10 రోజులు పూర్తయినా తెగని పంచాయితీ.. స్పందించని ప్రభుత్వం

by Dishafeatures2 |
10 రోజులు పూర్తయినా తెగని పంచాయితీ.. స్పందించని ప్రభుత్వం
X

దిశ ,తెలంగాణ బ్యూరో : గ్రామ పంచాయతీ కార్మికులు తన న్యాయమైన డిమాండ్ల సాధనకోసం చేపట్టిన సమ్మె దాదాపు 10 రోజులు పూర్తయింది. దీంతో పల్లెల్లో చెత్త పేరుకపోతున్నది. చెత్త తీసేవారు లేకపోవడంతో గ్రామాల్లో పారిశుద్య సమస్య తీవ్రతరం అవుతోంది. ప్రస్తుతం వర్షాకాలం సీజన్ కావడంతో వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీ కార్మికులు జులై 6నుంచి రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేపట్టిన సంగతి విదితమే. రాష్ట్రంలో 12,769 గ్రామపంచాయతీలు ఉండగా సుమారు 40,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2020లో మల్టీపర్పస్ వర్కర్స్ ను నియమించింది. జనాభా ప్రకారం ఒక్కో గ్రామంలో ఇద్దరి నుంచి నలుగురిని నియమించింది. వీరి సమస్యలు పరిష్కరించకపోవడంతో సమ్మె బాట పట్టారు.

పంచాయతీ కార్మికులు సమ్మెలో ఉండడంతో గ్రామాలన్నీ అపరిశుభ్రంగా తయారయ్యాయి. దీంతో దుర్వాసన వెలువడుతోంది. అసలే వానాకాలం కావడంతో సీజనల్ వ్యాధుల ప్రభావం ప్రజలను ఆందోళన కలిగిస్తున్నది. రోడ్లపై ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోతుండగా వాన నీరు, బురద, మురికి నీరు అంత రోడ్లపై వచ్చి చేరుతున్నది. వీటితో దోమలు పెరిగి వ్యాధులు ప్రబలుతాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మురికి కాల్వలు శుభ్రం చేయడం, ఇంటింటి నుంచి చెత్త సేకరణ, డంపింగ్ యార్డ్ నిర్వహణ తదితర పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి.

సర్పంచులే పారిశుధ్య కార్మికులు

గ్రామపంచాయతీ కార్మికులు సమ్మెలో ఉండడంతో కొన్ని గ్రామాల్లో సర్పంచులు ఇతర ప్రజాప్రతినిధులే పారిశుధ్య కార్మికులుగా పనిచేస్తున్నారు. చెత్తను ఎత్తడం ట్రాక్టర్ నడపడం వారి పనిగా మారింది. ఆఫీసర్లు పట్టించుకోకపోవడంతో ప్రజాప్రతినిధులు ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులతో తలలు పట్టుకుంటున్నారు. మరికొన్ని గ్రామ పంచాయతీల్లో తాత్కాలిక సిబ్బందితో చేపడుతున్నా ఇది వరకు ఉన్నా సిబ్బంది తమ పొట్ట కొట్టాడంటూ.. వారిని అడ్డుకుంటున్నారు. దీంతో పల్లెల్లో రోడ్లు చెత్త చెదారంతో నిండి ఒక పక్కా మరోప్రక్క మురికి కాలువల్లో చెత్తను తీయకపోవడంతో గ్రామాలు కంపు కొడుతున్నాయి.

ప్రధాన డిమాండ్లు ఇవే

  • గ్రామ పంచాయతీ సిబ్బంది అందరినీ పర్మినెంట్​ చేయాలి.
  • 11వ పీఆర్​సీలో నిర్ణయించిన విధంగా మినిమం బేసిక్​ రూ.19,000 వేతనం చెల్లించాలి
  • జీఓ నెంబర్​ 60 ప్రకారం స్వీపర్లకు రూ.15,600 పంప్​ ఆపరేటర్లు, ఎలక్ట్రీషియన్లు, డ్రైవర్లు, కారోబార్​, బిల్​ కలెక్టర్లకు రూ.19,500 వేతనం నిర్ణయించాలి.
  • ప్రమాదంలో చనిపోయిన కార్మికుడి కుటుంబానికి రూ.10 లక్షల నష్ట పరిహారం చెల్లించాలి.
  • కేంద్ర ప్రభుత్వం తెచ్చిన లేబర్​ కోడ్​లను వెంటనే రద్దు చేయాలి.
  • అన్ని కార్మిక చట్టాలు అమలు చేయాలి.

సమ్మె మరింత ఉదృతం చేస్తాం.. పాలడుగు భాస్కర్ , తెలంగాణ గ్రామపంచాయతీ ఉద్యోగ , కార్మిక సంఘాల జేఏసీ చైర్మన్

గ్రామపంచాయతీ పారిశుధ్య కార్మికుల సమ్మె మొదలుపెట్టి 10 రోజులు పూర్తయినా ప్రభుత్వానికి ఏమాత్రం చీమ కుట్టినట్లైనా లేదు. ఇప్పటికైనా స్పందించి కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి. కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా పోటీ కార్మికులను పెట్టడం దుర్మార్గం. ప్రభుత్వం పై మరింత ఒత్తిడి తెచ్చేందుకు కార్యాచరణ రూపొందించాం. ఈ నెల 18 న ఎమ్మెల్యేల ఇంటిముందు ధర్నా, 19న రాజకీయ పార్టీలు , కార్మిక సంఘాలు, సామజిక సంగాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం , 20 న మండల కేంద్రాల్లో కార్మికుల సుకుటుంబ సభ్యులతో దీక్ష , 21 న కలెక్టరేట్ల ముట్టడి చేపడుతాం. పారిశుద్ధ్య కార్మికుల జీతాలు పెంచి వారి కుటుంబాలలో వెలుగును నింపి ప్రభుత్వం సమ్మెను విరమింప చేసే విధంగా చూడాలి


Next Story

Most Viewed