'సీఎం కేసీఆర్ ఆ ఒక్కటి గుర్తుంచుకుంటే చాలు'

by Disha Web Desk 2 |
సీఎం కేసీఆర్ ఆ ఒక్కటి గుర్తుంచుకుంటే చాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: బిహార్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ ముక్త్ భారత్‌కు పిలుపునివ్వడం హాస్యాస్పదమని, రాష్ట్ర ప్రజలంతా కేసీఆర్ ముక్త్ తెలంగాణ కావాలని కోరుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్ చుగ్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బీజేపీ అంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అంత కోపం ఎందుకోనని, ఆయన ఆగ్రహానికి కారణాలేంటోనని ఆయన ప్రశ్నించారు. ప్రపంచమంతా ప్రధాని మోడీని మెచ్చుకుంటుంటే కేసీఆర్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారోనన్నారు. కొవిడ్ మహమ్మారి సమయంలో పేదలకు ఉచిత రేషన్ ఇవ్వడం ద్వారా 80 కోట్ల మంది ప్రజలను రక్షించినందుకు కేసీఆర్‌కు కోపమా అంటూ ఎద్దేవా చేశారు.

దేశ జనాభాకు 200 కోట్ల డోసులకు పైగా ఉచిత వ్యాక్సిన్‌ అందించినందుకా అని తరుణ్​చుగ్ ప్రశ్నించారు. మహిళలకు 12 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా ఇచ్చినందుకా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. 12 కోట్లకు పైగా మరుగుదొడ్లు కట్టించినందుకా? లేక ఆయుష్మాన్ భారత్ కింద 50 కోట్ల జనాభాకు ఉచిత ఆరోగ్య బీమా కల్పించినందుకా? 2 కోట్లకు పైగా ఇళ్లు కట్టించినందుకు ప్రధాని మోడీని సీఎం కేసీఆర్ వ్యతిరేకిస్తున్నారా? అంటూ నిలదీశారు. సీఎం కేసీఆర్, ప్రధాని మోడీపై ఉపయోగించిన భాషను తీవ్రంగా ఖండిస్తున్నానని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బిహార్ పర్యటనలో కేసీఆర్ మెచురిటీ లేనట్లుగా వ్యవహరించారన్నారు. బీజేపీ ముక్త్ భారత్ ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ఆకాశంపై ఉమ్మెస్తే తిరిగి తన మీదే పడుతుందనే విషయాన్ని కేసీఆర్ గుర్తు పెట్టుకోవాలని తరుణ్ చుగ్ సూచించారు. ముఖ్యమంత్రికి రోజులు దగ్గర పడ్డాయని, మోడీపై పనికిరాని భాషను వినయోగించడం మానుకోవాలని హెచ్చరించారు. కేసీఆర్ కుటుంబ, అవినీతి పాలనను పారద్రోలి టీఆర్ఎస్ ముక్త్ చేసేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.

Next Story

Most Viewed