HYD: ముగిసిన రేసింగ్.. నగర వాసులకు మంత్రి కేటీఆర్ క్షమాపణ

by Disha Web Desk 2 |
HYD: ముగిసిన రేసింగ్.. నగర వాసులకు మంత్రి కేటీఆర్ క్షమాపణ
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ లో ఉత్కంఠ భరితంగా సాగిన వరల్డ్ ఛాంపియన్ షిప్ ఫార్ములా ఈ రేస్ విజయవంతంగా ముగిసింది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన రేసు గంటన్నర పాటు కొనసాగింది. హుస్సెన్ సాగర్ తీరంలో 2.8కిలోమీటర్ల నిడివితో ప్రత్యేకంగా నిర్మించిన సర్క్యూట్‌పై మొత్తం 11 జట్లు, 22 మంది రేసర్లు తమ కార్లను పరుగులు పెట్టించారు. తొలిసారి ప్రవేశపెట్టిన అత్యాధునిక జెన్‌3 కార్లతో గంటకు 322 కిలోమీటర్ల వేగంతో రేసర్లు తమ సత్తా చాటుకున్నారు. ఈ పోటీల్లో వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ విజేతగా జీన్‌ ఎరిక్‌ నిలిచాడు. ఆ తర్వాత రెండో స్థానంలో నిక్‌ క్యాసిడీ, మూడో స్థానంలో సెబాస్టియన్‌ బ్యూమి ఉన్నారు. తాజా విజయంతో అతను మూడోసారి ఛాంపియన్‌గా అవతరించాడు. ఈ సందర్భంగా విజేత జీన్ ఎరిక్ కు మంత్రి కేటీఆర్ ట్రోఫీని అందజేశారు. ఈ రేసింగ్ లో విదేశీ కంపెనీలు, రేసర్లదే హావా నడిచింది. భారతం నుంచి మహింద్ర రేసింగ్, టీసీఎస్ జాగ్వార్ బరిలోకి దిగాయి.

తరలివచ్చిన తారలు:

దేశంలోనే తొలిసారి జరుగుతున్న ఫార్ములా ఈ రేస్ ను చూసేందుకు సెలబ్రిటీలు క్యూ కట్టారు. సినీ, క్రీడా, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖుల రాకతో అభిమానుల్లో జోష్ కనిపించింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, టాలీవుడ్ యాక్టర్స్ రామ్ చరణ్, సిద్దు జొన్నలగడ్డ, నాగ చైతన్య, అఖిల్, మహేశ్ బాబు సతీమణి నమ్రత, కుమారుడు గౌతమ్, జూనియర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి, నారా బ్రాహ్మణి, క్రికెటర్లు సచిన్‌ టెండూల్కర్‌, శిఖర్‌ ధావన్‌, దీపక్‌ చాహర్‌ తో పాటు పలువురు ప్రముఖులు ఈ పోటీలను చూసేందుకు తరలి వచ్చారు.

పెద్ద మనసుతో క్షమించాలి:

ఫార్ములా ఈ రేసింగ్ పట్ల నగర వాసుల్లో భిన్న స్వరాలు వినిపించాయి. ప్రపంచస్థాయి రేసింగ్ వల్ల ఓ వైపు హర్షం వ్యక్తం అవుతుంటే మరో వైపు ఈ పోటీల వల్ల ఏర్పడిన ట్రాఫిక్ జామ్ నగర వాహనదారులకు చుక్కలు చూపించింది. ఖైరతాబాద్, లక్డికపూల్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ పరిసర ప్రాంతాల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవడంతో మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ రేసింగ్ వల్ల ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు ఏర్పడిన మాట వాస్తవమేనని పెద్ద మనసుతో క్షమించాలని కోరారు. హైదరాబాద్ ను విశ్వనగరంగా మార్చే క్రమంలో కొంత ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలతో హైదరాబాద్ బ్రాండ్ అంతర్జాతీయ స్థాయిలో మార్మొగుతుందని చెప్పారు.

Next Story

Most Viewed