రాష్ట్రానికి చేరుకున్న ఎన్డీఎస్ఏ NDSA.. ఇరిగేషన్ ఆఫీసర్లతో మరోసారి భేటీ

by Disha Web Desk 2 |
రాష్ట్రానికి చేరుకున్న ఎన్డీఎస్ఏ NDSA.. ఇరిగేషన్ ఆఫీసర్లతో మరోసారి భేటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టు అధ్యయనం కోసం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నియమించిన నిపుణుల కమిటీ గురువారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్నది. వెంటనే జలసౌధలో మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, సెక్రటరీ రాహుల్ బొజ్జా, స్పెషల్ సెక్రటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈ-ఇన్-సీ షనిల్, మరికొద్దిమంది అధికారులతో సమావేశమైంది. కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన ఆరుగురు సభ్యుల కమిటీ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలను పరిశీలించనున్నది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఏర్పాటైన ఈ కమిటీ గురువారం రాత్రికే మేడిగడ్డ చేరుకుని అక్కడే బస చేయనున్నది. ఆ తర్వాత రెండు రోజుల పాటు మూడు బ్యారేజీల్లో ఏర్పడిన డ్యామేజీని స్టడీ చేయనున్నది.

ఈ సమావేశం సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... మొత్తం నాలుగు రోజుల పాటు ఈ కమిటీ రాష్ట్రంలో పర్యటించనున్నదని తెలిపారు. నాలుగు నెలల్లో పూర్తిస్థాయి నివేదికను సమర్పించాల్సిందిగా కమిటీకి కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ స్పష్టం చేసిందన్నారు. నెల రోజుల్లో ప్రాథమిక రిపోర్టు ఇవ్వాల్సిందిగా సూచించిందన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఫైనల్ రిపోర్టుకు నాలుగు నెలల సమయం తీసుకోకుండా ఈలోపే ఇవ్వాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసినట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఈ కమిటీ ఇచ్చే రిపోర్టు ఆధారంగానే బ్యారేజీలకు రిపేర్‌లు చేయడంతో పాటు తప్పు చేసిన బాధ్యులపై ప్రభుత్వపరంగా చర్యలు తీసుకోవడం వీలవుతుందన్నారు.



Next Story

Most Viewed