తెలంగాణ చరిత్రలో అరుదైన రికార్డు.. అధికారికంగా ప్రకటించిన మంత్రి

by Disha Web Desk 2 |
తెలంగాణ చరిత్రలో అరుదైన రికార్డు.. అధికారికంగా ప్రకటించిన మంత్రి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఈ వానాకాలం రాష్టంలో 65 లక్షల ఎకరాల్లో వారి సాగయిందని ఇప్పటివరకు ఇది అత్యధికమని రాష్ట్ర చరిత్రలో ఇది ఒక రికార్డ్ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. వానాకాలం పంటల పరిస్థితి, రబీ సాగుకు సన్నద్ధం, రుణమాఫీ అమలు, ఆయిల్ పామ్ సాగుపై బుధవారం సచివాలయంలోని సమావేశ మందిరంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 12 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు.. లక్ష 93 వేల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారని మంత్రి తెలిపారు. ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు అందుబాటులో ప్రోత్సాహకాలను అందిస్తున్నామన్నారు. ఈ యాసంగికి రైతులకు అందుబాటులో విత్తనాలు, ఎరువులు ఉన్నాయని తెలిపారు. సుమారు 75 నుండి 80 లక్షల ఎకరాల్లో రబీ పంటలు సాగవుతాయని అంచనా వేస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు. రబీ పంటల సాగుకోసం అన్ని రకాల ఎరువులు కలిపి 18.64 లక్షల మెట్రిక్ టన్నులు కేటాయించడం జరిగిందన్నారు.

రూ.11,812.14 కోట్లు రుణమాఫీ..

రాష్టంలో ఇప్పటివరకు 21 ,34 ,949 రైతుల ఖాతాలో రూ.11,812.14 కోట్లు రుణమాఫీ జమ చేశామని తెలిపారు. రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతుందని.. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. బ్యాంకు ఖాతా మూతపడడం కారణంగా, సాంకేతిక కారణాలతో, బ్యాంకుల నుండి తిరిగి వెళ్లిన రుణ మాఫీ నగదు కాని లేదా మరే కారణం వలన తిరిగి వెళ్లిన అందరి రైతుల రుణమాఫీ చేస్తామన్నారు. రుణమాఫీపై సందేహాలున్న రైతులు క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులను సంప్రదించాలన్నారు. రుణమాఫీ సందేహాల నివృత్తి కొరకు రాష్ట్రస్థాయిలో 040 23243667 నంబరులో సంప్రదించాలని మంత్రి సూచించారు. ఇప్పటివరకు పెండింగులో ఉన్న రైతుభీమా క్లెయిములన్నీ వేగంగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. రైతులు రసాయనిక ఎరువులు తగ్గించుకుని నేల ఆరోగ్యం పెంపొందించుకునేందుకు సేంద్రీయ ఎరువుల వాడకాన్ని పెంచుకోవాలను కోరారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ప్రత్యేక కమీషనర్ హన్మంతు కొండిబ, అదనపు సంచాలకులు విజయ్ కుమార్, అగ్రోస్ ఎండీ రాములు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed