పొమ్మన్నా పోరు.. కుర్చీ వదలరు..ప్రమోషన్ ఇచ్చినా వద్దంటారు!

by Disha Web Desk 21 |
పొమ్మన్నా పోరు.. కుర్చీ వదలరు..ప్రమోషన్ ఇచ్చినా వద్దంటారు!
X

దిశ, రంగారెడ్డి బ్యూరో: జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో కొంత మంది ఉద్యోగులు ఏళ్లుగా పాతుకుపోయారు. కొందరు ఇతర జిల్లాల నుంచి అడ్డదారుల్లో డిప్యూటేషన్లపై వస్తే.. మరికొందరు అదే జిల్లాలో మారుమూల ప్రాంతాల పీహెచ్‌సీల నుంచి అర్బన్‌ ప్రాంతాల్లోని యూపీహెచ్‌సీలకు ఓరల్‌ ఆర్డర్లపై పోస్టింగులు తీసుకున్నారు. మరికొంత మంది ఏళ్లుగా ఒకే చోట పాతుకుపోయారు. బదిలీ చేసినా వెళ్లరు. చివరకు పదోన్నతులు కల్పించినా కుర్చొన్న కుర్చీ మాత్రం వదలడం లేదు. ఆమన్‌గల్‌ యూపీహెచ్‌సీకి చెందిన ఎంపీహెచ్‌ఎస్‌ కె.శ్రీనివాసులుకు డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ ఇటీవల ఎంపీహెచ్‌ఓగా పదోన్నతి కల్పించింది. నిజానికి ఆయన ఆమన్‌గల్‌ పోస్టింగ్‌ పొంది.. గత నాలుగేళ్లుగా ఎలాంటి ఆర్డర్లు లేకుండా కేవలం ఓరల్‌ ఆర్డర్‌పై బాలాపూర్‌ యూపీహెచ్‌సీలో పని చేస్తున్నారు. ఇటీవల ఆయనకు వైద్య ఆరోగ్య శాఖ ఎంపీహెచ్‌ఓగా పదోన్నతి కల్పించినా.. తీసుకునేందుకు నిరాకరించారు. దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు.

సూపర్‌వైజర్ల పర్యవేక్షణ లోపంతోనే మిజిల్స్
బాలాపూర్‌ పీహెచ్‌సీ పరిధిలో పహడిషరీఫ్, కొత్తపేట్, బాలాపూర్, నాదర్‌గుల్, బడంగ్‌పేట్, మీర్‌పేట్, జిల్లెలగూడ, లెనిన్‌నగర్‌ సబ్‌సెంటర్లు కొనసాగుతున్నాయి. ఆరుగురు సూపర్‌ వైజర్లు పని చేస్తున్నారు. నిజానికి ఒక మేల్, మరో ఫీమేల్‌ సూపర్‌ వైజర్‌ సరిపోతారు. ఆరుగురు సూపర్‌ వైజర్లు ఉన్నా..ఒకరిద్దరు మాత్రమే ఫీల్డ్‌ విజిట్‌ చేస్తున్నారు. మిగిలిన వారు సొంత వ్యవహారాలు చక్కబెట్టుకుంటున్నారు. సూపర్‌ వైజర్ల పర్యవేక్షణ లోపం కారణంగా కొత్తపేట, జల్‌పల్లి, బాలాపూర్, పహడిషరీఫ్‌ సబ్‌సెంటర్ల పరిధిలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ సక్రమంగా అమలు కావడం లేదు. మిజిల్స్‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. డిప్యూటేషన్లపై కొనసాగుతున్న వారంతా జిల్లా ఉన్నతాధికారికి పెద్ద ఎత్తున డబ్బులు ముట్టజెతున్నట్టు తెలిసింది.

రోగులు..ప్రైవేటు క్లీనిక్‌కు
ప్రభుత్వ ఉదాసీనత..ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం రోగుల పాలిట శాపంగా మారుతోంది. నిత్యం రోగులకు అందుబాటులో ఉండాల్సిన వైద్యులు, సిబ్బంది సొంత క్లీనిక్‌లకే పరిమితమవుతున్నారు. ఫలితంగా నిరుపేద రోగులకు కనీస వైద్యసేవలు అందకుండా పోతున్నాయి. అనారోగ్యంతో బాధపడుతూ చికిత్సల కోసం ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చిన రోగులనే కాదు... ఏకంగా ప్రభుత్వం సరఫరా చేసిన మందులు, గ్లూకోజ్‌ బాటిళ్లు, సిరప్‌లు, ఆయిట్‌ మెంట్‌లు, ఇంజక్షన్లు, గ్లౌజులు సొంత క్లీనిక్‌లకు తరలించుకుంటున్నారు. తాజాగా పెద్దషా పూర్‌ పీహెచ్‌సీకి చెందిన ఓ వైద్యుడు అక్కడికి వచ్చిన రోగులను శంషాబాద్‌లోని తన సొంత క్లీనిక్‌కు తరలిస్తున్న అంశం బయట పడింది. ఫలితంగా అత్యవసర పరిస్థితుల్లో రోగులకు అందాల్సిన వైద్య సేవలు అందకుండా పోతున్నాయి.

