ఆయనపైనే సర్కారు ఆశలు.. అప్పటికల్లా టీఎస్పీఎస్సీని గాడిలో పెట్టగలడా?

by Disha Web Desk 2 |
ఆయనపైనే సర్కారు ఆశలు.. అప్పటికల్లా టీఎస్పీఎస్సీని గాడిలో పెట్టగలడా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డిని నియమించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ మేరకు సచివాలయం నుంచి రాజ్‌భవన్‌కు ప్రతిపాదనలతో కూడిన ఫైల్ వెళ్ళినట్లు సెక్రెటేరియట్ వర్గాలు పేర్కొన్నాయి. గవర్నర్ ఆమోదం తెలిపిన తర్వాత లాంఛనంగా ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడనున్నది. గత ప్రభుత్వ హయాంలో కమిషన్‌లో క్రమశిక్షణ గాడి తప్పడం, పనిచేసే సిబ్బందిపైన పర్యవేక్షణ కొరవడడంతో ప్రశ్నాపత్రాల లీకేజీ విద్యార్థులు, నిరుద్యోగులను అయోమయంలో పడేసింది. దీంతో పోలీసు శాఖలో ఉండే డిసిప్లైన్‌ను కమిషన్‌లో అమలు చేయడానికి, మొత్తం మెకానిజాన్ని గాడిలో పెట్టేందుకు ఒక ఐపీఎస్‌ను నియమించడం దోహదపడుతుందని ప్రభుత్వం భావించింది.

దీర్ఘకాలం పాటు డీజీపీగా పనిచేసి 2022 డిసెంబరులో పదవీ విరమణ చేసిన మహేందర్‌రెడ్డిని వీలైనంత తొందరగా కమిషన్ చైర్మన్‌గా నియమించి మొత్తం మెకానిజాన్ని స్ట్రీమ్‌లైన్ చేయాలని భావిస్తున్నది. కమిషన్ నిబంధనల ప్రకారం 62 ఏండ్ల వయసు దాటినవారు చైర్మన్‌గా, సభ్యులుగా కొనసాగరాదు. మహేందర్‌రెడ్డిని చైర్మన్‌గా గవర్నర్ ఆమోదం తెలిపితే ఆయన ఈ ఏడాది డిసెంబరు వరకు కొనసాగడానికి వెసులుబాటు ఉంటుంది. అప్పటికల్లా నోటిఫికేషన్ల జారీ, సిస్టమ్‌ను గాడిలో పెట్టడం పూర్తవుతుందని, ఆ తర్వాత కొత్త చైర్మన్‌ను నియమించాలన్నది ప్రభుత్వ భావన. గవర్నర్ నిర్ణయం తీసుకోవడమే తరువాయి. చైర్మన్ నియామకం తర్వాత సభ్యులూ ఫైనల్ కానున్నారు.

ఏదేని పరిస్థితుల్లో మహేందర్ రెడ్డికి గవర్నర్ అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లయితే ప్రత్యామ్నాయంగా మరో ఇద్దరి పేర్లను కూడా ఆ ఫైల్‌లో ప్రతిపాదించినట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం ఇప్పటికే రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్‌తో పాటు నియామకాల విషయంలో స్పీడ్ పెంచాలన్న ఉద్దేశంతో ఇటీవలే ఢిల్లీ వెళ్ళి యూపీఎస్సీ చైర్మన్‌, సెక్రటరీతో సీఎం రేవంత్ చర్చలు జరిపారు. దానికి కొనసాగింపుగా ఇప్పుడు చైర్మన్ పోస్టును తొలుత భర్తీచేసి మొత్తం బాడీని వెంటవెంటనే ఫంక్షనింగ్‌లోకి తేవాలని భావిస్తున్నారు. ఐపీఎస్ అధికారిని (రిటైర్డ్ డీజీపీ)ని చైర్మన్‌గా నియమించడానికి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు ‘దిశ’ ఈ నెల 14న వార్తను ప్రచురించిన సంగతి తెలిసిందే.



Next Story

Most Viewed