రాష్టానికి రెడ్ అలెర్ట్.. 14 జిలాల్లో డేంజర్ జోన్స్

by Dishafeatures2 |
రాష్టానికి రెడ్ అలెర్ట్.. 14 జిలాల్లో డేంజర్ జోన్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్టంలో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే ఉష్ణోగ్రతలు అమాంతంగా పెరిగిపోయాయి. గడిచిన 24 గంటల్లో కరీంనగర్, జనగాం, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక నేటి నుండి ఉత్తర తెలంగాణలో 14 జిల్లాలు నల్గొండ , సూర్యాపేట , ఖమ్మం , మహబూబాబాద్, భద్రాద్రి , వరంగల్ , హన్మకొండ , కొమురం భీం , కరీంనగర్ , ములుగు , జయశంకర్ భూపాలపల్లి , పెద్దపల్లి , జగిత్యాల , మంచిర్యాల జిల్లాలో ఈ వడగాల్పుల ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు .

వచ్చే గురువారం వరకు జాగ్రత్త !

ఇక రాష్ట వ్యాప్తంగా మే 14 నుంచి 18 వరకు కొన్ని ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి . రోజువారీ వాతావరణ నివేదికలో ఆదివారం మే 14 వ తేదీ నుండి నుండి 18 మే వరకు రాష్ట్రంలో పొడి వాతావరణం చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ఆదివారం తెలంగాణలోని చాలా చోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ పైబడే నమోదయ్యాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఈ ఎండల ప్రభావం తీవ్రంగా ఉండబోతుందని అధికారులు పేర్కొన్నారు . బొగ్గుగనుల ఉన్నా జిల్లాలో ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉంది . ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఎండలోకి రావడం వలన తీవ్ర అనారోగ్యం పాలు కావడంతో పాటు వడగాల్పులకు చనిపోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు .

పగలు ఎండ.. రాత్రి ఉక్కపోత!

జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో రాత్రి పగలు తేడా లేకుండా ప్రజలు ఉక్కపోతతో అల్లాడుతున్నారు. కొన్ని రోజుల క్రితం పగటివేళ ఎండకాసినా.. రాత్రి సమయంలో మాత్రం చలి గాలులు వీచాయి. దీంతో ప్రజలు కొంత ఉపశమనం పొందారు. అయితే ప్రస్తుతం వాతావరణంలో మార్పు వచ్చింది. పగటిపూట ఎండలు దంచి కొడుతుండగా రాత్రి వేళలో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉష్ణోగ్రతలు పెరగడంతో వివిధ పనుల నిమిత్తం వచ్చే వారు దాహంతో ఇబ్బంది పడుతున్నారు. మండుటెండలు మొదలవడంతో నిరాశ్రయులు, కార్మికులు, ఫుట్‌పాత్‌ వ్యాపారులు, ట్రాఫిక్‌ పోలీసులు నానా యాతన పడుతున్నారు. రాబోయే రోజుల్లో వడ గాలులు కూడా వీచే అవకాశాలున్నాయంటూ వాతావరణశాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

వడదెబ్బ లక్షణాలు

వేసవిలో ఎక్కువ మంది వడదెబ్బ భారిన పడుతుంటారు. పిల్లల నుంచి పెద్ద వారి వరకు వడదెబ్బ భారిన పడి ప్రాణాలను సైతం కోల్పోతుంటారు. దీంతో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వడదెబ్బ తగిలినప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై తగు సూచనలు చేస్తున్నారు.

వడదెబ్బ తగిలినప్పుడు తీవ్రమైన శరీర ఉష్ణోగ్రన పెరిగి తలనొప్పి రావడం, నాడి వేగంగా కొట్టుకోవడం, నాలుక ఎండిపోవడం, చర్మం ఎండిపోవడం, నీరసంగా ఉంటూ తడబడటం, శరీరం నీటి శాతం కోల్పోవడం, మూత్రం పసుపు రంగులో ఉండి మంటగా రావడం, పాక్షికంగా లేదా పూర్తిగా అపస్మారక స్థితిలోకి చేరడం లాంటివి ఉంటాయి .అట్లాంటప్పుడు వడదెబ్బ తగిలినట్టు గుర్తించాలి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు :

> వడదెబ్బ తగిలిన వ్యక్తిని త్వరగా చల్లని గాలి ఉన్న నీడ ప్రదేశానికి తరలించి దుస్తులు వదులుచేసి చల్లని గాలి తగిలేలా చేయాలి.

> వడదెబ్బ తగిలి అపస్మారక స్థితిలో ఉన్నవ్యక్తికి నీరు తాగించకూడదు.

> వీలయినంత త్వరగా దగ్గరలోని ఆసుపత్రికి తరలించాలి.

> నీరు, పళ్ల రసాలు, ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.

> నలుపు మందంగా ఉండే వాటికి బదులు లేత రంగుల్లో లభించే తేలికైన కాటన్‌ దుస్తులను ధరించాలి.

> రోజు కనీసం 15 గ్లాసుల నీళ్లు తాగాలి.

> ఆహారం తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు తీసుకోవాలి.

> ఇంట్లో కిటికీలు తెరిచి ఉంచాలి.

Next Story

Most Viewed