ఏళ్లుగా ఇక్కడే పాగా..
మెయినాబాద్‌లో విధులు నిర్వహించాల్సి ఉన్నా ఓ సీహెచ్‌ఓ బడంగ్‌పేటలో నివాసం ఉంటూ బాలా పూర్‌ పీహెచ్‌సీలో ఓరల్‌ డిప్యూటేషన్‌పై పని చేస్తున్నారు. గెజిటెడ్‌ సంతకాల దందా నడిపిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో సరూర్‌నగర్‌ ఇదే కేసులో ఆయన పట్టుబడ్డాడు. అవినీతి ఆరోపణలు ఉన్నా ఆయన్ను మళ్లీ ఇక్కడికి ఎలా తీసుకొస్తారనేదీ అంతు చిక్కని ప్రశ్నగా మిగిలింది.

కుందుర్గ్‌ పీహెచ్‌సీలో పని చేయాల్సి ఉన్నా ఓ ఎంపీహెచ్‌ఓ... ప్రస్తుతం ఓరల్‌ డిప్యూటేషన్‌పై బాలాపూర్‌లో పని చేస్తున్నాడు. గతంలో ఆయన ఇక్కడ పని చేసి మళ్లీ అదే ప్లేసుకు వచ్చి కూర్చొన్నాడు.

భువనగిరి నుంచి లేమూర్‌ డిప్యూటేషన్‌పై వచ్చిన ఓ పీహెచ్‌ఎన్‌ను సైతం ఓరల్‌ డిప్యూటేషన్లపై బాలాపూర్‌లో వేశారు. తాండూరు పీహెచ్‌సీకి చెందిన మరో హెల్త్‌ ఎడ్యుకేటర్‌ ఏకంగా డీహెచ్‌ నుంచి డిప్యూటేషన్‌ ఆర్డర్‌ తీసుకొని బాలాపూర్‌కు వచ్చి చేరింది. వీరంతా సబ్‌ సెంటర్లకు వెళ్లి ఏఎన్‌ఎంల పనితీరుతో పాటు బుధ, శనివారాల్లో నిర్వహించే వ్యాక్సినేషన్‌ తీరును పర్యవేక్షించాలి.

చంపాపేట్‌ యూపీహెచ్‌కి చెందిన ఓ ఫార్మాసిస్ట్‌ బాలాపూర్‌కు డిప్యూటేషన్‌పై వచ్చారు. ఇటీవల ఇక్కడికి రెగ్యులర్‌ ఫార్మాసిస్ట్‌ వచ్చింది. ఏడాది క్రితమే ఆయన్ను ఇక్కడి నుంచి రిలీవ్‌ చేయాల్సి ఉన్నా..ఇప్పటికీ చేయకపోవడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో అర్థం కాలేదు.

నందనవనంకు చెందిన ఓ కాంట్రాక్ట్‌ ల్యాబ్‌టెక్నిషన్‌ గత నాలుగేళ్ల నుంచి బాలాపూర్‌లోనే కొనసాగుతున్నాడు. రెగ్యులర్‌ ఆర్డర్‌పై ఏడాది క్రితమే మరో టెక్నిషియన్‌ ఇక్కడికి వచ్చి నా... డిప్యూటేషన్‌పై ఉన్న టెక్నిషియన్‌ను అక్కడి నుంచి రిలీవ్‌ చేయకపోవడానికి ఉన్న ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు.

బాలాపూర్‌ యూపీహెచ్‌సీలో పని చేస్తున్న ఓ కాంట్రాక్ట్‌ ల్యాబ్‌టెక్నిషియన్‌ ఇటీవల శివరాంల్లికి డిప్యూటేషన్‌పై వెళ్లింది. బాలాపూర్‌ లేదా సరూర్‌నగర్‌ పీహెచ్‌సీ వైద్యులు మాత్రమే ఆమెను రిలీవ్‌ చేయాల్సి ఉన్నా..ఏ సంబంధం లేని మీర్‌పేట్‌ యూపీహెచ్‌సీ డాక్టర్‌ ఎలా రిలీవ్‌ చేసిందో అర్థం కావడం లేదు.


Next Story

Most Viewed