వ్యాగ‌న్ ప‌రిశ్రమ‌కు రాష్ట్రమే అడ్డు..!

by Kalyani |
వ్యాగ‌న్ ప‌రిశ్రమ‌కు రాష్ట్రమే అడ్డు..!
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో: కాజీపేట‌లో వ్యాగ‌న్ ప‌రిశ్రమ ఏర్పాటుకు ముమ్మాటికీ రాష్ట్ర బీజేపీ ప్రజాప్రతినిధులు, నేత‌ల కృషి ఉంద‌ని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి అన్నారు. త్వర‌లోనే కాజీపేట‌లో ఓరాలింగ్ అండ్ మెయిన్‌టనెన్స్ యూనిట్‌తో పాటు వ్యాగ‌న్ ప‌రిశ్రమ‌కు ప్రధాన‌మంత్రి న‌రేంద్రమోదీ చేతుల మీదుగా శంకుస్థాప‌న జ‌ర‌గ‌బోతోంద‌ని అన్నారు. వ‌రంగ‌ల్ జిల్లావాసుల ద‌శాబ్దాల క‌ల మ‌రి కొద్ది రోజుల్లోనే నెర‌వేర‌బోతోంద‌ని అన్నారు. ప్రధాన మంత్రి న‌రేంద్రమోదీ చేతుల మీదుగా జ‌ర‌గ‌బోతున్న శంకుస్థాప‌న కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తీసుకొచ్చే ద‌మ్ము ఈ జిల్లా బీఆర్ఎస్ మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్‌రావు, ఎమ్మెల్యే విన‌య్‌భాస్కర్‌ల‌కు ఉందా అంటూ స‌వాల్ విసిరారు.


తెలంగాణ రైల్వే ఎంప్లాయిస్ జేఏసీ ఆధ్వర్యంలో కాజీపేట రైల్వే వ్యాగన్ తయారీ, మరమ్మతు పీఓహెచ్ వ‌ర్క్‌షాపున‌కు శంకుస్థాపన చేప‌ట్టాల‌ని డిమాండ్ చేస్తూ కాజీపేట చౌరస్తాలో ఆదివారం ధర్మ పోరాట దీక్ష నిర్వహించారు. ఈ దీక్షలకు బీఆర్ఎస్ నాయకులు జోరిక రమేష్, స్థానిక బీఆర్ఎస్ కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకుడు జంగా రాఘవరెడ్డి, బీజేపీ నాయకులు రావు పద్మ, రాకేష్ రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి మేకల రవి, వివిధ ప్రజా సంఘాల నాయకులు హాజరయ్యారు. ఈ సంద‌ర్భంగా బీజేపీ అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ కాజీపేట‌లో ఓరాలింగ్ అండ్ మెయిన్‌టనెన్స్ యూనిట్‌తో పాటు వ్యాగ‌న్ ప‌రిశ్రమ ఏర్పాటు చేయాల‌ని కోరుతూ కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజ‌య్ కృషి చేసిన మాట వాస్తవం కాదా అంటూ ప్రశ్నించారు.

కాజీపేట వ్యాగన్ ఫ్యాక్టరీకి 160 ఎకరాలు కేటాయించి పనులు వేగవంతం చేయాలని రైల్వేశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ‌లు రాసింది నిజం కాదా అని అన్నారు. 150 ఎకరాలు ఇచ్చి మిగ‌తా ప‌దెక‌రాల‌ను కేటాయించ‌కుండా జాప్యం చేస్తూ ప‌రిశ్రమ‌ను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంద‌ని అన్నారు. రైల్వే అధికారుల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ‌లు అంద‌డం లేద‌ని విన‌య్‌భాస్కర్ ప‌లుమార్లు చెప్పాడ‌ని ఆరోపించారు. రైల్వే శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ‌లు అందిన‌ట్లుగా, రైల్వే అధికారులు మీకు విన‌తులు ఇచ్చిన‌ట్లుగా తాను నిరూపిస్తాన‌ని, నిరూపించ‌కుంటే రాజకీయాల నుంచి తప్పకుంటాన‌ని విన‌య్‌భాస్కర్‌కు స‌వాల్ విసిరారు. ఇప్పటికైనా అనవసర రాద్ధాంతం పక్కన పెట్టి కేసీఆర్‌ను శంకుస్థాప‌న‌కు తీసుకువ‌చ్చే ద‌మ్ము మీకుందా అంటూ ప్రశ్నించారు. కాజీపేట వ్యాగన్ ఫ్యాక్టరీకి మిగిలిన 10 ఎకరాల భూమిని కూడా తక్షమే కేటాయించాలని డిమాండ్ చేశారు.


దీక్ష వేదిక‌పై ర‌సాభాసగా‌..

బీజేపీ అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి మాట్లాడుతున్న స‌మ‌యంలో కొంత‌మంది బీఆర్ఎస్ నేత‌లు ఆయ‌నను అడ్డుకునే ప్రయ‌త్నం చేశారు. కార్మికులు చేప‌ట్టిన దీక్షలో రాజ‌కీయాలు మాట్లాడ‌ట‌మేంట‌ని మండిప‌డ్డారు. అయితే తాను వాస్తవాలు వెల్లడిస్తున్నాను. స‌బ్జెక్టే మాట్లాడుతున్నానంటూ రాకేష్ రెడ్డి స‌మ‌ర్ధించుకున్నారు. రాకేష్ రెడ్డికి బీఆర్ఎస్ నేత‌ల‌కు మ‌ధ్య వాగ్వాదం జరిగింది. కార్మికుల స‌ర్ది చెప్పడంతో విష‌యం స‌ద్దుమ‌ణిగింది. అంత‌కు ముందు బీఆర్ఎస్ నాయ‌కుడు జోరిక రమేష్ మాట్లాడుతూ రైల్వే పరిశ్రమ కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, భూమి కేటాయించినా కేంద్రం నిర్లక్ష్యం చేస్తోంద‌ని విమర్శించారు.

కోచ్ ఫ్యాక్టరీ రాకుండా గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ప్రస్తుత బీజేపీ కాజీపేట అభివృద్ధిపై నిర్లక్ష్యం చేస్తోంద‌ని విమర్శించారు. కాంగ్రెస్ నాయకుడు రాఘవరెడ్డి మాట్లాడుతూ రైల్వే పరిశ్రమ ఏర్పాటుకు 150 ఎకరాలు కేటాయించినప్పటికీ మరొక 10 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాల్సి ఉంద‌న్నారు. కాజీపేట ప్రాంత అభివృద్ధి పై రాష్ట్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోంద‌ని అన్నారు. నిధులు కేటాయించినప్పటికీ శంకుస్థాపన చేయకపోవడం కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారిందన్నారు. త్వరలోనే కాజీపేట పీఓహెచ్‌కి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేస్తారని బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ అన్నారు.

Next Story

Most Viewed