తెలంగాణలో కులగణనకు సర్కారు నిర్ణయం.. సేకరించే వివరాలు అవేనా?

by Disha Web Desk 2 |
తెలంగాణలో కులగణనకు సర్కారు నిర్ణయం.. సేకరించే వివరాలు అవేనా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా కులగణన సర్వే చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ మేరకు ఈ ఏడాది ఫిబ్రవరి 4న జరిగిన తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నది. అసెంబ్లీలోనూ శుక్రవారం ప్రవేశపెట్టిన తీర్మానానికి ఏకగ్రీవ ఆమోదం లభించింది. త్వరలో ఈ ప్రక్రియ ప్రారంభం కానున్నది. ఇందుకు అవసరమైన విధివిధానాలను ప్రభుత్వం ఇంకా ఖరారు చేయలేదు. నిర్దిష్టంగా ఎప్పుడు ప్రారంభించాలనేదీ ఫైనల్ కాలేదు. ఏ ఫార్మాట్‌లో సర్వే నిర్వహించాలి? ఎన్ని దశల్లో నిర్వహించాలి? ఏయే వివరాలను సేకరించాలి? ఎంత మంది సిబ్బంది ఇందులో పాల్గొంటారు? డెడ్‌లైన్ ఎప్పటి వరకు? అనే అంశాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు.

సభ్యుల ప్రతిపాదనలు

ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానంపై జరిగిన చర్చ సందర్భంగా పలువురు విపక్ష సభ్యుల నుంచి చట్టబద్ధత కావాలనే ప్రతిపాదనలు వచ్చాయి. బిల్లుపై చర్చించి చట్టంగా మార్చడం ద్వారా చట్టబద్ధత లభిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిషన్‌ను ఏర్పాటు చేస్తే లీగల్ చిక్కులు లేకుండా ఉంటుందని.. బిహార్ రాష్ట్రం విషయంలో వచ్చిన ఇబ్బందులను నివారించవచ్చని వివరించారు. అన్ని పార్టీలూ ప్రభుత్వ తీర్మానానికి మద్దతు పలికాయి. ఇక సర్వే ప్రారంభం కావడమే మిగిలింది.

బలహీనవర్గాల కోసమేనన్న సీఎం రేవంత్

బలహీనవర్గాలను బలోపేతం చేయడానికే ఈ సర్వే చేపడుతున్నామని, ఆర్థికంగా మాత్రమే కాక రాజకీయంగానూ అవకాశాలు కల్పిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ వేదికగానే వ్యాఖ్యానించారు. ఈ సర్వేలో ఆర్థిక, సామాజిక, విద్య, ఉద్యోగ తదితర వివరాలతో పాటు ప్రజల వ్యక్తిగత, కుటుంబ వివరాలను సైతం ప్రభుత్వం సేకరించనున్నది. ఏ కుటుంబం ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నది? ఉపాధి అవకాశాలు ఏ మేరకున్నాయి? ప్రభుత్వం కల్పించాల్సిన అవసరాలు ఎంటి? ఇలాంటివి ఈ సర్వే ద్వారా వెల్లడి కానున్నాయి. ఈ వివరాలతో ప్రభుత్వం ఏం చేయనున్నది.. వెల్ఫేర్ స్కీములకు ప్రామాణికంగా తీసుకుంటుందా..? ఇప్పుడు అర్హులైనవారిపై వేటు పడుతుందా..? ఇలాంటి అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ ‘సమగ్ర కుటుంబ సర్వే’ నిర్వహించింది. ఆ వివరాలతో పోలిస్తే సర్కారు చేపట్టబోయే సర్వే ఏ రూపంలో భిన్నంగా ఉంటుందనే ఆసక్తి నెలకొన్నది.

