటే వచ్చే ఎన్నికల్లో పార్టీపై నెగెటివ్ ప్రభావం పడుతున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేతలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా.. సర్కారు వాటిని పట్టించుకోవడం లేదని సమాచారం. డెడ్‌లైన్ పెట్టినా కార్యదర్శులు వెనక్కి తగ్గకపోవడాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం.. వారిపై కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమైంది.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లపైనే ఫోకస్ పెట్టింది. జేపీఎస్‌ల డిమాండ్ల పరిష్కారానికి సంబంధిత మంత్రి చొరవ తీసుకుంటే.. పరిస్థితి ఇక్కడి వరకు వచ్చేది కాదని పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, లీడర్ల అభిప్రాయం. మరో వైపు కార్యదర్శులకు మద్దుతు తెలుపుతున్న విపక్షాలు, ఈ అంశాన్ని పొలిటికల్‌గా వాడుకునేందుకు సిద్ధమవుతున్నాయి. మరి సర్కారు తదుపరి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నది? జేపీఎస్‌ల నెక్స్ట్ డెసిషన్ ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో జూనియర్ పంచాయతీ సెక్రటరీ (జేపీఎస్)ల నిరవధిక సమ్మె పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నది. డెడ్‌లైన్ పెట్టినా లెక్కచేయకుండా విధులకు గైర్హాజరైన జేపీఎస్‌లపై కఠినంగానే వ్యవహరించాలని ప్రభుత్వం భావిస్తున్నది. సవాలు చేసేలా జేపీఎస్‌లు వ్యవహరించడాన్ని సర్కారు నామోషీగా ఫీల్ అవుతున్నది. విధులకు గైర్హాజరైన జేపీఎస్‌ల స్థానంలో అనధికారికంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టింది. మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పొలిటికల్‌గా కొంప ముంచుతుందేమోనని అధికార పార్టీ నేతలు ఆందోళనలో పడ్డారు. ఎలక్షన్స్ నాటికి ఇది నెగెటివ్ అవుతుందేమోనన్న గుబులు వారిని వెంటాడుతున్నది.

ప్రభుత్వ నిర్ణయం ఒకలా, ప్రజాప్రతినిధుల అభిప్రాయం మరోలా ఉండడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒకవైపు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు, మరో వైపు పల్లెప్రగతి, హరితహారం లాంటి పనులు జరగాల్సిన టైమ్‌లో జేపీఎస్‌ల సమ్మె, వారి విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం, అది పార్టీపై చూపే ప్రతికూల ప్రభావం.. ఇవన్నీ స్థానిక ఎమ్మెల్యేలకు కొత్త తలనొప్పిని తీసుకొచ్చాయి.

జేపీఎస్‌ల సమ్మె సంగతిని తొందరగా తేల్చేయాలని గులాబీ పార్టీ బాస్‌కు ఎమ్మెల్యేలు మొరపెట్టుకున్న గంటల వ్యవధిలో.. జూనియర్ పంచాయతీ కార్యదర్శులపై కఠినంగా వ్యవహరించాలని ప్రధాన కార్యదర్శి.. కలెక్టర్లకు ఆదేశాలు జారీచేయడం గమనార్హం. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టాలని సైతం సూచించారు. ప్రభుత్వ తీరుతో గులాబీ పార్టీలో పొలిటికల్ హీట్ రాజుకుంది. ఒకవైపు ప్రతిపక్ష పార్టీలన్నీ జేపీఎస్‌ల సమ్మెకు మద్దతు ప్రకటించి సంఘీభావాన్ని తెలియజేస్తున్న సమయంలో ప్రభుత్వం ఇలా కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నది. దీంతో రానున్న రోజుల్లో క్షేత్రస్థాయిలో ఎలాంటి అనూహ్య పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందోననే గులాబీ లీడర్లకు గుబులు పట్టుకున్నది.

