నాడు బీఆర్ఎస్.. నేడు బీజేపీ.. మరి రిజల్ట్ ఎలా ఉండబోతోంది?

by Rajesh |
నాడు బీఆర్ఎస్.. నేడు బీజేపీ.. మరి రిజల్ట్ ఎలా ఉండబోతోంది?
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు గులాబీ పార్టీకి అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 10 కాగా అనూహ్యంగా ఆ పార్టీ 2014లో అధికారం దక్కించుకుంది. కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతామని ప్రకటించిన కేసీఆర్ తదనంతరం సొంతంగానే బరిలో నిలిచి సత్తా చాటారు. ప్రత్యేక రాష్ట్ర పోరులో ముందున్న పార్టీకి తెలంగాణ ప్రజలు సైతం మొదటిసారి పట్టం కట్టారు. రెండో దఫా సంక్షేమ పథకాలతో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. అయితే ప్రస్తుతం బీజేపీ సైతం 2023 ఎన్నికల్లో తాము అధికారంలోకి రావడం ఖాయమంటూ దూకుడుగా ముందుకు సాగుతోంది. కానీ ఆ పార్టీకి క్యాండిడెట్ల సమస్య వెంటాడుతోంది.

ఈ నేపథ్యంలో ఇటీవల తెలంగాణలో పర్యటించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా టీ బీజేపీ నేతలకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లలోని అసంతృప్త నేతలతో చర్చించి పార్టీకి ప్రయోజనకరమని భావిస్తే వారిని పార్టీలోకి తీసుకువచ్చేందుకు కృషి చేయాలని తెలిపారు. 2023లో అధికారమే లక్ష్యంగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. కాగా బీజేపీలోకి వలసలు క్రమంగా మందగించడం ఆ పార్టీలో ఆందోళనకరంగా మారింది.

మునుగోడు ఎన్నికల ఫలితాల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలిస్తే ఆ పార్టీలోకి వలసలు పెరగడంతో పాటు తెలంగాణలో బీజేపీ దూకుడుగా వ్యవహరించనుందని గ్రహించిన గులాబీ బాస్ మొత్తం బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలను అక్కడ మోహరించి మార్జిన్ మెజారిటీతో తమ అభ్యర్థిని గెలిపించుకున్నారు. తదనంతరం బీజేపీ పార్టీలోకి చేరికలు నెమ్మదించాయి. 2023లో తెలంగాణలో సత్తా చాటాలంటే బీజేపీలోకి చేరికలే ఆ పార్టీకి ప్రస్తుతం దిక్కుగా మారాయి. అన్ని స్థానాల్లో రేసు గుర్రాలాంటి అభ్యర్థులు కొరవడిన వేళ కమలం పార్టీ పెద్దలు గుర్తింపు పొందిన నేతలకు వల వేసే పనిలో ఉన్నారు.

సిట్టింగ్‌లకే సీటు వంటి సీఎం కేసీఆర్ స్టేట్‌మెంట్‌తో సందిగ్ధం‌లో ఉన్న అసంతృప్త నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నా.. వేచి చూసే ధోరణినే అవలంభించడం బీజేపీ పార్టీకి మైనస్‌లా మారింది. బీజేపీ ఎన్నికల్లో సత్తా చాటాలంటే తమ గెలుపుతో పాటు జిల్లా వ్యాప్తంగా ప్రభావితం చూపే పొంగులేటి వంటి లీడర్ల అవసరం ఉంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీజేపీలోకి వస్తారనే చర్చ సాగినా అది కూడా ప్రస్తుతానికి పెండింగ్‌లోనే పడింది.

ఎన్నికలకు కొన్ని నెలలు మాత్రమే ఉండటం, ముందస్తు ఊహాగానాల నేపథ్యంలో ఆ పార్టీకి ఇప్పుడు ఎన్నికల్లో పోటీకి టగ్‌ అఫ్‌ వార్ లీడర్ల అనివార్యత ఏర్పడింది. తెలంగాణలో అధికారంలోకి వస్తామని బీజేపీ నేతలు చెబుతున్నా క్షేత్ర స్థాయిలో ఓటర్లను ప్రభావితం చేసే నేతలు ఉన్నారా అంటే మాత్రం సమాధానం దొరకడం లేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రెండు దఫాలుగా గెలిపించిన ఓటర్లలో ఉన్న అంసతృప్తి బీజేపీకి లాభించే అవకాశం ఉన్నా బలమైన నేతలు, ఓటర్లను తమ వైపునకు తిప్పుకునే చరిష్మా ఉన్న నేతలు లేక పోవడం బీజేపీలో టెన్షన్‌కు కారణమవుతోంది.

కాంగ్రెస్‌లో అంతర్గత పోరు, బీజేపీకి అభ్యర్థుల కొరత బీఆర్ఎస్‌కు ప్లస్ పాయింట్‌గా మారింది. కాగా 2014కు ముందు ఇదే పరిస్థితిని అప్పటి టీఆర్ఎస్ చవి చూసింది. అంతా కొత్త నేతలతో కేసీఆర్ సొంతంగా ఎన్నికల్లోకి దిగారు. అప్పుడు కేవలం గుర్తింపు ఉన్న ఐదు నుంచి పది మది నేతలు మాత్రమే గెలుపుపై ధీమాగా ఉండగా తెలంగాణ కోసం పోరాడిన పార్టీకి ప్రజలు పట్టం కట్టారు. అనేక మంది కొత్త అభ్యర్థులు తొలి సారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. బీజేపీలో సైతం ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తమకు కలిసొస్తుందనే ధీమా నెలకొంది. ప్రస్తుతం బీజేపీకి కొంత పాజిటివ్ వేవ్ ఉన్న నేపథ్యంలో కొత్త అభ్యర్థులు ఏ మేరకు ప్రభావం చూపుతారు.. 2014 ఎన్నికల్లో అప్పటి టీఆర్ఎస్ పార్టీకి కలిసొచ్చినట్లు ప్రస్తుతం బీజేపీకి కలిసొస్తుందా.. వంటి అంశాలపై మరికొన్ని రోజుల్లో క్లారిటీ రానుంది.

Next Story

Most Viewed