గతంలో బిహార్, కర్ణాటకలో సర్వే

2014లో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించింది. 2015లో కర్ణాటక ప్రభుత్వం సోషియో ఎకనమిక్ సర్వే పేరుతో, 2023లో బిహార్ ప్రభుత్వం జనగణన పేరుతో సర్వే నిర్వహించాయి. ఈ మూడింటిలో కొన్ని సారూప్యమైన అంశాలు ఉన్నా.. అవి వేర్వేరు ఫార్మాట్‌లలో ఉన్నాయి. తెలంగాణలో అత్యధికంగా 94 ప్రశ్నలతో వివరాలను సేకరించగా కర్ణాటకలో 55 అంశాలు, బిహార్‌లో 17 అంశాల ఆధారంగా డాటాబేస్ తయారైంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైనవారికే అందించి ప్రజాధనాన్ని వృథా కాకుండా, దుర్వినియోగం కాకుండా ఉండే ఉద్దేశంతో వీటిని చేపట్టాయి. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏయే అంశాలను ప్రామాణికంగా తీసుకుని సర్వే చేసి డాటా బేస్ సేకరిస్తుందనేది ఇంకా ఖరారు కాలేదు.

94 రకాల వివరాలతో సమగ్ర కుటుంబ సర్వే

రాష్ట్రం ఏర్పడిన కొత్తలో బీఆర్ఎస్ ప్రభుత్వం 2014 ఆగస్టు 19న సమగ్ర కుటుంబ సర్వే పేరుతో ఒకే రోజు ప్రతి ఇంటి నుంచీ వివరాలను సేకరించింది. మొత్తం 94 రకాల వివరాలను 8 విభాగాల కింద తీసుకున్నది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాల్సిన సంక్షేమ పథకాలకు అర్హులైన లబ్ధిదారులను గుర్తించేందుకు ఈ ప్రక్రియను చేపట్టినట్టు అప్పట్లో వివరించింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ ఇన్‌ఫార్మాటిక్స్ సెంటర్ నుంచి సాంకేతిక సహకారాన్ని తీసుకుని ఇంటింటికీ వెళ్లే ప్రభుత్వ సిబ్బందికి మొబైల్ యాప్‌ను సమకూర్చింది. వ్యక్తుల, కుటుంబ వివరాలతో పాటు గృహవసతి, సొంత వాహనం, భూమి, ఆదాయం, కులం, విద్యార్హతలు, ఉపాధి, స్థిరచరాస్తులు, వ్యాధులు, పెంపుడు జంతువులు.. ఇలాంటి వివరాలను సేకరించింది.

సమగ్ర సర్వే నిర్వహణ ఇలా..

నిర్వహించిన తేదీ : 2014 ఆగస్టు 19

పాల్గొన్న ప్రభుత్వ సిబ్బంది : 3,85,892 మంది

ఖర్చు : రూ. 33.94 కోట్లు

కవర్ చేసిన ఇండ్లు : 1,03,95,629

వివరాలిచ్చిన వారు : 3,68,76,544 మంది

వెరిఫికేషన్ : ఆధార్, రేషన్ కార్డు, బ్యాంకు ఖాతా, వంట గ్యాస్ కనెక్షన్, కరెంటు బిల్లు, పట్టాదారు పాస్‌బుక్, వాహనాల రిజిస్ట్రేషన్, క్యాస్ట్ సర్టిఫికెట్, దివ్యాంగుల సర్టిఫికెట్లు

ముద్రించిన ఫారాల సంఖ్య : 1.05 కోట్లు

డిజిటైజేషన్ : 25 వేల మంది డాటా ఎంట్రీ ఆపరేటర్లు

బిహార్‌లో 17 కాలమ్స్‌లో వివరాల సేకరణ

బిహార్ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశంలో చర్చించి అభిప్రాయాలను తీసుకున్న మరుసటిరోజు (2022 జూన్ 2న) మంత్రివర్గ సమావేశంలో కులగణన చేపట్టాలని నిర్ణయం తీసుకున్నది. మొబైల్ యాప్‌లో వివరాలను నమోదు చేయడంతో పాటు ఫిజికల్‌గానూ నిర్దిష్ట ఫార్మాట్‌ను రూపొందించి ఫారాలను ముద్రించింది. రెండు దశల్లో ఐదు నెలల కాలంలో కులగణనను కంప్లీట్ చేసింది. ‘బిజాగ’ (బిహార్ జాతి ఆధారిత్ గణన) పేరుతో బెల్ట్రాన్ (బిహార్ ఎలక్ట్రానిక్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) మొబైల్ యాప్‌ను తయారు చేసింది. వివరాలను ప్రత్యేక సాఫ్ట్ వేర్‌లో అప్‌లోడ్ చేసేందుకు సాంకేతిక సహకారం అందించింది. గతేడాది అక్టోబరు 2న గణాంకాలను వెల్లడించింది. మొత్తం 17 కాలమ్స్‌లో వివరాలను సేకరించింది. ఆధార్, క్యాస్ట్ సర్టిఫికేట్, రేషను కార్డు వివరాలను ఆప్షనల్ చేసింది.

