కవిత వాట్సాప్ చాటింగ్లో ఉంది ఇదే..!

by Dishafeatures2 |
కవిత వాట్సాప్ చాటింగ్లో ఉంది ఇదే..!
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మంత్రి సత్యేంద్ర జైన్ తదితరుల ఆదేశాల మేరకు హైదరాబాద్ లోని బీఆర్ఎస్ ఆఫీసులో కవితకు అరుణ్ పిళ్ళై ద్వారా డబ్బులు అందజేసినట్లు సుఖేశ్ చంద్రశేఖర్ మరోమారు నొక్కిచెప్పారు. ఈ డబ్బుకు సంబంధించి కవితతో జరిపిన వాట్సాప్ చాటింగ్ స్క్రీన్ షాట్లను బుధవారం మీడియాకు న్యాయవాది ద్వారా విడుదల చేశారు. అధికారంలో వివిధ పదవులు అనుభవిస్తున్న కేజ్రీవాల్, సత్యేంద్రజైన్, ఎమ్మెల్సీ కవితలు అవినీతికి పాల్పడ్డారని, వారి మధ్య అనేక రూపాల్లో ఆర్థిక సంబంధాలు ఉన్నాయని, 2020లోనే తాను తన మనిషి ద్వారా రూ 15 కోట్లను హైదరాబాద్ లో అందించానని తెలిపారు. ఈ అవినీతి వ్యవహారంపై సమగ్ర స్థాయిలో దర్యాప్తు జరిపించాలని కేంద్ర హోం మంత్రి, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (డైరెక్టర్), సీబీఐ డైరెక్టర్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అడ్రస్ చేస్తూ రాసిన లేఖను మీడియాకు విడుదల చేశారు. ప్రస్తుతం మనీ లాండరింగ్ కేసులో ఈడీ అరెస్టు చేయడంతో జ్యుడిషియల్ రిమాండ్ లో భాగంగా అండర్ ట్రయల్ ఖైదీగా మండోలి జైలులో ఉన్నారు. తన లాయర్ ద్వారా ఈ లేఖను విడుదల చేశారు.

సుఖేశ్ చంద్రశేఖర్ లేవనెత్తిన అంశాలు :

= కేజ్రీవాల్ ఆదేశం మేరకు హైదరాబాద్ లో బీఆర్ఎస్ ఆఫీసులో అరుణ్ రామచంద్ర పిళ్లయ్ కు రూ. 15 కోట్లను 2020లో ఇచ్చాను.

= కవిత చెప్పిన చోటు వెళ్ళి తన మనిషి అందించారు.

= మనీష్ సిసోడియా నొక్కి చెప్పడంతో నిర్దిష్ట టైమ్ ప్రకారం పని పూర్తి చేశాను.

= ఇదే విషయాన్ని ఆప్ పెద్దలకు చెప్పాల్సిందిగా కవితను రిక్వెస్టు చేశాను

= ఆమె కూడా మెసేజ్ ద్వారా మనీష్ కు అప్పటికే డబ్బు ముట్టినట్లు కన్ ఫర్మ్ చేసినట్లు నాకు మెసేజ్ పెట్టారు.

ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ కుంభకోణంపై దర్యాప్తు ఎలాగూ జరుగుతున్నందున ఆమ్ ఆద్మీ పార్టీ పెద్దలకు, కవితకు మధ్య ఉన్న ఆర్థిక సంబంధాలు కూడా తాను లేవనెత్తిన అంశాలపై విచారణ జరిపిస్తే వెలుగులోకి వస్తాయి. తాను నేరస్తుడినంటూ ముద్ర వేస్తున్నారుగానీ తగిన ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడంలేదని గత వారం విడుదల చేసిన లేఖలోనే సుఖేశ్ పేర్కొన్నారు. మండోలి జైలులో ఉన్నందున సంబంధిత అధికారుల నుంచి అనుమతి తీసుకున్న తర్వాత తన దగ్గర ఇప్పటికే ఉన్న 703 వాట్సాప్ చాటింగ్ స్కీన్ షాట్లలో రెండింటిని మాత్రం ఇప్పుడు విడుదల చేస్తున్నట్లు తాజా లేఖలో పేర్కొన్నారు. డిల్లీ లిక్కర్ స్కామ్ లో వీరి మధ్య ఉన్న సంబంధాలపై ఇప్పటికే సీబీఐ, ఈడీ పలు చార్జిషీట్లలో పేర్కొన్నాయని, తాను ప్రస్తావించిన వాటి వెలుగులో కూడా దర్యాప్తు జరిపించాలని ఐదుగురిని ఉద్దేశిస్తూ రాసిన లేఖలో సుఖేశ్ పేర్కొన్నారు.