మంత్రి ఎర్రబెల్లిపై ఫైర్

వాస్తవానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు లేదా పంచాయతీశాఖ కార్యదర్శి స్థాయిలోనే జేపీఎస్‌ల సమ్మెకు ఒక ముగింపు లభించి ఉంటే బాగుండేదని, ఇప్పుడు పొలిటికల్‌గా మొదటికే మోసం వచ్చేలా ఉందనే అభిప్రాయం ఎమ్మెల్యేల నుంచి వ్యక్తమవుతున్నది. ప్రభుత్వ హెచ్చరిక నోటీసుకు భయపడి కొందరు జేపీఎస్‌లు విధుల్లో చేరినా.. మరుసటి రోజే చాలా మంది వారి జాయినింగ్ లెటర్‌ను ఉపసంహరించుకుని తిరిగి సమ్మెలో చేరడాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నది. సర్కారు ఇచ్చిన డెడ్‌లైన్‌ను వారు లెక్కచేయకపోవడం సహించలేని క్రమశిక్షణారాహిత్యంగా అధికారులు భావిస్తున్నారు. కొందరికి ఫోన్ల ద్వారా సమ్మె విరమించి విధుల్లో చేరాల్సిందిగా చేసిన విజ్ఞప్తులూ బెడిసికొట్టడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపైనే ప్రభుత్వం దృష్టి పెట్టింది.

జేపీఎస్‌ల డిమాండ్లను పరిష్కరించడానికి మంత్రి స్థాయిలో చొరవ తీసుకుని సమస్యను కొలిక్కి తీసుకొస్తే పరిస్థితి ఇక్కడిదాకా వచ్చేది కాదని పలువురు ఎమ్మెల్యేల అభిప్రాయం. రాష్ట్రంలోని అనేక గ్రామ పంచాయతీలకు జాతీయ స్థాయిలో గుర్తింపు, కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డులు రావడంలో పంచాయతీ సెక్రటరీల కృషిని మరువలేమని, ఇప్పుడు ఆ సెక్రటరీలే విధులను బహిష్కరించడం రానున్న కాలంలో పల్లెల్లో ప్రగతికి ప్రతిబంధకంగా మారుతుందన్న ఆందోళనను వారు వ్యక్తం చేశారు. సమ్మె విరమణ కోసం శుక్రవారం కూడా మీడియేషన్ ప్రక్రియ జరిగినా ఆశించిన ఫలితాలు రాలేదు.

హెచ్చరికలూ భేఖాతర్

ప్రభుత్వం డెడ్‌లైన్ పెట్టినా దానిని లెక్కచేయక జేపీఎస్‌లు సమ్మెను కొనసాగిస్తున్నారు. తాము లేవనెత్తిన డిమాండ్లన్నీ గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలేనని, వాటిని అమలు చేయాలని కోరినా నిర్లక్ష్యమే సమాధానమైందని, మరో ప్రత్యామ్నాయం లేకనే నిరవధిక సమ్మెకు దిగాల్సి వచ్చిందన్నది జేపీఎస్‌ల వాదన. కానీ ప్రభుత్వం హెచ్చరించినా లెక్క చేయకుండా సమ్మెలో కంటిన్యూ కావడాన్ని సర్కారు జీర్ణించుకోలేపోయింది. ఇది ప్రభుత్వాన్ని సవాలు చేసే చర్యగానే అధికారులు భావిస్తున్నారు. మరో వైపు జేపీఎస్‌లకు విపక్ష పార్టీలు మద్దతూ ఇస్తూనే ఈ అంశాన్ని పొలిటికల్‌గా వాడుకోడానికి సిద్ధమవుతున్నాయి.

పంచాయతీ సెక్రటరీల కుటుంబాలు, వారి బంధువులకు ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం సహజంగానే కోపాన్ని పెంచుతుందని, అది ఓటు బ్యాంకుపై ఎఫెక్టు చూపుతుందన్నది అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేల ఆవేదన. ఇంటెలిజెన్స్ వర్గాల రిపోర్టులు సైతం దీన్నే ధ్రువీకరిస్తున్నట్టు సమాచారం. ఎలాగైనా జేపీఎస్‌లను బుజ్జగించి, వారు విధుల్లో చేరేలా ప్రభుత్వం ప్రయత్నంచడమే ఉత్తమమని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెబుతున్న సమయంలోనే.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా కలెక్టర్లకు చీఫ్ సెక్రటరీ ఆదేశాలు జారీ చేయడం ఆందోళన కలిగిస్తున్నది. సీఎం ఆదేశం మేరకే సీఎస్ అన్ని జిల్లాల కలెక్టర్లతో జరిపిన వీడియో కాన్ఫరెన్సులో స్పష్టమైన నిర్ణయాన్ని వెల్లడించారు.

Also Read...

కొత్త పాస్​బుక్కుల కోసం చిక్కులు.. ధరణి తెచ్చిన తంటా..!



Next Story

Most Viewed