బిహార్‌లో సర్వే ఇలా..

నిర్వహించిన తేదీలు : 2023 జనవరి 7 నుంచి 21, ఏప్రిల్15 నుంచి మే15 (రెండు ఫేజ్‌లలో)

పాల్గొన్న ప్రభుత్వ సిబ్బంది : 5,18,000 మంది

ఖర్చు : రూ. 500 కోట్లు

కవర్ చేసిన ఇండ్లు : 2,76,68,930

వివరాలిచ్చిన వ్యక్తులు : 13,07,25,310 మంది

వెరిఫికేషన్ : ఆధార్, రేషన్ కార్డు, బ్యాంకు ఖాతా, వంట గ్యాస్ కనెక్షన్, కరెంటు బిల్లు, వాహనాల రిజిస్ట్రేషన్, క్యాస్ట్ సర్టిఫికెట్

ముద్రించిన ఫారాల సంఖ్య : 3.05 కోట్లు

డిజిటైజేషన్ : ట్రైజిన్ టెక్నాలజీస్, ఢిల్లీ

కర్ణాటకలో ఎనిమిదేండ్లుగా పెండింగ్

కర్ణాటకలో సిద్ధరామయ్య సీఎంగా ఉన్న సమయంలో 2015లోనే కులగణన చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇందుకోసం సుమారు రూ.170 కోట్ల బడ్జెట్ అవసరమవుతుందని అంచనా వేసింది. మొత్తం 55 ప్రశ్నలతో నిర్దిష్ట ఫార్మాట్‌ను రూపొందించింది. అన్ని గ్రామాల్లో ప్రతి ఇంటినీ కవర్ చేసి సంపూర్ణంగా వివరాలను తీసుకునేలా ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించింది. ఎన్యూమరేటర్లకు ట్రెయినింగ్ సైతం ఇచ్చింది. ఫిజికల్ ఫారాలలో వివరాలను తీసుకుని ఆ తర్వాత డిజిటలైజ్ చేయాలని భావించింది. 2015లోనే ఒకటిన్నర నెల పాటు సర్వే నిర్వహించింది. కానీ దాని వివరాలు ఇప్పటికీ వెల్లడికాలేదు. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంస్థ ఈ వివరాలను డిజిటైజ్ చేసే బాధ్యత తీసుకున్నది. ఈ నివేదికను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ అండ్ ఎకనమిక్ చేంజ్ అనే సంస్థ సమీక్షించింది. ఈ సర్వే అటు లీగల్‌గా, ఇటు రాజకీయపరంగా వివాదాస్పదమైంది. కానీ 2018లోనే కొన్ని గణాంకాలు బయటకు లీక్ అయ్యాయి.

కర్ణాటకలో ఇలా..

నిర్వహించిన తేదీలు : 2015 ఏప్రిల్-మే మధ్యలో (45 రోజుల పాటు)

పాల్గొన్న ప్రభుత్వ సిబ్బంది : 1,60,000 మంది

ఖర్చు : రూ. 162.00 కోట్లు

కవర్ చేసిన ఇండ్లు : 1,60,00,000

వివరాలు ఇచ్చిన వ్యక్తులు : 6,38,11,000 మంది

వెరిఫికేషన్ : ఆధార్, రేషన్ కార్డు, బ్యాంకు ఖాతా, వంట గ్యాస్ కనెక్షన్, కరెంటు బిల్లు, వాహనాల రిజిస్ట్రేషన్, క్యాస్ట్ సర్టిఫికెట్

డిజిటైజేషన్ : భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్

Next Story

Most Viewed