ప్రభుత్వమే కథ అల్లి పోలీసులతో చెప్పించింది.. : రఘునందన్ రావు

by Disha Web Desk 4 |
ప్రభుత్వమే కథ అల్లి పోలీసులతో చెప్పించింది.. : రఘునందన్ రావు
X

దిశ, తెలంగాణ బ్యూరో : టెన్త్ పేపర్ లీకేజీ అంశంలో బండి సంజయ్‌ని రిమాండ్‌కు పంపించడంపై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వరంగల్ సీపీ అత్యుత్సాహం ప్రదర్శించారని, రాష్ట్ర ప్రభుత్వం అల్లిన కథను ప్రెస్ మీట్ ద్వారా చెప్పారని రఘునందన్ రావు విమర్శలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కొంతమంది అధికారుల పనితీరు రాజకీయ నాయకులపై బురద జల్లేలా ఉన్నాయని ఆయన విమర్శలు చేశారు. పదో తరగతి పేపర్ లీకేజీ అంశానికి రాజకీయ రంగు పులిమారని ధ్వజమెత్తారు.

దీనికోసం కొంత మంది అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగిస్తోందని ఆరోపించారు. యూనిఫాం వేసుకున్న వ్యక్తులు అన్ని పార్టీలను సమదృష్టితో చూడాలని, కానీ అలా జరగడంలేదన్నారు. ఉదయం 9:37 గంటలకు ఫోటో తీసిన వ్యక్తి ఎవరని, ఆ వ్యక్తికీ, బీజేపీకి ఏమైనా సంబంధం ఉందా? అని ఎమ్మెల్యే విమర్శించారు. ఒక వ్యక్తి పరీక్ష కేంద్రంలోకి వచ్చి ప్రశ్న పత్రాన్ని ఫొటో తీస్తుంటే కేంద్రం వద్ద ఉన్న బలగాలు ఏం చేస్తున్నట్లని ప్రశ్నించారు. బండి సంజయ్ కి ఉదయం 11: 21 నిమిషాలకు మెసేజ్ వచ్చిందని, ఈ గ్యాప్‌లో ఎంత మందికి ఈ పేపర్ వెళ్లింది?, ఎన్ని టీవీ ఛానళ్లు, ఎంత మంది ఎమ్మెల్యేలకు వెళ్లిందో కూడా బయటపెట్టాలన్నారు.

అసలు ఫోటో తీసిన శివ గణేష్ ఫోన్‌ను పోలీసులు సీజ్ చేశారా? అని రఘునందన్ రావు ప్రశ్నించారు. వాస్తవానికి 11: 21కి అంటే దాదాపు సగం మంది పరీక్ష పూర్తయ్యే సమయమని ఆయన చెప్పారు. తొలిరోజు సీపీ నిర్వహించిన ప్రెస్ మీట్‌కు, మరుసటి రోజున నిర్వహించిన ప్రెస్ మీట్‌కు చాలా తేడాలున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అల్లిన కథను ఆయన చెప్పారని ధ్వజమెత్తారు. లీక్ అయిన పేపర్ 140కి పైగా గ్రూపుల్లో సర్క్యులర్ అయిందని, అన్ని గ్రూపులను చెక్ చేశారా? లేదా సమాధానం చెప్పాలన్నారు.

ఒక జర్నలిస్ట్.. తనకు వచ్చిన సమాచారాన్ని నేతలకు ఇవ్వడం తప్పా? అని ఆయన ప్రశ్నించారు. ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం కాల్ డేటా తీసుకునే అధికారం ఎవరికీ లేదని, కనీసం ట్రాఫిక్ చలాన్ల కోసం పోలీసులు ఫోటో తీయడం కూడా నేరమేనని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో వెహికిల్ సీజ్ చేసే అధికారం కూడా పోలీసులకు లేదనే విషయాన్ని రఘునందన్ రావు ప్రస్తావించారు.

తాను వ్యవస్థలో ఉన్న లోపాలని ఎత్తిచూపాను తప్పితే.. ఎవరినీ ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కాదని ఆయన పేర్కొన్నారు. పోలీసులు వారు చేసిన తప్పును కప్పి పుచ్చుకునేందుకే సంజయ్‌పై కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేశారన్నారు. పోలీసులు స్పీకర్ కార్యాలయాన్ని తప్పుదోవ పట్టిస్తే.. సంజయ్ బయటికి వచ్చాక తప్పకుండా న్యాయపోరాటం చేస్తారని రఘనందన్ రావు స్పష్టంచేశారు.


Next Story

Most Viewed