సుఖేశ్ వాట్సాప్ స్క్రీన్ షాట్లలో ఉన్నదేంటి?

సుఖేశ్ : అక్కా.. సారీ.. ఇబ్బంది పెడుతున్నా.. చిన్న వివరాలు కావాలి.

కవిత : హాయ్... ఇప్పుడే మీ మెసేజ్ చూశాను.

సు : నో ప్రాబ్లమ్ అక్కా... ఏకే (అరవింద్ కేజ్రీవాల్) ప్యాకేజిని మీకు ఇవ్వాల్సి ఉన్నది. ఇప్పుడు నా దగ్గర రెడీగా ఉన్నది.

క : ఎస్... ఓకే

సు : నేను దీన్ని జేహెచ్ (జూబ్లీ హిల్స్) ఇంటికి పంపించనా?

క : వద్దు.. వద్దు... అరుణ్ కు నేను ఫోన్ చేసి నీతో మాట్లాడమని చెప్తాను. దీన్ని ఆఫీసుకు పంపించాల్సి ఉంటుంది.

సు : ఓకే అక్కా.. మీరు చెప్పినట్లు చేస్తాను.

క : అతను (అరుణ్ రామచంద్ర పిళ్లై) కొద్దిసేపట్లో మీకు ఫోన్ చేస్తాడు.

సు : షూర్ అక్కా.. ఎస్ జే (సత్యేంద్ర జైన్) బ్రదర్ ఈ రోజే మీకు చేరవేయాల్సిందిగా చెప్పారు.

క : ఎస్..

సు : నేను సమన్వయం చేసుకుంటానులే అక్కా..

క : మీ వైపు నుంచి అంతా ఓకే కదా... మీ డాడీకి ఆరోగ్యం ఇప్పుడెలా ఉన్నది?

సు : వాకబు చేస్తున్నందుకు కృతజ్ఞతలు అక్కా.. ప్రస్తుతం కెమో థెరఫీ జరుగుతూ ఉన్నది.

క : వెంటనే కోలుకుని బైటకు రావాలని కోరుకుంటున్నాను.

సు : ఎస్ అక్కా.. దేవుడు కూడా అదే చేస్తాడనుకుంటున్నాను.

క : టీసీ (టేక్ కేర్). నేను మళ్ళీ మాట్లాడతాను.

సు : ఓకే అక్కా.. మీ ఇష్టం.. ఎప్పుడైనా.. కేసీఆర్ గారిని అడిగినట్లు చెప్పండి.

క : నమస్తే ఎమోజీ పోస్టింగ్

సు : అక్కడా.. డెలివరీ చేసేశాను.

క : ఓకే..

సు : అక్కా.. ఏకే (అరవింద్ కేజ్రీవాల్) గారికి లేదా ఎస్ జే (సత్యేంద్ర జైన్) ఇన్‌ఫామ్ చేయండి.

క : మనీష్ (మనీష్ సిసోడియా)తో మాట్లాడాను.

సు : ఓకే అక్కా.. థాంక్స్

Read more:

దిశ చేతిలో సుఖేశ్ చంద్రశేఖర్ వాట్సాప్ స్క్రీన్ షాట్లు....రూ.15 కోట్లు ముట్టింది ఎమ్మెల్సీ కవితకేనని వెల్లడి

Next Story

Most Viewed